Begin typing your search above and press return to search.

బడ్జెట్ సమావేశాల ముందు హల్వా వేడుక ఎందుకు..?

By:  Tupaki Desk   |   23 Jan 2022 7:30 AM GMT
బడ్జెట్ సమావేశాల ముందు హల్వా వేడుక ఎందుకు..?
X
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఫిబ్రవరిలో ప్రారంభం కానున్నాయి. ఆ నెల ఒకటో తేదీన 2022 బడ్జెట్ ను పార్లమెంట్లో ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టనున్నారు. అందుకు సంబంధించిన కార్యాచరణను అధికారులు పూర్తి చేస్తున్నారు. అన్ని రంగాల వ్యాపార వేత్తలు, ఆర్థిక వేత్తలు అంచనాలను వివిధ మార్గాల ద్వారా ఇప్పటికే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కు పంపగా వాటిని అధికారులను అందించారు. 10 రోజుల పాటు కసరత్తు చేసి బడ్జెట్ కు సంబంధించిన విధి విధానాలను రూపొందిస్తారు. అయితే ప్రతీ పార్లమెంట్ సమావేశాలకు ముందు హల్వా తయారుచేయడం ఆనవాయితీ. అధికారుల కష్టం మరిచిపోయే విధంగా దీనిని తయారు చేసి వారికి అందిస్తారు. అయితే ఈ హల్వా చేయడం దేనికి..?

బడ్జెట్ కు సంబంధించిన కసరత్తు పూర్తయిన తరువాత పార్లమెంట్ నార్త్ బ్లాక్లోకి హల్వా సందడి మొదలవుతుంది. గతంలో బడ్జెట్ ను ప్రింటింగ్ కు పంపేముందు దీనిని నిర్వహించారు. అయితే గత సంవత్సరం నుంచి పేపర్ లెస్ బడ్జెట్ ను ప్రవేశపెట్టడంతో ప్రింటింగ్ అవసరం లేకుండా పోయింది. భారతీయ సాంప్రదాయ ప్రకారం ఏదైనా పనిని మొదలు పెట్టేటప్పుడు పూజలు నిర్వహిస్తాం. అయితే బడ్జెట ప్రవేశపెట్టేముందు ఇలాంటి పూజలు నిర్వహించకుండా హల్వా తయారు చేసి తినడం ఆనవాయితీగా పెట్టుకున్నారు.

బడ్జెట్ రూపకల్పనలో అధికారులు 10 రోజుల పాటు తలమునకలవుతారు. ఈ పదిరోజులు అధికారులు తమ కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడరు. అంటే బడ్జెట్ కు సంబంధించి చిన్న విషయం కూడా బయటికి పొక్కదు. ఇలా 10 రోజుల పాటు ప్రపంచంతో సంబంధం లేకుండా బడ్జెట్ రచించిన అధికారులకు హల్వా వేడుక కాస్త ఉల్లాసాన్నిస్తుంది. ఈ హల్వా వేడుకలో ఆర్థిక మంత్రి స్వయంగా పాల్గొంటారు. హల్వాను అధికారులకు పంచి వారి నోరు తీపి చేస్తారు.

పది రోజుల తరువాత బడ్జెట్ ను ప్రింటింగ్ కు పంపే ముందు హల్వా వేడుకను నిర్వహిస్తారు. 1947 నుంచి 1950 వరకు బడ్జెట్ పత్రాలను రాష్ట్రపతి భవన్లో ముద్రించేవారు. అయితే ఆ ఏడాది బడ్జెట్లోని కీలక అంశాలు లీక్ కావడంతో 1950 తరువాత మౌంట్ రోడ్ లోని గవర్నమెంట్ ప్రెస్ కు మార్చారు. ఇక 1980 నుంచి బడ్జెట్ పత్రాల ముద్రణ కోసం ప్రత్యేకమైన ప్రెస్ ను నార్త్ బ్లాక్లో ప్రారంభించారు. ఈ బడ్జెట్ ప్రెస్ హాల్ అత్యాధునికంగా నిర్మించారు. అయితే కరోనా కారణంగా గత ఏడాది బడ్జెట్ ను ట్యాబ్ ద్వారా ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామణ ప్రవేశపెట్టారు. ఈసారి కూడా అదే పద్ధతి పాటించే అవకాశం ఉంది.