Begin typing your search above and press return to search.

బాల‌య్య‌...పార్టీ గురించి ప‌ట్టింపేద‌య్య‌?

By:  Tupaki Desk   |   15 Nov 2019 9:39 AM GMT
బాల‌య్య‌...పార్టీ గురించి ప‌ట్టింపేద‌య్య‌?
X
ఏపీలో రాజ‌కీయం కొత్త మ‌లుపులు తిరిగేట‌ట్లు క‌నిపిస్తోంది. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ఘోర ప‌రాజ‌యం త‌ర్వాత‌...పెద్ద సంఖ్య‌లో నేత‌లు ఆ పార్టీకి గుడ్ బై చెప్పేయ‌డం...మ‌రోవైపు ఎమ్మెల్యేలు సైతం ప‌చ్చ‌పార్టీని వీడుతుండ‌టం...చ‌ర్చ‌నీయాంశంగా మారుతోంది. 30 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ అనే పేరు పొందిన టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు ఒంట‌రిగా ముందుకు సాగుతుండ‌గా... ఆయ‌న‌కు త‌న‌యుడు లోకేష్‌, బావ‌మ‌రిది బాల‌కృష్ణ అండ‌గా నిల‌వ‌లేని స్థితిలో ఉండ‌టంతో...సైకిల్ పార్టీ ఫ్యూచ‌ర్ ఎలా ఉండ‌నుంద‌నే సందేహం వ్య‌క్త‌మ‌వుతోంది.

బాల‌య్య ప్రాతినిధ్యం వ‌హిస్తున్న హిందూపురం నియోజ‌క‌వ‌ర్గంలో గ‌త కొద్దికాలంగా ఆయ‌న పట్ల తీవ్ర వ్య‌తిరేక‌త క‌నిపిస్తున్న సంగతి తెలిసిందే. బాల‌య్య‌తో పాటు పీఏ కార‌ణంగా తెలుగుదేశం శ్రేణుల్లో, స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించ‌ని కార‌ణంగా ప్ర‌జ‌ల్లో బాల‌య్య బాబుపై ఆగ్ర‌హం పెల్లుబుకుతోంద‌నేందుకు అనేక‌ నిర‌స‌న ప్ర‌దర్శ‌న‌లే నిద‌ర్శ‌నం. ఇలాంటి త‌రుణంలో...బాల‌య్య త‌న నియోజ‌క‌వ‌ర్గంపై దృష్టిపెట్ట‌డం అవ‌స‌రం. కానీ బాల‌య్య దీనికి భిన్నంగా, సినిమాలు చేస్తూనే ఉన్నారు. దీంతో పాటుగా పార్టీని కూడా ప‌ట్టించుకోవ‌డం లేదంటున్నారు. ప్ర‌ధానంగా, టీడీపీకి విధేయులైన నేత‌లు బైబై చెప్పేస్తున్నప్ప‌టికీ...స్పంద‌న లేదంటున్నారు. గ‌న్నవరం ఎమ్మెల్యేగా గెలుపొందిన వల్లభనేని వంశీ పార్టీకి రాజీనామా చేసేయ‌డ‌మే కాకుండా చంద్ర‌బాబు తీరును తీవ్రంగా త‌ప్పుప‌ట్టారు. తెలుగుయువ‌త అధ్య‌క్షుడు దేవినేని అవినాష్ సైతం వైసీపీ లో చేరారు. ఆయ‌న కూడా పార్టీ విధానాల‌ను ఎండ‌గ‌ట్టారు.

ఈ ఇద్ద‌రు నేత‌లూ చంద్ర‌బాబును తీవ్రంగా త‌ప్పుప‌ట్టిన వారే! స్ప‌ష్టంగా చెప్పాలంటే...పార్టీ నేతల అసంతృప్తిని దూరం చేయ‌డంలో చంద్రబాబు విఫ‌లం అవుతున్నారు. ఇలాంటి స‌మ‌యంలో...బాబు త‌న‌యుడు లోకేష్‌పై అంద‌రి చూపు ఉన్న‌ప్ప‌టికీ...ఆయ‌న రాజ‌కీయ ప‌రిణ‌తి అంతంతే. దీంతో, టీడీపీ శ్రేణులు స‌హ‌జంగానే...క‌ల‌వ‌ర‌పాటుకు గుర‌వుతున్నాయి. ఇలాంటి విపత్కర పరిస్థితిలో బాలకృష్ణ నేనున్నా అంటూ పార్టీని ముందుకు నడిపిస్తారని టీడీపీ నేత‌లు ఆశిస్తే...దానికి భిన్నంగా బాల‌య్య‌...సినిమా బిజీలో ఉండిపోవ‌డంతో...అధికార పార్టీకి ధీటుగా టీడీపీ నిల‌బ‌డ‌గ‌లుగుతుందా? అనే సందేహం తెలుగుదేశం శ్రేణులే వ్య‌క్తం చేస్తున్నాయి