Begin typing your search above and press return to search.

ఆ రాష్ట్రాల్లో మాదిరి పెట్రో పన్నును కేసీఆర్ ఎందుకు తగ్గించరు?

By:  Tupaki Desk   |   6 Nov 2021 4:40 AM GMT
ఆ రాష్ట్రాల్లో మాదిరి పెట్రో పన్నును కేసీఆర్ ఎందుకు తగ్గించరు?
X
మాటల్లో వినిపించే బడాయి చేతల్లో చూపించని తత్త్వం ప్రభుత్వాలకు ఇబ్బందికరంగా మారుతుంటాయి. అడగకున్నా వరాలు ఇచ్చే వరాల దేవుడి పాత్రను పోషించే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్.. దేశంలో మరెక్కడా లేని సంక్షేమ పథకాల్ని తెర మీదకు తీసుకొచ్చి.. దేశానికి తెలంగాణ దిక్సూచిలా మారుతుందన్న మాట ఆయన నోటి నుంచి వినిపిస్తూ ఉంటుంది. అలాంటి పెద్ద మనిషి.. తాము బాదేస్తున్న పన్ను బాదుడ్ని కాస్తంత తగ్గించుకునే విషయంలో మాత్రం ససేమిరా అనటం కనిపిస్తూ ఉంటుంది. తాజాగా కేంద్రంలోని మోడీ సర్కారు పెట్రోల్.. డీజిల్ మీద రూ.5, 10 చొప్పున ఎక్సైజ్ పన్నును తగ్గించటం తెలిసిందే.

కేంద్రం తీసుకున్న నిర్ణయంతో పెట్రోల్ మీద కనిష్ఠంగా లీటరుకు రూ.5.7 నుంచి గరిష్ఠంగా రూ.6.35 వరకు తగ్గిన పరిస్థితి. అదే సమయంలో లీటరు డీజిల్ మీద కనిష్ఠంగా రూ.11.6 నుంచి రూ.12.88 వరకు ధర తగ్గిన పరిస్థితి. కేంద్రం ధరల్ని తగ్గించిన నేపథ్యంలో వివిధ రాష్ట్రాలు తమ వంతుగా వ్యాట్ పన్నుకోతను ప్రకటించటం ద్వారా ప్రజలకు ఉపశమనాన్ని ఇచ్చేలా ప్రకటనలు చేస్తున్నారు. మోడీ సర్కారు పెట్రోల్.. డీజిల్ ధరల్ని తగ్గేలా అదనపు చర్యలు తీసుకున్న వేళ.. దేశం మొత్తంగా దాదాపు డజనుకు పైగా రాష్ట్రాలు.. పలు కేంద్రపాలిత ప్రాంతాల్లోని ప్రభుత్వాలు తమ వంతుగా వ్యాట్ పోటుకు కోత వేసుకున్నారు.

దేశంలో పెట్రోల్.. డీజిల్ మీద అత్యధిక వ్యాట్ విధిస్తున్న రాష్ట్రంగా రాజస్థాన్ నిలిచింది. ఈ రాష్ట్రంలో ఏకంగా 36 శాతం వ్యాట్ పోటు పడుతోంది. అంటే.. లీటరు పెట్రోల్ రూ.100 ఉంటే.. ప్రతి లీటరు అమ్మకంతో రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వానికి నేరుగా రూ.36 పన్ను రూపంలో ప్రభుత్వ ఖజానాకు జమ అవుతోంది. ఇక.. దేశంలో అత్యధిక వ్యాట్ వసూలు చేసే రెండో రాష్ట్రంగా తెలంగాణ ప్రభుత్వమే. కేసీఆర్ సర్కారు పెట్రోల్ మీద 35.2 శాతం.. డీజిల్ మీద 27 శాతం చొప్పున వ్యాట్ వసూలు చేయటం తెలిసిందే.

ఇటీవల జరిగిన హుజూరాబాద్ ఉప ఎన్నిక సందర్భంగా టీఆర్ఎస్ నేతలు పలువురు కేంద్రం పెద్ద ఎత్తున పెట్రోల్.. డీజిల్ ధరల్ని పెంచేసిందని.. ఆ భారాన్ని తగ్గించాలని డిమాండ్ చేసింది. మోడీ సర్కారు పెట్రోల్.. డీజిల్ మీద పన్నుపోటును తగ్గించిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వాలు తమ వంతుగా ఎంతోకొంత తగ్గించాలన్న డిమాండ్ అంతకంతకూ పెరుగుతోంది. ఇలాంటివేళ.. తెలంగాణ ప్రభుత్వ తీరు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నట్లు చెబుతున్నారు. పెట్రోల్.. డీజిల్ మీద వసూలు చేస్తున్న వ్యాట్ ను తగ్గించటానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా లేదంటున్నారు.

దీనికి కారణం.. పెద్ద ఎత్తున వస్తున్న ఆదాయాన్ని వదులుకోవటం ఇష్టం లేకనే అని చెబుతున్నారు. ఏడాదిన్నర వ్యవధిలో పెట్రోల్ ధర లీటరుకు రూ.38పెరిగిన వేళ.. కేంద్రం కొంత మేర ధర తగ్గేలా నిర్ణయం తీసుకున్నప్పుడు.. రాష్ట్ర ప్రభుత్వం సైతం ఎంతోకొంత తన వంతుసాయంగా తగ్గించాల్సి ఉందన్న మాట వినిపిస్తోంది. అయితే.. పెట్రోల్.. డీజిల్ మీద వ్యాట్ తగ్గించటం ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే అదనపు రాజకీయ ప్రయోజనం ఏమీ ఉండదని.. ఈ కారణంతోనే పెట్రోల్.. డీజిల్ మీద వసూలు చేసే పన్నును తగ్గించటానికి సిద్ధంగా లేదంటున్నారు.

రాష్ట్రానికి వచ్చే ప్రధాన ఆదాయ వనరు రెండింటి ద్వారానే వస్తోంది. అందులో ప్రధానమైనది ఎక్సైజ్ అమ్మకాలతో.. అదేనండి మద్యం అమ్మకాలతో అయితే రెండోది పెట్రోల్.. డీజిల్ మీద వచ్చే వ్యాట్ ద్వారా. జీఎస్టీ రాక ముందు అన్ని వస్తు సేవల మీద విధించే వ్యాట్ అమల్లో ఉండేది.జీఎస్టీ వచ్చిన తర్వాత ఒక దేశం.. ఒకటే పన్ను విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చినా.. ఆ జాబితాలో మాత్రం పెట్రోల్..డీజిల్ ను చేర్చలేదు. మద్యాన్ని కూడా ఇందులోచేర్చకపోవటం తెలిసిందే.

పెట్రోల్.. డీజిల్ ద్వారా వ్యాట్ ఆధాయం తెలంగాణ రాష్ట్రానికి నెలకు రూ.800 నుంచి రూ.900 కోట్ల వరకు వస్తోంది. మద్యం నుంచి వచ్చే ఆదాయాన్ని కూడా కలుపుకుంటే దాదాపుగా నెలకు రూ.2500 కోట్లు అవుతుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో వ్యాట్ ద్వారా ప్రభుత్వానికి రూ.26,500 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేసింది. ఆర్థిక సంవత్సరంలోని తొలి ఆర్నెల్లు (ఏప్రిల్ - సెప్టెంబరు) మధ్య కాలానికి రూ.12,815 కోట్ల రాబడి వచ్చింది. మిగిలిన ఆర్నెల్లలో అనుకున్న అంచనాకు చేరుకోవాలి. ఇలాంటివేళ.. పెట్రోల్.. డీజిల్ మీద వ్యాట్ ను తగ్గిస్తే.. ప్రభుత్వానికి వచ్చే రాబడి భారీగా తగ్గుతుంది. అదే జరిగితే... బడ్జెట్ అంచనాలు తలకిందులు అవుతాయి.

ఇప్పటికే మోయలేనంత ఎక్కువగా సంక్షేమ పథకాల్ని అమలు చేస్తున్న కేసీఆర్ సర్కారుకు.. ఇప్పుడు వస్తున్న ఆదాయానికి మించి రావాల్సి ఉంటుంది. అందుకు భిన్నంగా వచ్చే ఆదాయానికే గండి పడితే మరింత ఆర్థిక ఇబ్బంది ఎదురవుతుంది. అందుకే.. ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా.. మరెన్ని విమర్శలు వెల్లువెత్తినా తగ్గించేందుకు మాత్రం ససేమిరా అంటున్న వైనం తాజాగా కనిపిస్తోంది. అందరూ నడిచే దారిలో నడవకుండా.. వ్యాట్ పోటును తగ్గించే విషయంలో కేసీఆర్ సర్కారు అనుసరిస్తున్న మొండితనం.. ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారుతుందన్న మాట బలంగా వినిపిస్తోంది. మరేం జరుగుతుందో చూడాలి.