Begin typing your search above and press return to search.

తెలంగాణ లో ప్రతిపక్షాలు ఎందుకు ఫెయిలవుతున్నాయి?

By:  Tupaki Desk   |   7 Feb 2020 4:33 AM GMT
తెలంగాణ లో ప్రతిపక్షాలు ఎందుకు ఫెయిలవుతున్నాయి?
X
వాడిపోతున్న కమలం .. కాంగ్రెస్ విలాపం.. ఓన్లీ గులాబీ గుబాళింపే.. తెలంగాణలో ఎప్పుడు ఏ ఎన్నికలు జరిగినా.. గెలుపు మాత్రం టీఆర్ఎస్ పార్టీదే అన్నట్లుగా తయారైంది. టీఆర్ఎస్ ‘వార్ వన్ సైడ్’ అన్నట్లుగా దూసుకుపోతుంటే విపక్షాలు మాత్రం కారు స్పీడుకు కనీస పోటీని ఇవ్వలేక చతికలపడుతున్నాయి. తెలంగాణ సాధించిన పార్టీగా 2014 ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి ప్రజలు పట్టం కట్టారనుకుంటే ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లోనూ విపక్ష పార్టీలు ఎక్కడా కూడా కనీస పోటీ ఇచ్చిన దాఖలాలు లేవు. రాష్ట్రంలో ఎమ్మెల్యే, ఎంపీ, కార్పొరేషన్, మున్సిపాలిటీ, ఉప ఎన్నికలు, సర్పంచ్.. ఇలా ఏ ఎన్నిక తీసుకున్న టీఆర్ఎస్ జెట్ స్పీడుతో దూసుకుపోతుండగా విపక్ష పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ కనీస పోటీ ఇచ్చిన దాఖాలాలు రాష్ట్రంలో కన్పించడం లేదు.

* కారు స్పీడుకు కొట్టుకు పోతున్న కాంగ్రెస్..
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ బలమైన శక్తిగా ఉండేది. వైఎస్ హయాంలో అయితే చంద్రబాబు, కేసీఆర్ సహా అందరూ బెంబెలెత్తిపోయేవారు. తెలంగాణ రాష్ట్రం వచ్చాక కాంగ్రెస్ పరిస్థితి మాత్రం రోజురోజుకు దిగజారిపోతుంది. తెలంగాణ ను తెచ్చింది మేమే.. ఇచ్చింది మేమే అని గొప్పలు చెప్పుకున్న కాంగ్రెస్ 2014 ఎన్నికల్లో కారు స్పీడుకు బ్రేకులు వేయలేకపోయింది. ఆ తర్వాత ఆ పార్టీ నుంచి ఎన్నికైన ఎమ్మెల్యేలు కూడా టీఆర్ఎస్ లో చేరిన సంగతి తెల్సిందే. అయితే కాంగ్రెస్ పరిస్థితి అప్పటికి కొంత మెరుగ్గానే ఉంది. కాంగ్రెస్, విపక్షాలు బలపడుతాయని గ్రహంచిన కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ పార్టీలు మహాకూటమిగా ఏర్పడి పోటీ చేసిన కారు స్పీడు ముందు ఘోరంగా చతికలపడ్డాయి. ఆ తర్వాత వచ్చిన ఏ ఎన్నికల్లో గులాబీ పార్టీకి కనీస పోటీ ఇవ్వలేదు. ఆ తర్వాత వచ్చిన పార్లమెంట్, పంచాయతీ, ఉప ఎన్నికలు, మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఏమాత్రం పోటీ ఇవ్వలేదని చెప్పాలి. కాంగ్రెస్ పార్టీ లో గ్రూపు తగాదాలు, సమన్వయం లోపం ప్రతీ ఎన్నికల్లో కొట్టిచ్చినట్లు కనబడుతోంది. కాంగ్రెస్ పరిస్థితి ఇలానే కొనసాగితే వచ్చే ఎన్నికల్లో కూడా ఇదే సీన్ రీపిట్ అయ్యేలా కన్పిస్తోంది.

*బీజేపీలో విభన్న పరిస్థితి..
రాష్ట్రంలో బీజేపీ పరిస్థితి విభిన్నంగా ఉంది. టీఆర్ఎస్ పార్టీకి తామే ప్రత్యామ్నాయం అని బీజేపీ గొప్పలు చెప్పుకుంటోంది. అయితే అందుకు తగ్గట్టుగా పరిస్థితి లేదని కిందటి ఎన్నికల్లో రుజువైంది. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కేవలం ఒక్క ఎమ్మెల్యేనే గెలిచింది. దీంతో బీజేపీ పరిస్థితి అంతా అయిపోందనుకున్నారు. అయితే ఎంపీ ఎన్నికల్లో మోదీ హవా కొనసాగగా.. ఈమేరకు రాష్ట్రంలో కూడా కొన్ని ఎంపీ సీట్లను గెలుచుకుంది. దీంతో బీజేపీ రాష్ట్రంలో బలపడుతుందని అనుకున్నారు. అయితే ఇటీవల జరిగిన మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ ప్రభావం ఏమాత్రం కనిపించలేదు. ఒకటి ఆరా మినహా మున్సిపాలిటీల్లో ఎక్కడా కూడా సత్తా చాటలేకపోయింది. గ్రౌండ్ లెవల్లో బీజేపీ ఇంకా కుదురుకోకపోవడం ఆ పార్టీకి పెద్ద మైనస్ అని చెప్పొచ్చు. ఇప్పట్లో కారు పార్టీకి కనీస పోటీనిచ్చే విపక్షాలు రాష్ట్రంలో లేవని చెప్పొచ్చు.

*చేతులు కాలాక ఆకులు..
కాంగ్రెస్ మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో కొంతమేర కారుకు గట్టీ పోటీనిచ్చింది. అయితే బీజేపీ కొంత పుంజుకోవడంతో టీఆర్ఎస్ వ్యతిరేక ఓటు చీలి అధికార పార్టీకే లాభం చేకూరింది. అలాగే పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ ఎంపీగా గెలువడంతో అసెంబ్లీ స్థానానికి రాజీనామా చేశాడు. ఈ స్థానంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి భార్య పద్మావతి ఎమ్మెల్యేగా పోటీ చేసింది. అయితే ఈ స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ కాపాడుకోలేక టీఆర్ఎస్ పార్టీకి అప్పగించింది. ఇది కూడా కాంగ్రెస్ శ్రేణుల్లో నైరాశ్యాన్ని నింపింది. అలాగే మున్సిపల్ ఎన్నిలకు ముందస్తుగా ప్రీపర్ కాక పోవడం, రిజర్వేషన్ ఖరారు కోసం కోర్టుల చుట్టూ తిరుగుతూ కాలయాపన చేయడం, పార్టీలోని గ్రూపు తగాదాలు వంటివి కాంగ్రెస్ పార్టీని ప్రతిసారీ దెబ్బతీస్తున్నాయి. బీజేపీ కూడా కేంద్రంలో బలంతో రాష్ట్రంలోనూ విర్రవిగుతూ క్షేత్ర స్థాయిలో బలాన్ని పెంచుకోవడం లో విఫలమవుతుందన్న చర్చ సాగుతోంది. నేతల బలం తప్పితే క్షేత్రస్థాయి బలాన్ని పుంజుకోలేక బీజేపీ చతికిలపడుతోంది.

మరోవూపు టీఆర్ఎస్ రెండోసారి అధికారంలోకి వచ్చిన వెంటనే కేసీఆర్ తన తనయుడు కేటీఆర్ ను టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా చేశారు. నాటి నుంచి కేటీఆర్ పార్టీ పగ్గాలు చేపట్టి అన్నితానై నడిపిస్తున్నాడు. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లోనూ విపక్ష పార్టీలను వ్యూహాలకు చెక్ పెడుతూ టీఆర్ఎస్ గెలుపునకు కృషి చేశారు. అలాగే విపక్ష పార్టీల అనైక్యతను టీఆర్ఎస్ పార్టీకి కలిసొచ్చింది. వచ్చే ఎన్నికల నాటికైనా విపక్ష పార్టీలు బీజేపీ కాంగ్రెస్ లు కారు స్పీడుకు బ్రేక్ వేస్తాయో లేదో చూడాలి.