Begin typing your search above and press return to search.

ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేసిన వారికి లాలీపాప్ప్ ఎందుకిచ్చారు?

By:  Tupaki Desk   |   13 Jan 2020 4:37 AM GMT
ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేసిన వారికి లాలీపాప్ప్ ఎందుకిచ్చారు?
X
పరిమితికి మించిన వేగంతో దూసుకెళ్లేవారు.. డ్రైవింగ్ లైసెన్స్ లేకున్నా డ్రైవ్ చేసేవారు.. హెల్మెట్ లేకుండా ప్రయాణించేవారు.. సీటు బెల్టును లైట్ తీసుకునే వాహనదారుల విషయంలో జమ్ముకశ్మీర్ రాష్ట్ర పోలీసులు వినూత్న తరహాలో వ్యవహరిస్తున్నారు. ట్రాఫిక్ నిబంధనల్ని అధిగమించే వారి విషయంలో.. వాహనదారుల అంచనాలకు ఏ మాత్రం అందని రీతిలో వ్యవహరిస్తూ అక్కడి వారిలో మార్పులు తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. సాధారణంగా ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేసే వారికి దిమ్మ తిరిగిపోయేలా భారీ జరిమానాలు విధించటం కామన్.

కానీ.. కొన్ని సందర్భాల్లో అలా చేయకుండా నిబంధనల్ని పాటించకపోతే ఎలాంటి ప్రమాదాలు చోటు చేసుకుంటాయన్న అవగాహన కలిగించేలా చేయటమే కాదు.. గులాబీ పువ్వో.. సినిమా టికెట్టో.. చాక్లెటో ఇస్తూ అవగాహన కల్పిస్తుంటారు. దీనికి భిన్నంగా జమ్ము కశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతంలోని ఉధంపూర్ లోని ట్రాఫిక్ పోలీసులు మాత్రం ఇందుకు భిన్నంగా వ్యవహరించి వార్తల్లోకి వచ్చారు.

ట్రాఫిక్ రూల్స్ ను బ్రేక్ చేసిన వారికి ఫైన్లు విధించకుండా వారి చేతికో లాలీపాప్ ఇస్తూ.. ట్రాఫిక్ రూల్స్ ను పాటించాలన్న ప్లకార్డును పెట్టి.. రోడ్డు మీద వెళుతున్న వాహన దారులకు అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. అందరి మాదిరి గులాబీ పువ్వో.. చాక్లెటో చేతికి ఇస్తే.. పెద్దగా ఫలితం ఉండదని.. కానీ లాలీ పాప్ ఇస్తే.. అది తినేంతసేపు ఆలోచించటమే కాదు.. వారి మనసు కూడా మారటం ఖాయమని చెబుతున్నారు. తాము తెర మీదకు తీసుకొచ్చిన లాలీపాప్ ప్లాన్ కు పాజిటివ్ రియాక్షన్ ఉంటుందన్న మాట వినిపిస్తోంది. మరి.. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఇదే విధానాన్ని అమలు చేస్తే అంతో ఇంతో ప్రయోజనం ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.