Begin typing your search above and press return to search.

ఏపీలో అలా.. తెలంగాణలో ఇలా.. ఈసీ ఇదేం లెక్క?

By:  Tupaki Desk   |   10 April 2019 7:09 AM GMT
ఏపీలో అలా.. తెలంగాణలో ఇలా.. ఈసీ ఇదేం లెక్క?
X
ఒక రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి.. నిఘా వర్గాల డీజీ.. పలు జిల్లాల ఎస్పీలు.. వీరందరిపై బదిలీ వేటు వేస్తూ సంచలన నిర్ణయాలు తీసుకుంటున్న ఈసీ తీరు ఏపీలో హాట్ టాపిక్ గా మారింది. ఏపీ అధికారపక్షంపై విపక్షం ఫిర్యాదు చేసిన వెంటనే యుద్ధ ప్రాతిపదికన స్పందించే ఎన్నికల సంఘం తీరుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఏపీలో ఈ తీరులో వ్యవహరిస్తుంటే.. తెలంగాణలో అందుకు భిన్నంగా వ్యవహరిస్తుందన్న విమర్శ వినిపిస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ తీరుపైన విపక్ష నేతలు ఫిర్యాదు చేసినా.. చర్యలు తీసుకోవటం లేదన్న మాట అంతకంతకూ పెరుగుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈసీ వ్యవహరిస్తున్న తీరుసరిగా లేదన్న మాట పలువురి నోట వినిపిస్తోంది.

ఏపీలో కఠినంగా ఉన్న ఈసీ..తెలంగాణలో మాత్రం అధికారపక్షం వ్యవహారశైలి మీదా.. అధికారుల మీద ఫిర్యాదులు చేస్తే.. పట్టనట్లుగా ఎందుకు ఉంటున్నారన్న ప్రశ్నకు సమాధానం చిక్కనిది. ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం మీద పలు విమర్శలు.. ఆరోపణలు వెల్లువెత్తుతున్న వేళ.. రెండు తెలుగు రాష్ట్రాల్లో భిన్నమైన పోకడల్ని ప్రదర్శిస్తున్న ఈసీ తీరును పలువురు తప్పు పడుతున్నారు.

స్వతంత్య్ర వ్యవస్థగా ఉండే ఎన్నికల సంఘం తీరు ఎక్కడైనా ఒకేలా ఉండాలే తప్పించి.. వేర్వేరుగా ఉండకూడదంటున్నారు. ఈ తీరు ఏ మాత్రం మంచిది కాదని.. వ్యవస్థలపై ప్రజలకున్న నమ్మకాన్నికోల్పోయేలా చేస్తుందన్న మాట బలంగా వినిపిస్తోంది. ఏపీలో అంత చురుగ్గా వ్యవహరిస్తున్న ఈసీ.. తెలంగాణలో మాత్రం ఫిర్యాదుల విషయంలో అంతే చురుగ్గా ఎందుకు వ్యవహరించటం లేదన్న ప్రశ్నకు సమాధానం లభించని పరిస్థితి.