Begin typing your search above and press return to search.

జగన్ సంక్షేమాన్ని కొనసాగించడానికి బాబు ఎందుకు....?

By:  Tupaki Desk   |   2 Dec 2022 10:32 AM GMT
జగన్ సంక్షేమాన్ని కొనసాగించడానికి బాబు ఎందుకు....?
X
ఏపీలో ఇపుడు సంక్షేమ పధకాల మీద ఓట్లు దండుకునేందుకు రాజకీయం రంజుగా సాగుతోంది. వచ్చే ఎన్నికల్లో సంక్షేమ తమకు ఓట్ల వర్షం కురిపిస్తుంది అని వైసీపీ గట్టిగా నమ్ముతోంది. అదే టైంలో తాము ప్రజలకు ఎంతో చేశామని లక్షన్నర కోట్లకు పైగా సంక్షేమానికి ఖర్చు చేశామని వైసీపీ చెప్పుకుంటోంది.

ఇవన్నీ పక్కన పెడితే సంక్షేమ పధకాలు అన్నవి వేస్తే వేపకొమ్మ తీస్తే అమ్మ వారు లాంటివి. వాటిని ఎవరు వచ్చినా కొనసాగించాల్సిందే. లేకపోతే జనాలు ఒప్పరు. ఒకసారి వారికి అలవాటు చేసి ఆ మీదట కాదూ కుదరదు అంటే అసలు ఒప్పరు. ఈ విషయమే టీడీపీ సహా విపక్షాలు చేయించుకున్న సర్వేలలో తేలింది.

దాంతో టోన్ మార్చిన తెలుగుదేశం తాము కూడా సంక్షేమ పధకాలు అమలు చేసి తీరుతామని ఘంటాపధంగా చెబుతోంది. చంద్రబాబు ఇటీవల క్రిష్ణా జిల్లా టూర్ తో పాటు తన సొంత నియోజకవర్గం కుప్పంలోనూ సంక్షేమ పధకాల మీద అనుకూలంగా ప్రకటన చేశారు.

తాజాగా ఆయన గోదావరి జిల్లాల టూర్ లో కూడా తాము సంక్షేమ  పధకాలు  తప్పకుండా కొనసాగిస్తమని చెప్పుకున్నారు. తెలుగుదేశం వస్తే సంక్షేమ పధకాలు ఆగిపోతాయని వాలంటీర్ల ద్వారా వైసీపీ దుష్ప్రచారం చేయిస్తోందని ఇది పూర్తిగా తప్పు అని బాబు గారు అంటున్నారు. తాము ఇంతకు ఇంతా అన్ని పధకాలు కొనసాగిస్తామని ఆయన చెప్పుకొచ్చారు.

దీని మీదనే రాజకీయం విమర్శలు కూడా బాబుకు ఎదురవుతున్నాయి. మాజీ మంత్రి పేర్ని నాని లాంటి వారు అయితే మొత్తానికి జగన్ పాలన తెస్తాను అంటున్నావు కదా బాబూ ఇది కదా అసలైన ఖర్మ అంటూ మండిపడ్డారు. బాబుకు సత్తా ఉంటే 2014 నుంచి 2019 వరకూ తమ హయాంలో చేసిన అభివృద్ధిని తన పధకాల గురించి చెప్పుకోవాలి కానీ వైసీపీ గురించి ఆ పాలన అ పధకాల గురించి చెప్పడం ఎందుకు అని నిలదీశారు.

బాబు ఈ విధంగా చెబుతున్నారు అంటే కచ్చితంగా జగన్ పాలనను ఆయన మెచ్చుకున్నట్లే అని పేర్ని నాని స్పష్టం చేస్తున్నారు. అదే టైం లో తన పాలన బాగా లేదు కాబట్టి ఏమీ చెప్పుకోలేకపోతున్నారని చురకలు అంటించారు. అయితే బాబు చెప్పేవి అన్నీ నమ్మడానికి ప్రజలు ఏమీ అమాయకులు కాదని ఆయన అంటున్నారు.

జగన్ పధకాలు అమలు చేస్తామని ఊరూరా బాబు మీటింగులు పెట్టుకుని తిరిగితే ఆ మాత్రం దానికి జగన్ని తీసేసి బాబుని ఎందుకు అధికారంలోకి తీసుకురావాలని ఆయన ప్రశ్నించారు. జగన్ పాలన బాగుందని బాబు ఆ  పధకాలు  కంటిన్యూ చేస్తామని చెబుతూంటే జగన్ని వద్దని ప్రజలు ఎందుకు అనుకుంటారు, ఎలా అనుకుంటారు అని నిలదీశారు.

పేర్ని నాని విమర్శలు పక్కన పెడితే నిజంగా ఆల్టర్నేటివ్ అజెండా ఒకటి టీడీపీ సిద్ధం చేసుకోవాల్సిన అవసరం ఉంది కదా అని అంతా అంటున్నారు. ఓట్లు రాలుతాయని చెప్పి ఏపీని గుల్ల చేసే పధకాలను తామూ అమలు చేస్తామని చెప్పడం ద్వారా బాబు సైతం అభివృద్ధి పక్కన పెట్టేస్తారా అన్న చర్చ కూడా మొదలవుతోంది. ఏపీ అప్పుల కుప్ప అయిపోయింది. మరి అలాంటి ఏపీలో పధకాలు ఇన్నేసి అవసరమా అన్న చర్చ కూడా ఉంది.

ఏది ఏమైనా బాబు చేసిన  పాత విమర్శలను కూడా ఇపుడు వైసీపీ నేతలు గుర్తు చేసి ఎద్దేవా చేస్తున్నారు. ఏపీ అప్పుల కుప్ప అవుతుందని, శ్రీలంక అవుతుందని నాడు చెప్పి ఇపుడు పధకాలు అమలు చేస్తామంటే జనాలు నమ్మకపోగా బాబు క్రెడిబిలిటీ దెబ్బతింటుందని అనే వారూ ఉన్నారు ఇక జగన్ పధకాలు మేమీ చేస్తాం మాకు అధికారం ఇవ్వండి అంటే ఆయన ఉన్నాడుగా మీరెందుకు అన్న ప్రశ్న కూడా జనాల నుంచి వచ్చే ప్రమాదం ఉంది. మరి ఇంత చిన్న లాజిక్ ని బాబు ఎలా మరచిపోతున్నారో అని సెటైర్లు పడుతున్నాయి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.