Begin typing your search above and press return to search.

జగన్ ఢిల్లీ పర్యటన మళ్లీ రద్దు... కారణమిదే

By:  Tupaki Desk   |   11 Oct 2019 6:18 PM GMT
జగన్ ఢిల్లీ పర్యటన మళ్లీ రద్దు... కారణమిదే
X
ఏపీ సీఎం హోదాలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిర్దేశించుకున్న ఢిల్లీ పర్యటన వరుసగా రెండో రోజు కూడా వాయిదా పడిపోయింది. ఇటీవలి ఢిల్లీ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయిన జగన్... తదనంతరం మరోమారు ఢిల్లీ వెళ్లి బీజేపీ జాతీయ అధ్యక్షుడు, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో భేటీ కావాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవితో భేటీని కూడా జగన్ వాయిదా వేసుకున్నారు.

ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న మహారాష్ట్రలో అమిత్ షా బిజీబిజీగా ఉన్నారు. అక్కడి ఎన్నికల ప్రచారం నిమిత్తం మహారాష్ట్ర వెళ్లిపోయిన అమిత్ షా శుక్రవారం ఢిల్లీకి తిరిగి వస్తారన్న సమాచారంతో శుక్రవారం నాడే జగన్ ఢిల్లీకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. అయితే శుక్రవారం కూడా అమిత్ షా ఢిల్లీకి తిరిగి రాలేదు. మహారాష్ట్రలో హోరాహోరీగా సాగుతున్న ప్రచారం కారణంగానే అమిత్ షా ఢిల్లీకి తిరిగి రాలేదని తెలుస్తోంది. అమిత్ షాతో భేటీ కోసమో ఢిల్లీ పర్యటనను ఖరారు చేసుకున్న జగన్... అమిత్ షా ఢిల్లీలో లేకుంటే అక్కడికెళ్లి లాభం లేదు కదా. ఈ నేపథ్యంలో జగన్ తన ఢిల్లీ టూర్ ను మరోమారు వాయిదా వేసుకున్నారు.

తాజా సమాచారం ప్రకారం ఈ నెల 14న జగన్ ఢిల్లీకి వెళ్లనున్నట్లుగా సమాచారం. అప్పటిలోగా మహారాష్ట్ర నుంచి అమిత్ షా ఢిల్లీ తిరిగివస్తారన్న అంచనాతోనే జగన్ 14న ఢిల్లీ టూర్ ను ఖరారు చేసుకున్నట్లుగా సమాచారం. ఇదిలా ఉంటే... గురువారమే ఢిల్లీకి వెళ్లాలని భావించిన జగన్... అమిత్ షాతో భేటీ కావాలని నిర్ణయించుకున్నారు. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారానికి వెళుతున్నందున... గురువారం అమిత్ షా డిల్లీలో అందుబాటులో ఉండరన్న సమాచారంతో గురువారం కూడా జగన్ తన ఢిల్లీ టూర్ ను శుక్రవారానికి వాయిదా వేసుకున్న సంగతి తెలిసిందే. అయితే శుక్రవారం కూడా అదే పరిస్థితి తలెత్తడం జగన్ వరుసగా రెండో సారి తన ఢిల్లీ టూర్ ను వాయిదా వేసుకున్నారు. ఈ నెల 14న జగన్ డిల్లీకి వెళ్లి... అమిత్ షాతో భేటీ కానున్నారు.