Begin typing your search above and press return to search.

మా ఫోన్లు తీయని కేసీఆర్ ప్రగతిభవన్ కు ఎందుకు పిలిచారంటే?

By:  Tupaki Desk   |   7 Feb 2022 6:34 AM GMT
మా ఫోన్లు తీయని కేసీఆర్ ప్రగతిభవన్ కు ఎందుకు పిలిచారంటే?
X
గడిచిన రెండు.. మూడు నెలలుగా తెలంగాణ రాష్ట్ర రాజకీయం విపరీతంగా హీటెక్కిపోతోంది. హుజురాబాద్ ఉప ఎన్నిక తర్వాత నుంచి అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ ఉప ఎన్నికకు ముందు టీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్లు ఉన్న సీన్.. ఆ తర్వాత మారిపోవటమే కాదు.. అప్పటి నుంచి టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అన్నట్లుగా మారింది. దీనికి తగ్గట్లే.. ఇటీవల కాలంలో బోలెడన్ని పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇదిలా ఉండగా.. అకస్మాత్తుగా వామపక్ష నేతల్ని ప్రగతిభవన్ కు ఆహ్వానించిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చర్చలు జరిపిన విషయం తెలిసిందే.

ఇంతకీ వామపక్ష నేతల్ని ఎందుకు పిలిచారు? చర్చల్లో ఏయే అంశాలు వచ్చాయి? బీజేపీ వ్యతిరేక వైఖరిని కేసీఆర్ ఎందుకు మొదలెట్టారు? దాని వెనుక ఎజెండా ఇంకేమైనా ఉందా? లాంటి ప్రశ్నలకు సీపీఐ నారాయణ సమాధానం ఇచ్చారు. తాజాగా ఒక ప్రముఖ చానల్ లో నిర్వహించిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆసక్తికర అంశాల్ని వెల్లడించారు.

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ఏ మాత్రం నమ్మదగిన వ్యక్తి కాదన్నారు. జాతీయ స్థాయిలో బీజేపీ వ్యతిరేక ఓట్లను విభజించే ఎత్తుగడలో ఉన్నారన్న నారాయణ.. ఎన్డీయేకు అనుకూలంగా ఉన్న ఏ రాష్ట్ర ముఖ్యమంత్రిని కేసీఆర్ కలవటం లేదన్నారు. ప్రధాని నరేంద్ర మోడీని వ్యతిరేకించినట్లే ఉంటూ ఆయనకు నమ్మకమైన వ్యక్తిగా ఉండాలని కేసీఆర్ భావిస్తున్నట్లు చెప్పారు.

ఏనాడు తమ ఫోన్లను కూడా సీఎం కేసీఆర్.. తమ జాతీయ నాయకుల్ని చర్చకు పిలిచారని చెప్పిన నారాయణ.. ‘కేసీఆర్ కు సడన్ గా మాపై ప్రేమ పుట్టుకొచ్చింది. జాతీయ స్థాయిలో మూడో ఫ్రంట్ పెట్టటానికి సీపీఐ.. సీపీఎం జాతీయ నాయకుల్ని పిలిపించి మాట్లాడారు. బీజేపీ వ్యతిరేక వైఖరితో ఉండాలని ఆ మీటింగ్ లో అనుకున్నారు. కానీ.. కేసీఆర్ ను నమ్మే పరిస్థితి లేదు. రాష్ట్ర స్థాయిలో ఏమైనా ఉంటే చూసుకోండని జాతీయ నాయకులు చెప్పారు’ అని వెల్లడించారు. ఇక.. బీజేపీ ఇష్యూ మీద నారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు.

‘‘బీజేపీని కేసీఆర్ కావాలనే కెలుక్కుంటున్నారు. బండి సంజయ్ ఏమైనా మాయల ఫకీరా? తలుపునకు తాళం వేసుకొని ఇంట్లో కూర్చుంటే బయటకు లాక్కురావాల్సిన అవసరం ఏమిటి? బీజేపీని రెచ్చగొట్టటానికే ఇదంతా. ఎంఐఎంను అడ్డు పెట్టుకొని బీజేపీ ఎదగాలని ప్లాన్ చేస్తోంది. కాంగ్రెస్ సక్రమంగా ఉండి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు’’ అని మండిపడ్డారు. కమ్యునిస్టులు కాలంతో పాటు మారలేదని.. ముందుచూపుతో ఆలోచించలేకపోయామన్న విషయాన్ని నారాయణ ఒప్పుకున్నారు. అందుకే తమ పార్టీకి ప్రస్తుత పరిస్థితి ఏర్పడిందన్నారు. కార్పొరేట్ విద్యా విధానంతో విద్యార్థి ఉద్యమం అంతరించిందని.. దాని వల్లే వామపక్ష ఉద్యమానికీ అదే గతి పట్టిందన్నారు. మొత్తానికి తాము చేసిన తప్పుల్ని ఓపెన్ గా ఒప్పుకున్న నారాయణ ధైర్యానికి మెచ్చుకోవాల్సిందే.