Begin typing your search above and press return to search.

తెలంగాణ టార్గెట్ చేసి.. ఏపీలో ఎందుకు చ‌క్రం తిప్పుతున్నారు?

By:  Tupaki Desk   |   17 July 2019 7:42 AM GMT
తెలంగాణ టార్గెట్ చేసి.. ఏపీలో ఎందుకు చ‌క్రం తిప్పుతున్నారు?
X
టార్గెట్ తెలుగు రాష్ట్రాలంటూ గ‌డిచిన కొద్ది రోజులుగా మోడీషాలు కొత్త ఆప‌రేష‌న్ కు తెర తీశారు. సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ఘ‌న విజ‌యం సాధించిన త‌ర్వాత తెలంగాణ మీద ప్ర‌త్యేక దృష్టి పెట్ట‌టంతో పాటు.. 2023లో జ‌రిగే అసెంబ్లీ ఎన్నికల నాటికి తెలంగాణ‌లో పాగా వేయ‌ట‌మే ల‌క్ష్యంగా నిర్దేశించుకున్నారు. ఇందులో భాగంగా తెర వెనుక ప్ర‌య‌త్నాలు జోరుగా సాగుతున్నాయి.

ఇదిలా ఉంటే.. ఎన్నిక‌ల త‌ర్వాత రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్య‌మంత్రుల మ‌ధ్య పెరిగిన సాన్నిహిత్యం.. రెండు రాష్ట్రాలు ఇచ్చి పుచ్చుకునే ధోర‌ణిలో ప‌ట్టువిడుపులతో వ్య‌వ‌హ‌రిస్తున్న వైనంతో మోడీషాల క‌న్ను ఏపీ మీద కూడా ప‌డిన‌ట్లుగా చెబుతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో మొత్తం 42 ఎంపీ స్థానాలు ఉండ‌టంతో.. బ‌లంగా లేని ప్ర‌తిప‌క్షం కార‌ణంగా ఈ రెండు అధికార‌ప‌క్షాలు భ‌విష్య‌త్తులో 35 నుంచి 40 ఎంపీస్థానాల్ని చేజిక్కించుకుంటే..దేశంలోని మిగిలిన‌ ప్రాంతీయ పార్టీల‌తో క‌లిసి కేంద్రంలో ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసే అవ‌కాశం ఉంది.

ఎంత చెడినా.. కాంగ్రెస్ పార్టీ త‌క్కువ‌లో త‌క్కువ 70.. 80 స్థానాల్లో గెలుచుకునే అవ‌కాశం ఉంది. యూపీలో స‌మాజ్ వాదీ కానీ బ‌ల‌ప‌డి.. ప‌శ్చిమ‌బెంగాల్‌.. త‌మిళ‌నాడు.. ఒడిశా రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు క్లీన్ స్వీప్ చేస్తే.. కేంద్రంలో అధికార బ‌దిలీ ఖాయం. ఇప్ప‌టివ‌ర‌కూ కాంగ్రెస్‌.. బీజేపీ యేత‌ర ప్ర‌భుత్వాలు కేంద్రంలో ఏర్ప‌డిన ప్ర‌తిసారీ తెలుగు రాష్ట్రాల నుంచే ఎవ‌రో ఒక‌రు చ‌క్రం తిప్ప‌టాన్ని మ‌ర్చిపోకూడ‌దు.

అందుకే.. ఇప్ప‌టివ‌ర‌కూ నిర్ల‌క్ష్యం చేసిన తెలుగు రాష్ట్రాల్లో ప‌ట్టు సాధించాల‌ని.. అందుకు అవ‌స‌ర‌మైన సామ‌దాన దండోపాయాల్లో దేనినైనా బ‌య‌ట‌కు తీసేందుకు మోడీషాలు డిసైడ్ అయిన‌ట్లుగా చెబుతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని 42 ఎంసీ స్థానాల్లో క‌నీసం పాతిక పైగా త‌మ ఖాతాలోకి వ‌చ్చిన ప‌క్షంలో.. కేంద్రంలో మ‌రికొంత కాలం చ‌క్రం తిప్పే వీలుంద‌న్న విష‌యాన్ని గుర్తించిన క‌మ‌ల‌నాథులు.. అందుకు త‌గ్గ‌ట్లే ఆప‌రేష‌న్ తెలుగు రాష్ట్రాల‌న్న అంశానికి భారీ ప్రాధాన్య‌త ఇస్తున్న‌ట్లుగా చెబుతున్నారు.

దీనికి తోడు రెండు తెలుగు రాష్ట్రాల్లోని రాజ‌కీయ ప‌రిస్థితులు కూడా కార‌ణంగా చెబుతున్నారు. తెలంగాణ అధికార ప‌క్షంపై తెలంగాణ ప్ర‌జ‌ల్లో అసంతృప్తి నెల‌కొని ఉండ‌టం.. స‌రైన ప్ర‌తిప‌క్షం లేక ఎదురుచూస్తున్న వేళ‌.. గులాబీ ద‌ళానికి స‌రైన పోటీ ఇచ్చే స‌త్తా త‌మ‌కు మాత్ర‌మే ఉంద‌న్న విష‌యాన్ని క‌మ‌ల‌నాథులు చాటి చెబుతున్న వేళ‌.. త‌మ‌కు అవ‌కాశాలు బాగున్నాయ‌న్న ఆలోచ‌న‌లో ఉన్న‌ట్లు చెబుతున్నారు.

తెలంగాణ రాష్ట్రంలో ప‌రిస్థితి ఇలా ఉంటే.. ఏపీలో ప‌రిస్థితి మ‌రోలా ఉంద‌ని చెబుతున్నారు. జ‌గ‌న్ చారిత్ర‌క విజ‌యం నేప‌థ్యంలో విప‌క్షం ఉనికి లేని ప‌రిస్థితి. బాబు చేసిన త‌ప్పుల‌తో ఆ పార్టీ నుంచి బ‌య‌ట‌కు వెళ్లేందుకు నేత‌లు సిద్ధంగా ఉన్నారు. ఇదిలా ఉంటే.. ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో కొత్త వారిని పార్టీలో చేర్చుకోలేని ప‌రిస్థితుల్లో జ‌గ‌న్ ఉన్నారు. బాబు చేసిన త‌ప్పును దాదాపుగా చేయ‌కూడ‌న్న ప‌ట్టుద‌ల‌తో ఉన్న జ‌గ‌న్.. టీడీపీ నేత‌ల్లో చాలా త‌క్కువ‌మందిని మాత్ర‌మే చేర్చుకునే వీలుంది.

మ‌రోవైపు.. జ‌గ‌న్ ధాటికి బాబు త‌ట్టుకునే ప‌రిస్థితుల్లో లేర‌ని.. ప్ర‌జ‌ల్లోనూ టీడీపీ అధినేత‌పై తీవ్ర అసంతృప్తి ఉన్న నేప‌థ్యంలో.. ఏపీలో బ‌ల‌మైన రాజ‌కీయ పార్టీగా అవ‌త‌రించాల‌న్న ఆలోచ‌న‌లో బీజేపీ ఉన్న‌ట్లు చెబుతున్నారు. అవ‌స‌ర‌మైతే.. ఎన్నిక‌ల నాటికి జ‌న‌సేన‌తో జ‌త క‌డితే ఎన్నిక‌ల ప్ర‌యోజ‌నం పొందే వీలుంద‌న్న ఆలోచ‌న‌లో ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఈ కార‌ణంతోనే రెండు తెలుగు రాష్ట్రాల మీద మోడీషాలు ప్ర‌త్యేక క‌న్నేసిన‌ట్లుగా చెప్ప‌క త‌ప్ప‌దు.