Begin typing your search above and press return to search.

స్వర్ణ ప్యాలెస్ ఇష్యూ: దొంగను దొంగే దొంగ దొంగ అంటున్నాడా?

By:  Tupaki Desk   |   10 Aug 2020 4:20 PM GMT
స్వర్ణ ప్యాలెస్ ఇష్యూ: దొంగను దొంగే దొంగ దొంగ అంటున్నాడా?
X
విజయవాడ కోవిడ్ కేర్ సెంటర్ లో అగ్ని ప్రమాదం జరిగి 12మంది మృత్యువాతపడ్డ సంఘటన దేశవ్యాప్తంగా సంచలనమైంది. విజయవాడలోని స్వర్ణ ప్యాలెస్ ఖాళీగా ఉందని రమేశ్ ఆస్పత్రికి అద్దెకు ఇచ్చారు. దీనికి ప్రభుత్వం పర్మిషన్ కూడా ఇచ్చింది. ఆస్పత్రికి సరిపడా రక్షణ, అగ్నిమాపక భద్రత దీనికి ఏవీ లేకున్నా.. అవన్నీ చూసుకోకుండా ప్రభుత్వ అధికారులు గుడ్డిగా అనుమతి ఇచ్చారనే ఆరోపణలున్నాయి.

స్వర్ణ ప్యాలెస్ కు డబ్బులు.. రమేశ్ ఆసుపత్రికి డబ్బులు.. ప్రభుత్వానికి తాము పడకలు ఇచ్చామని వాళ్లకు పేరు.. అన్నీ లాభాలే అని చెప్పుకున్నారు. ఇప్పుడు మాత్రం తప్పు జరిగాక అందరూ తప్పించుకుంటున్నారు. మీదంటే మీదు తప్పు అని ఒకరి మీద ఒకరు చెప్పుకుంటూ నెపాన్ని నెట్టేస్తున్నారు.

స్వర్ణ ప్యాలెస్ ఘటనలో కరోనా రోగులు చనిపోతే వారికి నష్టపరిహారంగా ఇచ్చే డబ్బులు మాత్రం సామాన్య ప్రజలు కట్టిన పన్నుల నుంచే ఇవ్వాల్సి రావడం మన దౌర్భాగ్యం అని పలువురు మేధావులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తప్పు చేసిన స్వర్ణ ప్యాలెస్ ఇవ్వదు.. తప్పు చేసిన రమేశ్ ఆసుపత్రి ఇవ్వదు.. కానీ ప్రభుత్వం మాత్రం ఇస్తూ.. బాధ్యులైన వారిపై కంటితుడుపు చర్యగా ‘‘ఎంత పెద్దలు ఈ దారుణం వెనుక ఉన్నా కేసులు పెడుతాం’’ అంటూ ఒక బిల్డప్ మాత్రం ఇస్తోందని ఎద్దేవా చేస్తున్నారు

ఇంత అగ్ని ప్రమాదం.. మరణాలకు కారణమైన కోవిడ్ సెంటర్ నిర్వహణకు పర్మిషన్ ఇచ్చిన అధికారులను ప్రభుత్వం ఎందుకు సస్పెండ్ చేయడం లేదని బాధితుల కుటుంబ సభ్యులు ప్రశ్నిస్తున్నారు. ఇది అంతా చూస్తుంటే సామాన్యుల ప్రాణాలు పోవాలి.. సామాన్యుల ట్యాక్సులు పోవాలి అన్న చందంగా ఉందన్న ఆవేదన అందరిలో కలుగుతోంది. ప్రభుత్వం తీరు చూస్తుంటే దొంగను దొంగే దొంగ దొంగ అన్నట్టు ఉందని సెటైర్లు పడుతున్నాయి.