Begin typing your search above and press return to search.

రాహుల్ స‌భకు ఆ ముగ్గురు ఎందుకు రాలేదు?

By:  Tupaki Desk   |   19 Sep 2018 10:31 AM GMT
రాహుల్ స‌భకు ఆ ముగ్గురు ఎందుకు రాలేదు?
X
ఏఐసీసీ అధ్య‌క్షుడు రాహుల్ గాంధీ మంగ‌ళ‌వారం నాడు క‌ర్నూలులో పర్య‌టించిన సంగతి తెలిసిందే. స్థానిక కాలేజీలో నిర్వ‌హించిన బ‌హిరంగ స‌భ‌లో రాహుల్ ప్ర‌సంగించారు. రాహుల్ స‌భ‌కు జ‌నం కూడా భారీగానే హాజ‌ర‌య్యారు. 40 నిమిషా పాటు ప్ర‌సంగించిన రాహుల్...ప్ర‌ధాని మోదీపై - బీజేపీ ప్ర‌భుత్వంపై విరుచుకుప‌డ్డారు. రాష్ట్రం ఎదుర్కొంటోన్న స‌మ‌స్య‌ల‌కు బీజేపీ విధానాలే కార‌ణ‌మ‌ని మండిప‌డ్డారు. త‌మ పార్టీ అధ్య‌క్షుడి మీటింగ్ కోసం కాంగ్రెస్ ముఖ్య నేత‌లంతా హాజ‌ర‌య్యారు. అయితే, ఈ స‌భ‌కు కాంగ్రెస్ కు చెందిన ముగ్గురు కీల‌క‌మైన నేత‌లు హాజ‌రుకాక‌పోవ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. ప‌ల్లం రాజు - వ‌ట్టి వ‌సంత్ - చిరంజీవిలు రాహుల్ స‌భ‌కు డుమ్మా కొట్ట‌డంపై కాంగ్రెస్ శ్రేణులు చ‌ర్చించుకుంటున్నాయి.

రాహుల్ స‌భ‌కు కోట్ల విజ‌య భాస్క‌ర్ రెడ్డి - కిర‌ణ్ కుమార్ రెడ్డి - బైరెడ్డి రాజ‌శేఖ‌ర్ రెడ్డి - వంటి నేత‌లు హాజ‌ర‌య్యారు. అయితే, ఈ స‌భ‌కు ఆ ముగ్గురు నేత‌లు రాలేదు. కొంత‌కాలంగా రాజ‌కీయాల్లో చురుగ్గా లేని ఆ ముగ్గురు ఈ స‌భ‌కు కూడా రాక‌పోవ‌డం పై చ‌ర్చ జ‌రుగుతోంది. అయితే, ఈ ముగ్గురు ఇంకా కాంగ్రెస్ లోనే కొన‌సాగుతున్న‌ప్ప‌టికీ ఈ స‌భ‌కు రాక‌పోవ‌డంపై భిన్నాభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. వారింకా రాజీనామా చేయ‌లేద‌ని..ఈ స‌భ‌కు డుమ్మా కొట్టి వేరే పార్టీలో చేర‌బోతున్నామ‌నే సంకేతాలిస్తున్నార‌నే విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. అయితే, చిరు సినిమాల్లో బిజీగా ఉన్నారు కాబ‌ట్టి ఈ స‌భ‌కు హాజ‌రు కాలేక‌పోయి ఉండ‌వ‌చ్చ‌ని...ప‌ల్లం రాజు - వ‌సంత్ లు వేరే పార్టీలోకి జంప్ అవుతారేమోన‌ని కొంద‌రు అభిప్రాయ‌ప‌డుతున్నారు.