Begin typing your search above and press return to search.

అద్వానీని మోడీ దారుణంగా అవ‌మానించారా?

By:  Tupaki Desk   |   22 March 2019 5:41 AM GMT
అద్వానీని మోడీ దారుణంగా అవ‌మానించారా?
X
కాలం ఎంత క‌ఠిన‌మైన‌ది. బీజేపీ వ్య‌వ‌స్థాప‌కుడికే టికెట్ ల‌భించ‌ని ప‌రిస్థితి.వ‌యోభారం సాకు చూపించి అద్వానీని ప‌క్క‌న పెట్టేయ‌టం ద్వారా గురువుకు పంగ‌నామాలు పెట్టిన శిష్యుడిగా మోడీ చ‌రిత్ర‌లో నిలిచిపోతార‌ని అద్వానీ అభిమానులు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. ఆ మ‌ధ్య‌న ఒక‌కార్య‌క్ర‌మానికి అద్వానీ మోడీ హాజ‌ర‌వ్వ‌టం.. ముందే వ‌చ్చేసిన అద్వానీ వేదిక మీద ఉన్నారు. వేదిక పైకి వ‌చ్చే క్ర‌మంలో ప్ర‌ధాని మోడీకి అద్వానీ న‌మ‌స్కారం పెట్ట‌టం.. అందుకు ప్ర‌తిన‌మ‌స్కారం పెట్ట‌క‌పోవ‌ట‌మే కాదు.. ప‌ట్టించుకోన‌ట్లుగా వ్య‌వ‌హ‌రించిన మోడీ తీరు అప్ప‌ట్లో పెను దుమారాన్ని రేగేలా చేసింది.

గురువు విష‌యంలో ఇంత నిర్ల‌క్ష్య‌మా? అంటూ ప‌లువురు మండిప‌డ్డారు. దీనికి సంబంధించిన వీడియో వైర‌ల్ గా మారి మోడీ మాష్టారికి నెగిటివ్ గా మారింది. ఇదంతా ఒక ఎత్తు అయితే.. అద్వానీ కోరిక‌ల్లో ఒక‌టైన రాష్ట్రప‌తి ప‌ద‌విని ఇచ్చి ఉంటే బాగుంటుంద‌న్న మాట వినిపించినా.. అది కూడా ఆయ‌న‌కు ఇవ్వ‌కుండా మోడీ అడ్డుప‌డ్డార‌నే చెబుతారు. కోవింద్ అభ్య‌ర్థిత్వాన్ని ఎవ‌రూ ఊహించ‌లేదు. అద్వానీకి అవ‌కాశం ఇవ్వ‌కుండా. మోడీ దెబ్బ కొట్టార‌న్న మాట వినిపిస్తూ ఉంటుంది.

అద్వానీ అంటే మోడీకి విప‌రీత‌మైన ప్రేమాభిమానాలు అని చెప్పే క‌మ‌ల‌నాథులు ప‌లువురు.. మ‌రి ఆయ‌న‌కు గౌర‌వ‌నీయ‌మైన ప‌ద‌విని ఎందుకు ఇవ్వ‌లేద‌న్న ప్ర‌శ్న‌కు స‌మాధానం చెప్ప‌కుండా మౌనంగా ఉండ‌టం క‌నిపిస్తూ ఉంటుంది. 91 ఏళ్ల వ‌య‌సులోనూ అద్వానీ యాక్టివ్ గానే ఉన్నార‌ని చెప్పాలి. నిజానికి మోడీ కార‌ణంగా ఆయ‌న మ‌న‌సు కానీ బాధ ప‌డ‌కుండా ఉంటే ఆయ‌న మ‌రింత యాక్టివ్ గా ఉంటార‌న్న మాట‌ను ప‌లువురు చెబుతుంటారు.

తాజాగా టికెట్ల ఎంపిక‌లో అద్వానీకి 91 ఏళ్ల వ‌య‌సును చూపించి ఆయ‌న్ను పోటీకి నో చెప్ప‌టం ద్వారా మోడీ బ్యాచ్ ఆయ‌నకు రాజ‌కీయ విశ్రాంతి ఇచ్చిన‌ట్లుగా అభిప్రాయ‌ప‌డుతున్నారు. త‌న‌కు టికెట్ ఇచ్చేందుకు నిరాక‌రిస్తార‌న్న విష‌యాన్ని గుర్తించిన అద్వానీ.. త‌న‌కు బ‌దులుగా త‌న కుమార్తె ప్ర‌తిభా అద్వానీకి ఇవ్వాల‌ని కోరిన‌ట్లు చెబుతున్నారు. అయితే.. అద్వానీ జీవితం మొత్తం వార‌స‌త్వ రాజ‌కీయాల‌కు వ్య‌తిరేకంగా పోరాడార‌ని.. ఇలాంటి వేళ‌.. ఆయ‌న కుమార్తెకు టికెట్ ఇచ్చే పార్టీకి నష్టం జ‌రుగుతుంద‌న్న పేరుతో టికెట్ కు నో చెప్పిన‌ట్లుగా చెబుతున్నారు.

మొత్తానికి అద్వానీని ప‌క్క‌న పెట్టేయాల‌న్న ప్ర‌క్రియ విజ‌య‌వంతంగా మోడీ అండ్ కో పూర్తి చేసిన‌ట్లుగా చెప్ప‌క త‌ప్ప‌దు. అంతేకాదు.. అద్వానీ కోట‌లో అమిత్ షా పాగా వేయ‌టం చూస్తే.. రానున్న రోజుల్లో మ‌రెప్ప‌టికీ అద్వానీ ఫ్యామిలీకి అవ‌కాశం లేకుండా చేయ‌టం కోస‌మేన‌ని చెబుతున్నారు. ఈ రోజు బీజేపీ ఈ స్థాయి ఉండ‌టానికి పునాదులు వేసిన అద్వానీ లాంటి కురువృద్ధుడ్ని ఆయ‌న శిష్యుడే దెబ్బ తీయ‌టం చూస్తే..రాజ‌కీయాల్లో ఏదైనా సాధ్య‌మేన‌న్న విష‌యం మ‌రోసారి బోధ ప‌డ‌క మాన‌దు.