Begin typing your search above and press return to search.

చంద్రబాబు మౌనం.. ఓటమికి సంకేతమేనా?

By:  Tupaki Desk   |   8 Dec 2018 8:17 AM GMT
చంద్రబాబు మౌనం.. ఓటమికి సంకేతమేనా?
X
కేసీఆర్ ను గద్దెదించాలనే ఏకైక కృతనిశ్చయంతో టీడీపీ అధినేత చంద్రబాబు చాలా సీరియస్ గా.. విస్తృతంగా తెలంగాణ ప్రచారం నిర్వహించారు.. ముక్కి మూలుగుతున్న కాంగ్రెస్ పార్టీతో కలిసి మహాకూటమి ఏర్పాటు చేసి.. మీడియాను మేనేజ్ చేసి టీఆర్ఎస్ కు గట్టిపోటీనిచ్చారు. తెలంగాణలో ఎన్నికలు ముగియడంతో ఇప్పుడు వలసవచ్చిన నేతలంతా తిరుగుపయనమయ్యారు. తమ పార్టీ గెలుస్తుందని విశ్వాసం వ్యక్తం చేస్తూ మీడియా ఎదుట బీరాలు పలుకుతున్నారు. కానీ తెలంగాణ ఎన్నికల ముఖచిత్రాన్నే మార్చేసిన చంద్రబాబు ఏపీకి వెళ్లాక గుట్టుచప్పుడు కాకుండా ఉండడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఆయన తెలంగాణ ఎన్నికలపై వచ్చిన ఎగ్జిట్ పోల్స్ పై నోరుమెదకపోవడం రాజకీయ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది.

ఆంధ్రా ఆక్టోపస్ లగడపాటి రాజగోపాల్ ప్రజాకూటమికి 55-65 వస్తాయని తన సర్వే వివరాలను బయటపెట్టారు. కనీసం ఈ గెలుపు సర్వేపై కూడా చంద్రబాబు స్పందించకుండా నిశబ్ధం గా ఉండిపోవడం టీడీపీ, కాంగ్రెస్ శ్రేణులను నివ్వెరపరుస్తోంది. జాతీయ మీడియా లైన టైమ్స్ నౌ, ఇండియా టుడే, రిపబ్లిక్ టీవీ తదితర చానెళ్లు టీఆర్ఎస్ కు స్పష్టంగా తెలంగాణ లో అధికారం దక్కుతందని ఎగ్జిట్ పోల్స్ లో కుండబద్దలు కొట్టాయి. ఇలా అన్నీ బేరిజు వేసుకున్నాకే మహాకూటమి ఓడిపోతుందని గ్రహించిన బాబు సైలెంట్ అయ్యాడని వార్తలు వస్తున్నాయి. ఈ పరిణామం తెలంగాణలోని తెలుగు తమ్ముళ్లను కలవరపాటుకు గురిచేస్తోందట.. మహాకూటమి ఏర్పాటు చేసి అధికారంలోకి వచ్చి కీలక పాత్ర పోషిస్తాడనుకున్న చంద్రబాబు ఇప్పుడు ఎన్నికలు పూర్తయ్యాక మౌనంగా ఉండడంతో తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేతలు ఓటమి తప్పదా అన్న నైరాశ్యంలో మునిగిపోయారట..

తెలంగాణ లో ప్రచార గడువు ఈ నెల 5న ముగియగానే చంద్రబాబు తన పూర్తి దృష్టిని ఆంధ్రప్రదేశ్ పై కేంద్రీకరించారు. అమరావతి లో కియి మోటార్స్ తో వాణిజ్య ఒప్పందం చేసుకున్నారు. తిత్లి తుఫాను తో దెబ్బతిన్న శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలు, కరువు తో అల్లాడుతున్న రాయలసీమకు వెంటనే కేంద్రం రూ.1401 కోట్లు విడుదల చేయాలని కేంద్రాన్ని కోరారు. కేంద్రం ఏపీ విషయంలో పక్షపాతం చూపుతోందని .. ఏపీ రైతులను ఆదుకోవడం లేదని ఈ కార్యక్రమాని కి హాజరైన కేంద్ర ప్రతినిధులను బాబు నిలదీశారు. వెంటనే ఏపీ కి కేంద్ర నిధులు విడుదల చేయాలని కోరారు..

ఇలా ప్రభుత్వ పనులతో తాను పనిచేస్తున్నాననే మెసేజ్ ను ప్రజల్లోకి తీసుకెళుతున్నారు. కానీ పక్కరాష్ట్రంలో తన పార్టీ, సపోర్టు చేసిన మహాకూటమి పరిస్థితిని బాబు గాలికి వదిలేశారు. దీన్ని బట్టి కూటమి ఓటమి గురించి బాబుకు తెలిసి ఉంటుందని.. అందుకే ముందుజాగ్రత్త చర్యగా సర్దుకుంటున్నాడని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఓటమి భయంతోనే రాబోయే ఎన్నికల్లో తనకు ఎఫెక్ట్ అవుతుందనే ఏపీలోని సమస్యల పై బాబు హడావుడి చేస్తున్నాడని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.