Begin typing your search above and press return to search.

మరి రాందేవ్ బాబా ఎందుకు వచ్చాడు యోగి ఆదిత్యనాథ్?

By:  Tupaki Desk   |   6 Aug 2020 4:45 AM GMT
మరి రాందేవ్ బాబా ఎందుకు వచ్చాడు యోగి ఆదిత్యనాథ్?
X
దశాబ్ధాల కల.. ఎంతో మంది పోరుబాట.. అయోధ్య రామాలయం కోసం చాలా మంది కలలుగన్నారు. ఆ రోజు రానే వచ్చింది. ప్రధాని మోడీ చేతుల మీదుగా రామాలయ నిర్మాణానికి భూమి పూజ ఘనంగా జరిగింది.

అయితే ఈ అద్భుత ఘట్టాన్ని ప్రత్యక్షంగా చూడాలనుకునే వారు బీజేపీలో చాలా మంది ఉన్నారు. కానీ యూపీలోని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఎవ్వరినీ పిలవలేదు. కారణం కరోనా పేరు చెప్పింది. అంతేకాదు.. అయోధ్య రామాలయం కోసం జీవితం ధారపోసిన బీజేపీ కురువృద్ధుడు అద్వానీని సైతం ఈ మహత్కారానికి దూరంగా పెట్టింది. క్రెడిట్ మొత్తం మోడీకే దక్కేలా ఆయననే హైలెట్ చేసింది.

ఇక ప్రతిపక్షాలను సైతం యోగి సర్కార్ ఆహ్వానించలేదు. దీనిపై విమర్శలు చెలరేగాయి. అయోధ్యలో జరిగిన రామ మందిర భూమి పూజ కోసం ప్రతిపక్ష పార్టీలను పిలవకపోవడంపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ స్పందించారు. ప్రతిపక్ష నేతలను ఆహ్వానించకపోవడం వెనుక ఎలాంటి రాజకీయ దురుద్దేశం లేదన్నారు. బీజేపీ అధ్యక్షుడిని కూడా అందుకే ఆహ్వానించలేదన్నారు. కరోనా నిబంధనల ప్రకారమే తక్కువ మందిని ఆహ్వానించామని చెప్పారు.

అయితే యోగి ఆధిత్యనాథ్ లాజిక్ ఒట్టి మాటే అని అర్థమైంది. బీజేపీకి దగ్గరైన ఎంతో మంది పీఠాధిపతులు, మఠాధిపతులు ఈ కార్యక్రమంలో కనిపించారు. ముఖ్యంగా పతాంజలి యోగా గురువు బాబా రాందేవ్ కూడా ఈ అయోధ్య భూమిపూజలో కనిపించారు. మరి తక్కువమందిని ఆహ్వానించానన్న యోగి ఈయనను ఎందుకు పిలిచాడని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. మనోడు అయితే చాలు పిలవడమే అన్నట్టుగా బీజేపీ ఈ కీలక ఘట్టంలో వ్యవహరించిందని తెలుస్తోంది.