Begin typing your search above and press return to search.

పార్టీలకు ప్రభుత్వ స్థలాలెందుకు ?

By:  Tupaki Desk   |   24 Jun 2022 9:30 AM GMT
పార్టీలకు ప్రభుత్వ స్థలాలెందుకు ?
X
రాజకీయ పార్టీలకు ప్రభుత్వ స్థలాలు కేటాయింపు వివాదం బాగా పెరిగిపోతోంది. టీఆర్ఎస్ భవనాల నిర్మాణాలకు ప్రభుత్వ స్థలాల కేటాయింపుపై కోర్టు కేసీయార్ కు నోటీసులు జారీ చేసింది. 33 జిల్లాల్లోను కారుచౌకగా ప్రభుత్వ స్ధలాలను కేటాయించటం బాగా వివాదాస్పదమైంది. ఇప్పటికే కొన్ని జిల్లాల్లో పార్టీ ఆఫీసుల నిర్మాణం జరిగిపోతున్నాయి. మరికొన్ని జిల్లాల్లో ఇంకా భవనాల నిర్మాణం మొదలు కాలేదు. ఈ దశలోనే హైకోర్టు కేసీయార్ కు నోటీసులిచ్చింది.

నిజానికి పార్టీలకు ప్రభుత్వ స్ధలాలు కేటాయించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రభుత్వ భూమంటే అది ప్రజల ఆస్తనే లెక్క. ప్రజల ఆస్తి ప్రజలకే దక్కాలి కానీ ప్రైవేటు వ్యక్తులకు లేదా రాజకీయ పార్టీలకు ఎలా సొంతమవుతుంది ? రాజకీయాపార్టీలేవి ప్రజల ఆస్తులు కావు. ఇవన్నీ ప్రైవేటువనే గుర్తుంచుకోవాలి. ఏవో పరిశ్రమలు, ఫ్యాక్టరీల ఏర్పాటులో ప్రైవేటు సంస్ధలకు ప్రభుత్వ భూములిచ్చినా అర్థముంది.

ఎందుకంటే పరిశ్రమలు నిర్మించినా, ఫ్యాక్టరీలు ఏర్పాటుచేసిన జనాలకు ఉద్యోగ, ఉపాధి దొరుకుతుంది కాబట్టి పోనీలే అనుకోవచ్చు. కానీ రాజకీయ పార్టీల వల్ల మామూలు జనాలకు ఒరిగేదేమీ లేదు.

గజం ఖరీదు లక్షల్లో ఉన్న ప్రాంతాల్లో కూడా టీఆర్ఎస్ పార్టీకి ప్రభుత్వం 100 రూపాయలకే కేటాయించేసింది. ఇదే సమయంలో ప్రతిపక్షాలకు మాత్రం గజం స్ధలం కూడా కేటాయించలేదు. తమ పార్టీల కార్యాలయాలు నిర్మించుకునేందుకు స్ధలాలు కేటాయించాలని కలెక్టర్లకు, ప్రభుత్వానికి ఎన్ని లేఖలు రాస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.

ఇక్కడే ప్రతిపక్షాలకు ఒళ్ళూ మండిపోయి కోర్టులో పిటీషన్ దాఖలు చేశాయి. దాంతో కోర్టు జోక్యం చేసుకుని ఏకంగా కేసీయార్ కే నోటీసులు జారీచేసింది. తన ఒంటెత్తు పోకడలపై కేసీయార్, టీఆర్ఎస్ పార్టీ కోర్టు విచారణలో ఏమి సమాధానం చెబుతారో చూడాల్సిందే.

అసలు ప్రభుత్వ భూములను రాజకీయ పార్టీలకు కేటాయించాల్సిన అవసరమే లేదు. పోనీ కేటాయించుకుటుంన్నారంటే అది మిగిలిన పార్టీలకు కూడా వర్తింపచేయాలి. అలా కాకుండా కేవలం అధికారపార్టీ మాత్రమే కోట్ల రూపాయల భూములు కొట్టేస్తు ప్రతిపక్ష పార్టీలను ఎండ బెడుతుంటే అవి చూస్తూ ఊరుకుంటాయా ? మరి తన చర్యను కేసీఆర్ ఏ విధంగా సమర్ధించుకుంటారో చూడాల్సిందే.