Begin typing your search above and press return to search.

జగన్ ను హేళన చేసిన ఎడిటర్.. పోస్టు ఊస్టేనా.?

By:  Tupaki Desk   |   25 Jun 2019 11:03 AM GMT
జగన్ ను హేళన చేసిన ఎడిటర్.. పోస్టు ఊస్టేనా.?
X
ఏపీ ప్రభుత్వ మేగజైన్ ‘ఆంధ్రప్రదేశ్’ ఎడిటర్ కందుల రమేష్ పై జగన్ ప్రభుత్వం సీరియస్ అయినట్టు తెలిసింది.. టీడీపీ హయాంలో నామినేట్ అయిన సదురు ఎడిటర్ మొన్నటి జగన్ ప్రమాణ స్వీకారాన్ని ఎగతాళి చేసేలా ప్రభుత్వ మేగజైన్ లో కథనం వండివార్చినట్టు సమాచారం. దీనిపై సీరియస్ అయిన జగన్ ప్రభుత్వం ఎడిటర్ గదికి తాళం వేసి.. ఏపీ మేగజైన్ కార్యాలయం ఎడిషన్ ను రాకుండా చర్యలు తీసుకున్నట్టు వార్తలొస్తున్నాయి.

టీడీపీ హయాంలో ఏపీ ప్రభుత్వ మేగజైన్ పత్రికకు మంత్రి నారా లోకేష్ రికమండేషన్ తో ఎడిటర్ గా కందుల రమేష్ ను నియమించినట్టు సమాచారం. ఇప్పుడు ఆయన ప్రభుత్వం మారినా తన టీడీపీ అనుకూల ధోరణి మార్చుకోలేదని వార్త కథనాలను బట్టి తెలుస్తోంది. ఏకంగా సీఎం జగన్ కు వ్యతిరేకంగా వెలువరించిన తాజా జూన్ మేగజైన్ ను వైసీపీ ప్రభుత్వం బయటకు రాకుండా నిలిపివేసిందని విశ్వసనీయ సమాచారం.. జగన్ ప్రమాణ స్వీకారాన్ని వక్రీకరించి జగన్ ఏడ్చినట్టుగా అందులో తప్పుడు రాతలు రాశారని తెలిసింది.

దీనిపై సీరియస్ అయిన వైసీపీ, సీఎంవో అధికారులు వెంటనే ఆ పత్రిక ఎడిటర్ ను రాజీనామా చేయాలని కోరారని విశ్వసనీయ సమాచారం. కానీ ఆయన అందుకు ఒప్పుకోకపోవడంతో తాజాగా పత్రికను బయటకు రాకుండా చేసి ఎడిటర్, కార్యాలయానికే తాళం వేసి పంపించినట్టు తెలుస్తోంది.

ఇన్ సైడ్ గా జరిగిన ఈ వ్యవహారం ఆనోటా ఈనోట బయటకు రావడంతో సంచలనంగా మారింది. ఇలా టీడీపీ హయాంలో చెలరేగిపోయిన సదురు ఎడిటర్ వైసీపీనే ఎదురిస్తుండడంతో ఆయన జగన్ ప్రభుత్వం తగిన రీతిలో బుద్ది చెప్పినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి.