Begin typing your search above and press return to search.

సీఎం కేసీఆర్ సొంతింటికి ఎందుకు వెళ్లారు .. అసలు సంగతేంటి ?

By:  Tupaki Desk   |   13 July 2021 11:30 AM GMT
సీఎం కేసీఆర్ సొంతింటికి ఎందుకు వెళ్లారు .. అసలు సంగతేంటి ?
X
తెలంగాణ సీఎం కేసీఆర్ .. ఒక అడుగు ముందుకి వేయాలి అంటే , దానికి ముందు అలోచించి కానీ నిర్ణయం తీసుకోరు. ఏ నిర్ణయం తీసుకున్నా కూడా ముందు చూపు ఆయనకి ఎక్కువగా ఉంటుంది అనేది విశ్లేషకుల మాట. అయితే , అలాంటి రాజకీయ చతురత కలిగిన సీఎం కేసీఆర్ తాజాగా చేసిన ఓ పని ఇప్పుడు అయన పై విమర్శలు చేయడానికి ప్రత్యర్దులకి అవకాశం ఇచ్చినట్టే అని అంటున్నారు. తనను మాట అనేందుకు ఏ సమయంలో కూడా ఏ చిన్న అవకాశం ఇవ్వని సీఎం కేసీఆర్, అందుకు భిన్నంగా తాజాగా చేసిన పనితో ఆయన మాట అనిపించుకోవటం ఖాయమే అని కొందరు అనుకుంటున్నారు.

అసలు ఇంతకీ ఏమైందంటే .. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు జూబ్లీహిల్స్ లోని నందిహిల్స్ లో సొంతిల్లు ఉన్న విషయం
తెలిసిందే. టీఆర్ ఎస్ భవన్ కి కొంచెం దగ్గర్లోనే ఆయన నివాసం ఉండేది. అయితే ఆంధ్రప్రదేశ్ విడిపోయి , తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడటం , ఆ తర్వాత తెలంగాణ లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించడం తో ప్రగతిభవన్ ను నిర్మించి అందులోకి షిఫ్టు అయ్యారు. ఆ ప్రగతి భవన్ కోసం ఐఏఎస్ అధికారుల నివాసాల్ని సైతం తొలగించి, భారీ ఎత్తున ప్రగతిభవన్ ను నిర్మించారు. దీనికోసం భారీగా ఖర్చు చేశారు కూడా. ప్రగతిభవన్ లోకి చేరిన తర్వాత నుంచి ఆయన సొంతింటికి పెద్దగా వెళ్లింది లేదు. అలాగే అయన ఎక్కువగా ప్రగతి భవన్ నుండే అన్ని పనులు చక్కబెడుతుంటారు అనే వాదన కూడా ఉంది.

అయితే , సడన్ గా సీఎం కేసీఆర్ సతీమణి శోభతో కలిసి ఆయన సొంతింటికి వెళ్లారు. గత కొన్ని రోజులుగా సీఎం కేసీఆర్ సొంతింటికి రిపేర్లు చేస్తున్నారు. దీనితో సొంత ఇంట్లో జరుగుతున్న పనుల్ని స్వయంగా పరిశీలించిన కేసీఆర్, అక్కడ చేసే పనులలో కొన్నిమార్పులు చేర్పులు సూచించినట్లుగా చెబుతున్నారు. దాదాపు అరగంట వరకు ఆ ఇంట్లోనే ఉన్న కేసీఆర్ ఇల్లు మొత్తం తిరిగి చూడటం అక్కడ జరుగుతున్న పనుల్ని పరిశీలించి అవసరమైన మార్పుల్ని చెప్పినట్లుగా చెప్తున్నారు. ఇదిలా ఉండగా ఆయన మనవడు హిమాన్షు ఉదయం ఈ ఇంటికి వచ్చి గంటపాటు ఉండి వెళ్లారు.ఒకే రోజు కేసీఆర్ ఆయన మనమడు వేర్వేరు సమయాల్లో ఇంటికి వచ్చిన జరుగుతున్న పనుల్ని చూసి వెళ్లటం ఆసక్తికరంగా మారింది.

మరోవైపు సొంతింట్లో జరుగుతున్న రిపేర్లకు ఆయన రాజకీయ ప్రత్యర్థులు మాటల దాడికి అనుకూలంగా మార్చుకుంటారన్న చర్చలు కూడా జరుగుతున్నాయి. సీఎం కేసీఆర్ కు ఓటమి భయం పట్టుకుందని, అందుకే ఎన్నికలకు మరో రెండున్నరేళ్ల సమయం ఉన్నప్పటికీ ముందే సొంతింటిని చక్కబెట్టుకుంటున్నారని, ఓడిన తర్వాత ప్రగతిభవన్ లో ఉండటం సాధ్యం కాదు, కాబట్టి ఇప్పుడే సొంతింటిని రిపేర్ చేయించుకున్నాడు అంటూ విమర్శలు చేసే అవకాశం ఉందని అంటున్నారు. ఈ మద్యే పీసీసీ చీఫ్ గా ఎంపికైన రేవంత్ రెడ్డి సీఎం కేసీఆర్ అడుగు తీసి అడుగు వేసినా దాన్ని భూతద్దంలో చూసి విమర్శలు , ఆరోపణలు చేస్తుంటారు. అలాంటిది ఏకంగా సొంతింట్లో జరుగుతున్న పనులని స్వయంగా పర్యవేక్షించి రావడంతో విమర్శలు చేయకుండా ఉంటారా అని ప్రశ్నిస్తున్నారు. అలాగే మరోవైపు బండి సంజయ్ కూడా అవకాశం కోసం కాచుకు కూర్చున్నారు. ఏదేమైనా సొంతింటిని రిపేర్ చేయించుకోవడం తప్పు కాకపోయినా కూడా అదే ఇప్పుడు ప్రత్యర్థుల చేతికి బలమైన ఆయుధంగా మారే అవకాశం ఉంది.