Begin typing your search above and press return to search.

వ్యాక్సిన్ ఇవ్వ‌డంలో మోడీ ప్ర‌భుత్వం ఎందుకు విఫ‌ల‌మైంది?

By:  Tupaki Desk   |   10 April 2021 12:30 PM GMT
వ్యాక్సిన్ ఇవ్వ‌డంలో మోడీ ప్ర‌భుత్వం ఎందుకు విఫ‌ల‌మైంది?
X
‘మాట‌లు కోట‌లు దాటుతుంటాయి.. అడుగు మాత్రం గ‌డ‌ప దాట‌దు’ అని ఒక‌సామెత ఉంది. మోడీ ప్ర‌భుత్వాన్ని చూస్తుంటే ఇదే అభిప్రాయం క‌లుగుతోంద‌ని అంటున్నారు. ప్ర‌జ‌ల‌కు కొవిడ్‌ వ్యాక్సిన్ అందించ‌డంలో కేంద్రం ఘోరంగా విఫ‌ల‌మైంద‌నే విమ‌ర్శ‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

ప్ర‌పంచంలో అంద‌రిక‌న్నా ముందుగా మ‌న‌మే క‌రోనా వైర‌స్ కు వ్యాక్సిన్ క‌ను‌గొన్నామ‌ని ప్ర‌పంచానికి చెప్పుకున్నాం. ఈ విష‌యంలో ప్ర‌ధాని మోడీ భారీగా ప్ర‌చారం చేసుకున్నారు. దీనికి ప్ర‌పంచం భుజ‌కీర్తులు కూడా త‌గిలించింది. పలు దేశాల‌కు ల‌క్ష‌ల‌ డోసులు కూడా అందిస్తున్న‌ట్టు ప్ర‌క‌టించ‌డంతో అంద‌రూ చ‌ప్ప‌ట్లు కూడా కొట్టారు. ఇంత‌వ‌ర‌కూ బాగానే ఉంది. మ‌రి, భార‌తీయుల‌కు క‌రోనా వ్యాక్సిన్ వేసే కార్య‌క్ర‌మం ఎందాకా వ‌చ్చింద‌ని చూస్తే.. అస‌లు విష‌యం అర్థ‌మవు‌తోంది!

మ‌న దేశ జ‌నాభా ఇంచు మించు 130 కోట్లుగా ఉంది. కానీ.. ఇప్ప‌టి వ‌ర‌కూ దేశంలో వ్యాక్సిన్ ఇచ్చింది ఎంత మందికో తెలిస్తే నోరెళ్ల బెట్టాల్సిందే. దేశంలో అటూ ఇటూగా కేవ‌లం 8 శాతం మందికి మాత్ర‌మే వ్యాక్సిన్ అందింది. అంటే.. 10 కోట్ల మందికి కూడా పూర్తిగా వ్యాక్సిన్ అంద‌లేద‌ని తెలుస్తోంది. క‌రోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న వేళ‌.. ఈ లెక్క‌లు చ‌ర్చ‌నీయాంశంగా మారాయి.

క‌రోనా వ్యాక్సిన్ ప్ర‌భావ శీల‌త ఎంత అనే విష‌యంలో ఇప్ప‌టికి వంద శాతం స్ప‌ష్ట‌త లేదు. ఇలాంటి ప‌రిస్థితుల్లో ఖ‌చ్చితంగా వ్యాక్సిన్ తీసుకోవాలని, అదికూడా రెండు డోసులు కంప‌ల్స‌రీ అని నొక్కి చెబుతున్నారు వైద్యులు. కానీ.. మ‌న దేశంలో చాలామందికి సెకండ్ డోస్ ను వేయ‌కుండా ఆపుతున్నార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. అలాంట‌ప్పుడు వారిలో యాంటీబాడీస్ ఎలా డెవ‌ల‌ప్ అవుతాయ‌నే ప్ర‌శ్న త‌లెత్తుతోంది. ఒక డోసు వేసి వ‌దిలేస్తే.. వ్యాక్సిన్ తీసుకోని కిందనే కదా లెక్క అని చాలా మంది అంటున్నారు. ఇచ్చిందే అత్య‌ల్పం అయితే.. అందులోనూ సెకండ్ డోస్ ఆపేస్తే వ్యాక్సినేష‌న్ జ‌రిగి ఉప‌యోగం ఏంట‌ని అంటున్నారు. మ‌రి, ఈ ప‌రిస్థితి ఎందుకు వ‌చ్చింద‌న్నది అస‌లు ప్ర‌శ్న‌.

అమెరికాలో వ్యాక్సిన్ త‌యారు చేసేవాళ్ల‌కు బిలియ‌న్ డాల‌ర్ల స‌హాయం అందుతోంది. దీంతో.. అక్క‌డ వేగంగా వ్యాక్సిన్ ఉత్ప‌త్తి అవుతోంది. ప్ర‌జ‌ల‌కు కూడా వేగంగా అందుతోంది. కానీ.. ఇండియాలో మాత్రం అలాంటి స‌హ‌కారం ఏదీ అంద‌ట్లేద‌ట‌. సీరం వాళ్ల‌కు ప‌లు ముడిస‌రుకులు కొనుగోలు చేయ‌డానికి కూడా డ‌బ్బుల్లేని ప‌రిస్థితి నెల‌కొంద‌ట‌. అందుకే.. వ్యాక్సిన్ ఉత్ప‌త్తి త‌గ్గిపోయింద‌ని స‌మాచారం.

ఇంత జరుగుతున్నా.. ప్ర‌ధాని మోడీ క‌నీసం ప‌ట్టించుకోవ‌ట్లేద‌ని అంటున్నారు. ఈ కార‌ణం వ‌ల్లే వ్యాక్సినేష‌న్ న‌త్త‌న‌డ‌క‌న సాగుతోంద‌ని అభిప్రాయ‌ప‌డుతున్నారు విశ్లేష‌కులు. క‌రోనా సెకండ్ వేవ్ ముంచుకొస్తున్న వేళ వ్యాక్సిన్ వేగం పెంచ‌డం అత్య‌వ‌స‌రం. వ్యాక్సిన్ తోపాటు ప్ర‌జ‌లు మాస్కులు ఉప‌యోగించ‌డం, భౌతిక దూరం పాటించ‌డం అనేవి ప‌క్కాగా అనుస‌రిస్తేనే.. కొవిడ్ ను నిరోధించ‌డం సాధ్య‌మ‌వుతుంది. కానీ.. క్షేత్ర‌స్థాయిలో మాత్రం ప‌రిస్థితులు వేరుగా క‌నిపిస్తున్నాయి. మ‌రి, వ్యాక్సిన్ ఉత్ప‌త్తి, స‌ర‌ఫ‌రాపై మోడీ ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటారో చూడాల‌ని అంటున్నారు.