Begin typing your search above and press return to search.

బీజేపీతో దోస్తీ.. కేసీఆర్ తో ఫైట్ కు పవన్ రెడీ?

By:  Tupaki Desk   |   26 May 2020 7:10 AM GMT
బీజేపీతో దోస్తీ.. కేసీఆర్ తో ఫైట్ కు పవన్ రెడీ?
X
అవసరార్థం రాజకీయాలు మారిపోతుంటాయి. ప్రజారాజ్యం పార్టీని సాకలేక నాడు చిరంజీవి కాంగ్రెస్ పంచన చేరారు. ఇప్పుడు ఒంటరిగా పోటీచేసి జనసేనను నిలబెట్టలేక పవన్ కళ్యాణ్ బీజేపీతో చెలిమికి అర్రులు చాస్తున్నారు. ఇన్నాళ్లు ఏపీకే పరిమితమైన రాజకీయం.. ఇప్పుడు తెలంగాణలోనూ అల్లుకుంది.

జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నిన్న తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ను కలవడం హాట్ టాపిక్ గా మారింది. అనంతరం ట్విట్టర్ లో బండిని, బీజేపీని ప్రశంసిస్తూ ట్వీట్ చేయడం అనుమానాలకు బలం చేకూరుస్తోంది. బీజేపీతో పవన్ సాన్నిహిత్యం పెరిగిపోతోందని అర్థమవుతోంది. అంతిమంగా అన్నలాగే బీజేపీలోకి జనసేన విలీనం దిశగా సాగుతుందా అన్న అనుమానాలు లేకపోలేదు.

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ప్రస్తుత సమస్యలపై పవన్ కళ్యాణ్ తో చర్చించారు. జనసేనాని కూడా తెలంగాణలో భవిష్యత్ రాజకీయాలపై మాట్లాడారని తెలిసింది. ఈ సందర్భంగా తెలంగాణ బీజేపీ చీఫ్ ను పవన్ ప్రశంసించడం విశేషం. పవన్ బీజేపీకి మద్దతిచ్చినప్పటి నుంచి ఒక జాతీయ పార్టీ నేతతో కరచాలనం చేయడం ప్రశంసించడం ఇంతవరకు చోటుచేసుకోలేదు. ఈ పరిణామం రాజకీయాల్లో చర్చనీయాంశమైంది.

నిజానికి పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టినప్పుడు తెలంగాణ సీఎం కేసీఆర్ ను, టీఆర్ఎస్ పై తీవ్రమైన విమర్శలు చేశారు. కానీ తరువాత కేసీఆర్ పాలనకు ఫిదా అయి ప్రశంసలు కురిపించారు. ఇప్పుడు బీజేపీ తెలంగాణలో పవన్ ను ఉపయోగించుకొని కేసీఆర్ పై విమర్శలు చేసేందుకు.. గులాబీ పార్టీకి వ్యతిరేకంగా ఎదగడంలో సాయం తీసుకోవాలని అనుకుంటోంది.

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కోలుకునే పరిస్థితి లేదు. దీంతో జాతీయ పార్టీ బీజేపీకి తెలంగాణలో స్కోప్ ఏర్పడింది. జనసేనతో కూటమి కడితే బీజేపీకి బలం చేకూరుతుంది. బీజేపీతో పవన్ జతకడితే తెలంగాణలో కేసీఆర్ ను ఎదుర్కోవడంలో బీజేపీ చాలా హెల్ప్ అవుతుంది.

ప్రస్తుతం జనసేన పూర్తిగా బీజేపీ వైపు మళ్లుతోంది. ఆ పార్టీలో భవిష్యత్తులో విలీనం కూడా కావచ్చు . ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు వ్యతిరేకంగా వెళ్లడానికే పవన్ నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. మరి తెలంగాణలో బీజేపీ, జనసేన ఒక్కటైతే ఈ కూటమిని కేసీఆర్ ఎలా ఎదుర్కొంటాడన్నది ఆసక్తిగా మారింది.కేసీఆర్ తో ఫైట్ కు రెడీ అయిన పవన్ తీరుపై కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.