Begin typing your search above and press return to search.

గుండెపోటు ఎందుకు వస్తుంది?

By:  Tupaki Desk   |   6 Nov 2022 4:30 PM GMT
గుండెపోటు ఎందుకు వస్తుంది?
X
ప్రస్తుత పోటీ ప్రపంచంలో అందరిదీ ఉరుకుల పరుగుల జీవితమైపోయింది. రాత్రిళ్లు ఉద్యోగ విధులు, మారిన ఆహార పానీయాల అలవాట్లు, నిద్రలేమి, వ్యాయామానికి అసలు సమయం కేటాయించలేకపోవడం, గంటల తరబడి కూర్చుని పనిచేయడం వంటి కారణాలతో వయసు మళ్లిన తర్వాత రావాల్సిన జబ్బులన్నీ వయసులో ఉండగానే వచ్చేస్తున్నాయి. ముఖ్యంగా హార్ట్‌ ఎటాక్‌ (గుండెపోటు) యువత ప్రాణాలను సైతం హరిస్తుండటం కలకలం రేపుతోంది.

వైద్య నిపుణులు చెబుతున్నదాని ప్రకారం.. సాధారణంగా ఒక వ్యక్తి అనారోగ్యకరమైన ఆహారం, మారిన జీవనశైలి, ఊబకాయం, అధిక కొలెస్ట్రాల్, అధిక రక్తపోటు కారణంగా గుండెపోటుకు గురవుతారు. సకాలంలో వైద్యం అందకపోతే ప్రాణాలు పోయే అవకాశం కూడా ఉంటుంది.

ఒక వ్యక్తి గుండెపోటుకు ఎప్పుడు గురవుతారంటే.. శరీరంలోని ధమనులలో చెడు కొలెస్ట్రాల్‌ పరిమాణం పెరిగినప్పుడు.. అది ఫలకల మాదిరిగా పేరుకుపోతుంది. ఇది రక్త నాళాలలో రక్త సరఫరాకు ఆటంకాలు కలిగిస్తుంది. అంతేకాకుండా గుండెకు రక్తం సరఫరా కాకుండా అడ్డుకుంటుంది. దీంతో రక్తం గుండెకు చేరుకోవడానికి ఇబ్బందులు తలెత్తుతాయి. దీనివల్ల రక్తపోటు పెరిగిపోయి గుండెపోటు సంభవిస్తుంది.

ఇక గుండెపోటును ఎలా గుర్తించాలంటే.. గుండెపోటు వచ్చే ముందే కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. శ్వాస పీల్చుకోవడంలో ఇబ్బందులు, గాలి ఆడకపోవడం, అధికంగా చెమటలు పట్టడం, ఛాతీలో నొప్పి, తలతిరగడం, అలసటగా ఉండటం, దవడ లేదా పంటి నొప్పి, వికారం, వాంతులు, గ్యాస్‌ వంటి లక్షణాలు తలెత్తుతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.

ఇక ఒక వ్యక్తి తన జీవితకాలంలో సహజంగా మూడుసార్లు గుండెపోటుకు గురవుతారని వైద్యులు చెబుతున్నారు. సాధారణంగా 40 ఏళ్లు పైబడిన వ్యక్తులు ఈ గుండెపోటు బారిన పడే ప్రమాదం ఉందని అంటున్నారు. గుండెపోటు ఏ క్షణంలోనైనా సంభవించే చాన్స్‌ ఉందని వివరిస్తున్నారు.

గుండెపోటు రాకుండా ఉండాలంటే సంతులన ఆహారాన్ని తీసుకోవాలి. ఉప్పు, చక్కెర, నూనెతో కూడిన ఆహారాలను వీలైనంత మేర తినకూడదు. చేపలు, ఆకు కూరలు, తృణధాన్యాలు అధికంగా ఆహారంలో ఉండేలా చూసుకోవాలని చెబుతున్నారు. ధూమపానం, మద్యపానం వంటివాటికి దూరంగా ఉండాలి. అధిక బరువు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే వీలైనంతవరకు నడక పైనే ఆధారపడాలి.