Begin typing your search above and press return to search.

ఎప్పుడు చనిపోతానని అడుగుతున్నారు!

By:  Tupaki Desk   |   23 Aug 2016 4:54 AM GMT
ఎప్పుడు చనిపోతానని అడుగుతున్నారు!
X
93 ఏళ్ల సీనియర్ ఫేమస్ లాయర్ రామ్ జెఠ్మలానీకి కోపం వచ్చింది. దానిపై ఆయన తనదైన శైలిలో స్పందించి రిప్లై ఇచ్చారు. ఈ వాదోపవాదనలకు సుప్రీం కోర్టు వేదికైంది. సాదారణంగా ఎవరికైనా 90 ఏళ్ల వయసు దాటిందంటే నూటికి 99మంది రిటైర్మెంట్ ప్రకటించేసుకుని భక్తిమార్గంవైపు పోవడం సాదారణంగా జరుగుతుంటుంది. రాజకీయ నాయకుల్లో మాత్రం అలాంటి అవకాశం లేకుండా చివరి క్షణం వరకూ ఏదో ఒక యావతో నెట్టుకొస్తుంటారు. అయితే ప్రస్తుతం 93వ పడిలో ఉన్న రామ్ జెఠ్మలానీ మాత్రం రిటైర్ కాలేదు. దీనిపై సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి కూడా రామ్ జెఠ్మలానీ ని ఈ ప్రశ్న అడిగీగారు.

93 ఏళ్ల వయసు వచ్చినా ఇప్పటికీ లాయర్ గా రామ్ జెఠ్మలానీ డిమాండు ఏమాత్రం తగ్గలేదు, వాదనల్లో వాడి వేడి కూడా తగ్గలేదు. అందుకే దేశవ్యాప్తంగా ఇప్పటికీ ఆయనే నెంబర్ వన్ క్రిమినల్ లాయర్. హైప్రొఫైల్ కేసుల్లో గంటల లెక్కన ఫీజు తీసుకుని వాదించే స్థాయి ఆయనది. అది కూడా లక్షల్లో ఉండటం గమనార్హం. ఇలాంటి లాయర్ తాజాగా ఎంఎం కశ్యప్ అనే న్యాయవాదిని ఆయన ఛాంబర్ ఖాళీ చేయాల్సిందిగా సుప్రీంకోర్టు ఆదేశించిన విషయానికి సంబంధించిన కేసును వాదిస్తున్నారు. ఈ సందర్భంలోనే.. "మీరెప్పుడు రిటైర్ అవుతున్నారు" అంటూ జెఠ్మలానీని ప్రధాన న్యాయమూర్తి టీఎస్ ఠాకూర్ నేతృత్వంలోని ధర్మాసనం ప్రశ్నించింది. దానికి సమాధానంగా జెఠ్మలానీ..."నేను ఎప్పుడు చనిపోతానని మీరు అడుగుతున్నారు" అని జవాబు చెప్పారు. అంటే.. ఊపిరి ఉన్నంతవరకు న్యాయవాద వృత్తిలో తాను నిర్మొహమాటంగా, నిరభ్యంతరంగా కొనసాగుతూనే ఉంటానని, మృత్యువు మాత్రమే తనకు రిటైర్మెంట్ ఇవ్వగలదని ఆయన చెప్పకనే చెప్పారు. ఇదే రామ్ జెఠ్మలానీ స్టైల్.. సుత్తిగా, సూటిగా చెప్పడం వల్లే ఈయనకు ఆ స్థాయి డిమాండ్. ఏది ఏమైనా.. ఈయన మాటలు నేటి యువతకు పరోక్షంగా ఆదర్శమనే చెప్పాలి.