Begin typing your search above and press return to search.

కేసీఆర్ అడ్డాలో వీహెచ్ ఎందుకు వెళ్లారు?

By:  Tupaki Desk   |   2 Aug 2020 7:10 AM GMT
కేసీఆర్ అడ్డాలో వీహెచ్ ఎందుకు వెళ్లారు?
X
తన వద్దకువచ్చి సాయం కోసం అడగాలే కానీ.. వెనుకా ముందు చూసుకోకుండా వరాలు ఇచ్చే అధినేతగా కేసీఆర్ కున్న పేరుప్రఖ్యాతుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. తన వద్దకు వచ్చిన వారికి కడుపు నిండిపోయేలా సాయం చేస్తుంటారు. తాను కారులో వెళుతున్న వేళ.. ఎవరైనా సాయం కోసం ఎదురుచూస్తున్నట్లుగా కనిపిస్తే.. అంత పెద్ద కాన్వాయ్ ఆపి మరీ.. పలుకరించి మరీ సాయం చేయటం సారులో కనిపిస్తుంది. అలాంటి ఆయన.. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో సాయం అందించటం లేదా? అంటే.. అవునని చెప్పాలి.

అక్కడెక్కడో గజ్వేల్ లోని ఒక పేద కుటుంబానికి సాయం చేయాల్సిన వేళ.. గులాబీ బాస్ డేగ కంట్లో నుంచి మిస్ అయి వీహెచ్ చెవికి సమాచారం అందింది. అంతే.. యుద్ధ ప్రాతిపదికన ఆయన స్పందించారు. కరోనా వేళ.. రిస్కును పెద్దగా పట్టించుకోకుండా తానే స్వయంగా వెళ్లి సాయం చేసి వచ్చిన వైనం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇంతకీ వీహెచ్ సాయం చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందన్న విషయంలోకి వెళితే..

గజ్వేల్ నియోజకవర్గంలోని వర్గల్ మండలం వేలూరు గ్రామానికి చెందిన నర్సింహులకు 13 గుంటల భూమి ఉంది. దాన్ని లాక్కొని రైతువేదికను నిర్మించే ప్రయత్నం చేశారన్నది సదరు రైతు ఆవేదన. దీనికి కాను.. ఏమీ చేయలేక ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేశారు. ఈ విషయం తెలుసుకున్న కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ బాధితుల వద్దకు వెళ్లారు. ప్రభుత్వ చర్యను తీవ్రంగా ఖండించిన ఆయన.. పేద దళితుడి భూమిని లాక్కోవటం బాధాకరమన్న ఆయన.. వారిని పరామర్శించారు. తనకు తోచిన సాయాన్ని అందించారు.

ఈ సందర్భంగా కేసీఆర్ మీద చురకలు వేశారు. పేద రైతులకు మూడు ఎకరాల భూమి ఇస్తానని చెప్పిన కేసీఆర్.. ఇప్పుడు అందుకు భిన్నంగా ఉన్న 13 గుంటల భూమిని లాక్కోవటం ఏమిటని ప్రశ్నించారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. పేద రైతుకు మూడు ఎకరాల భూమిని.. డబుల్ బెడ్రూం ఇంటిని ఇవ్వాలని డిమాండ్ చేశారు. తన ఇలాకాలోకి వచ్చి సాయం చేయమని డిమాండ్ చేసిన వీహెచ్ మాటను కేసీఆర్ సారు మన్నిస్తారా? లేదా? అన్నది చూడాలి.