Begin typing your search above and press return to search.

తిరుమల వేంకటేశ్వరుడి వేషాన్ని ఆ వైసీపీ ఎంపీ ఎందుకు ధరించారు?

By:  Tupaki Desk   |   16 May 2022 4:51 AM GMT
తిరుమల వేంకటేశ్వరుడి వేషాన్ని ఆ వైసీపీ ఎంపీ ఎందుకు ధరించారు?
X
జీవితంలో ఒక్కసారైనా తిరుపతి వేంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలని చాలా మంది అనుకుంటారు. అందుకే దేశ, విదేశాల నుంచి కలియుగ దైవాన్ని చూసేందుకు తరలివస్తారు. అయితే ఏడుకొండలస్వామిని దర్శించుకోవాలంటే ఒకప్పుడు గంగమ్మ తల్లిని దర్శించుకోవాలనే నియమాన్ని పెట్టారు. కానీ రాను రాను ఈ నియమాన్ని ఎవరూ పాటించడం లేదు.

అయితే ఈ నియమం పాటించకపోయినా ఏటా తాతయ్య గంట గంగమ్మతల్లి జాతరను వైభవంగా నిర్వహిస్తారు. ప్రతీ సంవత్సరం వైశాఖ మాసం చివరి వారంలో ఈ జాతర ప్రారంభం అవుతోంది. ఈ ఏడాది గంగమ్మతల్లి జాతర మే 10న ప్రారంభమైంది. 17 వరకు సాగుతుంది. కొవిడ్ కారణంగా రెండు సంత్సరాలుగా భక్తులను అనుమతించకపోవడంతో ఏకాతంగా జాతరను నిర్వహించారు. ఈసారి భక్తులను అనుమతించడంతో సందడిగా మారింది.

గంగమ్మతల్లి ఆలయాన్ని 900 సంవత్సరాల కిందట అనంతచార్యుల వారు నిర్మించారని చరిత్ర చెబుతోంది.రాయలసీమలోనే అతిపెద్ద జాతరగా దీనిని భావిస్తారు. తిరుపతి పొలిమేరలో అవిలాల నుంచి కౌకాల కులస్థుల చాటింపుతో గంగమ్మ జాతర ప్రారంభమవుతుంది. జాతరలో భాగంగా అమ్మవారి విశ్వ రూప స్థూపానికి పసుపు, కొబ్బరి నీళ్లు, పంచామృతాలతో అభిషేకం నిర్వహిస్తారు. ఇక ప్రతీ సంవత్సరం జాతరకు శ్రీవారి ఆలయం నుంచి ఇక్కడికి సారెను అందిస్తారు. జాతర నాలుగోరోజున శ్రీవారి ఆలయ ప్రతినిధులుగా అధికారులు, అర్చకులు కలిసి పసుపు కుంకుమలు, శేషవస్త్రాలూ గంప, చేట తదితర మంగళ ద్రవ్యాలను మేళతాళాలతో తీసుకొచ్చి గంగమ్మతల్లికి అందజేస్తారు.

తిరుపతిలో జరిగే గంగమ్మతల్లి జాతరకు భక్తులు వివిధ వేషాలు ధరించి అమ్మవారిని దర్శించుకుంటారు. మాతంగి, దొర, బండ, తోటి, బైరాగి, సున్నపు కుండలు లాంటి వేషధారణలో ఇక్కడికి వస్తారు. ఇలా వేషధారణ చేయడం వల్ల చిన్న పిల్లలు అనారోగ్యానికి గురికాకుండా ఉంటారని భక్తుల నమ్మకం.ఈసారి కూడా భక్తులు వివిధ వేషాధారణలో అమ్మవారిని దర్శించుకున్నారు.

భక్తులతో పాటు ప్రజాప్రతినిధులు సైతం వేషధారణలో పాల్గొన్నారు. వీరిలో ముఖ్యంగా తిరుపతి ఎంపీ గురుమూర్తి శ్రీ వేంకటేశ్వర స్వామి వేషధారణలో వెళ్లి గంగమ్మతల్లిని దర్శించుకున్నారు. చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సతీసమేతంగా వెళ్లి గంగమ్మతల్లికి మొక్కులు అప్పజెప్పారు. ప్రజలందరినీ చల్లగా చూడాలని అమ్మవారిని కోరుకుంటున్నట్లు ఎమ్మెల్యే మీడియాతో చెప్పారు.

గంగమ్మతల్లి జాతరకు రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు భారీగా తరలి వస్తారు. ఈసారి తిరుపతి కార్పొరేషన్ ఆధ్వరంలో జాతరను నిర్వహిస్తున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రతీ జాతర ప్రారంభ రోజున వర్షం కురుస్తుంది. ఈసారి కూడా వర్షపు జల్లులు పడ్డాయి. ప్రజలందరికీ మంచి జరుగుతుందనడానికి ఇదో సంకేతమని భావిస్తారు.