Begin typing your search above and press return to search.

95 ఏళ్ల షేక్ అబ్దుల్లా వార్తల్లో వ్యక్తి ఎందుకయ్యాడు?

By:  Tupaki Desk   |   6 Aug 2020 8:50 AM GMT
95 ఏళ్ల షేక్ అబ్దుల్లా వార్తల్లో వ్యక్తి ఎందుకయ్యాడు?
X
అతడి వయసు 95 ఏళ్లు. సాధారణ జీవితం. ఇప్పటికి ఆరోగ్యంగా ఉన్న ఆయన.. తాజాగా వార్తల్లో వ్యక్తి అయ్యాడు. చిన్నా పెద్దా అన్నతేడా లేకుండా ఆయన స్ఫూర్తిగా నిలుస్తున్నారు. ఎంతోమందికి కొండంత ధైర్యంగా నిలిచాడు. పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన 95ఏళ్ల పండుటాకు షేక్ అబ్దుల్లా ఇప్పుడు వార్తల్లోకి ఎలా వచ్చారు? ఎందుకొచ్చారు? ఇంతకీ ఈ వయసులో ఆయనేం సాధించారన్న విషయాల్లోకి వెళితే..

పశ్చిమగోదావరి జిల్లా వేలేరుపాడు మండలం జగన్నాథ పురానికి చెందిన పెద్దాయన షేక్ అబ్దుల్లా. 95 ఏళ్ల వయసులోనూ ఆయన ఆరోగ్యంగానే ఉండేవారు. తనపని తాను చేసుకునేవాడు.ఎవరి మీద పెద్దగా ఆధారపడేవాడు కాదు. అలాంటి ఆయన జులై 22న జ్వరం.. ఆయాసం వచ్చింది. కంగారుపడ్డ కుటుంబ సభ్యులు ఆయన్ను వెంటనే వేలేరుపాడు ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. ఆయనకు టెస్టు చేయగా.. అనుమానం నిజమై.. కరోనా పాజిటివ్ గా తేలింది.

చిన్నవయస్కులు సైతం ఇటీవల కాలంలో అదే పనిగా మరణిస్తున్న వేళ.. ఇంత పెద్ద వయసులో ఉన్న అబ్దుల్లా పరిస్థితి ఏమిటన్న ఆందోళన వ్యక్తమైంది. కుటుంబ సభ్యుల దిగులకు భిన్నంగా ఆయన కరోనాను జయించటం ఆసక్తికరంగా మారింది. ఇంత పెద్ద వయసులో కరోనా విసిరిన సవాలును ఆయన ఎలా అధిగమించారన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. దీనికి ఆయన సమాధానం చెబుతూ.. ధైర్యం.. కరోనాను జయిస్తానన్న నమ్మకమే ఆయన్ను ఆరోగ్యవంతుడిగా మారేలా చేసిందని చెబుతున్నారు. వైద్యుల శ్రమ.. అబ్దుల్లా గుండెధైర్యం ఆయన్ను కరోనా ఉక్కుపిడికిలి నుంచి బయటపడేలా చేసింది. పరీక్షలు నిర్వహించిన అనంతరం నెగిటివ్ రావటంతో.. ఆయన్ను వైద్యులు డిశ్చార్జి చేశారు. 95 ఏళ్ల వయసులో కరోనాను జయించిన ఆయన ఇప్పుడు నిలువెత్తు స్ఫూర్తిగా మారారు.