Begin typing your search above and press return to search.

అయ్యనపాత్రుడి అసహనం.. పచ్చిబూతులు!

By:  Tupaki Desk   |   25 Sep 2019 6:31 AM GMT
అయ్యనపాత్రుడి అసహనం.. పచ్చిబూతులు!
X
ప్రతిపక్షంలో ఉన్నవారికి చాలా సహనం ఉండాలి. అయితే తెలుగుదేశం పార్టీ వాళ్లలో మాత్రం అపరిమితమైన అసహనం కనిపిస్తూ ఉంది. ఆ పార్టీ నేతలు మాట్లాడే తీరు విమర్శలకు దారి తీస్తోంది. స్వయంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మాట్లాడే భాషే అభ్యంతకరకంగా ఉంటోంది. అధికార పక్షంపై విమర్శలు చేయవచ్చు, అయితే ఈ విమర్శల్లో కాస్తైనా విజ్ఞత ఉండాలి. అయితే చంద్రబాబు నాయుడి భాషలో ఆ విజ్ఞత లోపిస్తోందని పరిశీలకులు వ్యాఖ్యానిస్తూ ఉన్నారు.

చంద్రబాబు నాయుడే అలా మాట్లాడితే.. తాము ఇంకా రెచ్చిపోవచ్చని తెలుగుదేశం నేతలు భావిస్తున్నట్టుగా ఉన్నారు. అందులో భాగంగా మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు తీవ్రంగా మాట్లాడారు. వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలను ఉద్దేశించి, మంత్రులను, ముఖ్యమంత్రిని, అధికారులను.. ఇలా అందరినీ తూలనాడారు ఆయన.

రాయలేని స్థాయి భాషా ప్రయోగంలో అయ్యన్న బూతులు దొర్లాయంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఆయన అన్ని బూతులు వాడీ చెప్పదలుచుకున్నదీ జగన్ పాలన బాగోలేదని. అది చెప్పాలనుకుంటే… చాలా మార్గాలున్నాయి. అయితే ఈ తెలుగుదేశం పార్టీ నేత మాత్రం అద్వాన్నమైన భాషను ఉపయోగించారు.

ముఖ్యమంత్రి, మంత్రులు, అధికారులను.. ఇలా ఎవరినీ తేడా లేకుండా ఇష్టమొచ్చినట్టుగా తిట్టారు. ఆఖరికి టీ కొట్లో రాజకీయాలను చర్చించుకునే వాళ్లు కూడా అలాంటి లేకి మాటలు మాట్లాడరేమో. అలాంటి బాషలో ఈ మాజీ మంత్రి రెచ్చిపోయారు. దీని వల్ల వచ్చే ఉపయోగం ఎంతో ఆయనే తెలుసుకోవాలి.

ఎన్నికల్లో ప్రజలు తెలుగుదేశం పార్టీని ఓడించడమే కాదు, అయ్యన్నను ఎమ్మెల్యేగా కూడా ఓడించి కూర్చోబెట్టారు. ఇటీవలే ఆయన సోదరుడు కూడా టీడీపీని వీడినట్టుగా ఉన్నారు. ఈ ఫ్రస్ట్రేషన్ ను అంతా అయ్యన్నపాత్రుడు తన బాషతో చాటుకున్నట్టుగా ఉన్నాడని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.