Begin typing your search above and press return to search.

తిరుపతిలోని ఆ డివిజన్ లో ఎన్నికను నిమ్మగడ్డ ఎందుకు రద్దు చేశారు?

By:  Tupaki Desk   |   5 March 2021 5:00 AM GMT
తిరుపతిలోని ఆ డివిజన్ లో  ఎన్నికను నిమ్మగడ్డ ఎందుకు రద్దు చేశారు?
X
ఏపీ ఎన్నికల సంఘం ప్రధానాధికారి నిమ్మగడ్డ రమేశ్ పేరు విన్నంతనే.. ఆయన విపక్ష తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తారని.. పాలకపక్షానికి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటారన్న పేరు ఉంది. అయితే.. తనపై పడే ముద్రలపై ఆయన ఎంతోకాలంగా పోరాడుతున్నారు. అయినప్పటికీ.. ఆయనపై నిందలు తగ్గని పరిస్థితి. ఇదిలా ఉంటే.. తాజాగా ఆయన తీసుకున్న నిర్ణయం మరోసారి చర్చనీయాంశంగా మారింది.

తాజాగా తిరుపతిలోని ఏడో వార్డులో బరిలో ఉన్న టీడీపీ అభ్యర్థి సంతకాన్ని ఫోర్జరీ అన్న ఫిర్యాదు వచ్చినంతనే.. దానిపై విచారణ జరపారు. అందులో నిజం ఉందని భావిస్తూ.. ఆ ఎన్నికను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. తిరుపతిలోని ఏడో వార్డులో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా విజయలక్ష్మి నామినేషన్ వేశారు.

నామినేషన్ల ఉపసంహరణకు గురువారం తుది గడువుగా ఉంది. ఈ సందర్భంగా విజయలక్ష్మీ తన నామినేషన్ ను ఉపసంహరించుకున్నారు. అయితే.. తిరుపతి ఏడో వార్డు అభ్యర్థి తన నామినేషన్ ను ఉపసంహరించుకోకున్నా.. ఫోర్జరీ సంతకంతో ఆమె తన నామినేషన్ ను వెనక్కి తీసుకున్నారన్న విషయాన్ని పార్టీ గుర్తించింది. వెంటనే.. ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది.

దీనిపై విచారణకు ఆదేశించిన ఎన్నికల సంఘం.. ఫిర్యాదుకు అనుగుణంగా ఏడో వార్డులో ఎన్నికను రద్దు చేస్తూ నిర్ణయాన్ని తీసుకున్నారు. ఇదిలా ఉంటే.. ఏపీలో జరుగుతున్న పురపోరులో పెద్ద ఎత్తున నామినేషన్ల విత్ డ్రా జరిగింది. అయితే.. ఇదంతా అధికారపక్షం ఒత్తిడితోనే ఇదంతా జరుగుతుందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే.. ఇవన్నీ తప్పుడు ఆరోపణలుగా అధికారపక్షం కొట్టిపారేస్తోంది.