Begin typing your search above and press return to search.

పవన్‌ కళ్యాణ్‌ పలికిన ఆ ఒక్క పదం పైనే చర్చంతా!

By:  Tupaki Desk   |   13 Jan 2023 6:43 AM GMT
పవన్‌ కళ్యాణ్‌ పలికిన ఆ ఒక్క పదం పైనే చర్చంతా!
X
ఆంధ్రప్రదేశ్‌ లో వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావాలని జనసేనాని పవన్‌ కళ్యాణ్‌ ఆశిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వ వ్యతిరేక ఓటును ఎట్టి పరిస్థితుల్లోనూ చీలనివ్వబోనని పవన్‌ చెబుతున్నారు. ఈ క్రమంలో జనసేన–టీడీపీ–బీజేపీ కలసి పోటీ చేయాలనేది పవన్‌ ఉద్దేశంగా కనిపిస్తుందని అంటున్నారు. మరోవైపు బీజేపీ.. టీడీపీని తమతో కలుపుకోవడానికి నిరాసక్తత వ్యక్తం చేస్తోంది. అయితే వచ్చే ఎన్నికల నాటికి బీజేపీ సైతం జనసేన, టీడీపీ కూటమితో కలుస్తుందనే అంచనాలు ఉన్నాయి.

కాగా తాజాగా శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో జరిగిన జనసేన పార్టీ యువశక్తి సభలో పవన్‌ కళ్యాణ్‌ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. వచ్చే ఎన్నికల తర్వాత ఏపీలో జనసేన ప్రభుత్వం వస్తుందని లేదంటే మిశ్రమ ప్రభుత్వం వస్తుందని స్పష్టం చేశారు.

గత ఎన్నికల ముందు శ్రీకాకుళం జిల్లా రాజాంలో జరిగిన సభకు భారీ ఎత్తున వచ్చారని.. వాళ్లందరినీ చూసి తాను ఆశపెట్టుకున్నానన్నారు. అయితే ఓట్లు మాత్రం వేయలేదన్నారు. ఈసారి అలా కాకూడదని.. నినాదాలు చేయడం కాకుండా ఇక్కడకు వచ్చిన యువత అంతా ఓట్లేయాలని కోరారు. మీరు ఓటేస్తే అని గ్యారెంటీ ఇస్తే వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా జనసేన పోటీ చేస్తుందన్నారు. గౌరవంగా ఉంటే పొత్తులకు వెళ్దామని తెలిపారు. ఒంటరిగా వెళ్దాం లేదంటే పోరాటం చేద్దామన్నారు. వీర మరణం మాత్రం వద్దని సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఈ నేపథ్యంలో వైసీపీ నేతలు సైతం పవన్‌ కల్యాణ్‌.. వీర మరణం అని మాట్లాడిన వ్యాఖ్యలపై వైసీపీ నేతలు సైతం ఎద్దేవా చేస్తున్నారు. ''నాకు తెలిసింది పోరాటమే.. ఒంటరిగా పోటీ చేస్తే వీరమరణమే..'క్యా బాత్‌ హై..!' అంటూ ఏపీ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ ట్వీట్‌ చేయడం విశేషం.

మరోవైపు సాధారణంగా వీర మరణం అనే మాటను సైనికులు ఎవరైనా చనిపోయినప్పుడు వాడుతుంటారు. ఏదైనా యుద్ధాలు, ఉగ్రవాదులు, తీవ్రవాదుల ఎన్‌ కౌంటర్లలో ఎవరైనా సైనికులు మృతి చెందితే వారిని వీరులుగా భావిస్తున్నారు. ఈ క్రమంలో మరణించిన సైనికులను వీర మరణం పొందారని పేర్కొంటారు.

ఈ నేపథ్యంలో పవన్‌ కళ్యాణ్‌ వీర మరణం అనే మాటను ఏ ఉద్దేశంతో వాడి ఉంటారనేదానిపై తీవ్ర చర్చ జరుగుతోంది. వైసీపీ నేతలను పవన్‌ పలుమార్లు గూండాగాళ్లుగా అభివర్ణించారు. తాజాగా సైకో గాళ్లని వ్యాఖ్యానించారు. అలాగే వైసీపీ నేతలను ఉగ్రవాదులు, తీవ్రవాదులుగా పవన్‌ భావిస్తున్నారని.. అందుకే ఎన్నికల్లో ఓడిపోతే వీర మరణమే అని వ్యాఖ్యానించి ఉండొచ్చని విశ్లేషిస్తున్నారు.

సాధారణంగా వీర మరణం పొందిన సైనికులను ఆ దేశ ప్రజలు చిరకాలం గుర్తుంచుకుంటారు. వారిని దేశభక్తులుగా భావించి గౌరవిస్తుంటారు. మృతి చెందిన సైనికుల తల్లులను వీర మాతలుగా కొనియాడుతుంటారు. ఈ నేపథ్యంలోనే పవన్‌ కళ్యాణ్‌ పొత్తులు లేకపోతే ఎన్నికల్లో వీర మరణమే అని వ్యాఖ్యానించి ఉంటారని అంటున్నారు,

అయితే పొత్తులతో వెళ్తేనే వచ్చే ఎన్నికల్లో విజయం సాధించగలమని పవన్‌ కళ్యాణ్‌ తేల్చిచెప్పినట్టు అభిప్రాయపడుతున్నారు. అలా కాకుండా ఒంటరి పోరాటం చేస్తే వీర మరణమే అనడం ద్వారా ఒంటరి పోరు చేస్తే ఓడిపోవడానికి అవకాశాలుంటాయని పవన్‌ తన మాటల ద్వారా పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారని అంటున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.