Begin typing your search above and press return to search.
ఇల్లు ఇప్పుడెందుకు నరకంగా మారుతోంది?
By: Tupaki Desk | 27 March 2020 3:30 AM GMTవిపత్కర వేళ.. జాతిని ఉద్దేశించి ప్రధాని మోడీ ప్రసంగిస్తారంటే చాలు.. ఆయనేదో కీలకమైన నిర్ణయాన్ని తీసుకుంటున్నట్లే లెక్క. అందుకు తాజా ఉదాహరణ రెండు రోజుల క్రితం (మంగళవారం) రాత్రివేళ టీవీ స్క్రీన్ మీదకు వచ్చిన ఆయన.. కరోనాతో ప్రమాదం ఎంతన్న విషయాన్ని చెబుతూ.. 21 రోజుల పాటు దేశ ప్రజలంతా లాక్ డౌన్ ను పాటించాలని.. అదెంత పక్కాగా పాటిస్తే.. అంత మంచిదన్న విషయాన్ని చెప్పేశారు.
ప్రమాదకర శత్రవుతో పోరాడుతున్న విషయాన్ని తన మాటలతో చెప్పిన ఆయన.. తమ ప్రభుత్వం ఇంత తీవ్రమైన నిర్ణయాన్ని ఎందుకు తీసుకుంటున్నది చెప్పేశారు. ఇంట్లో నుంచి బయటకు రావొద్దంటూ కేంద్రం చెప్పటానికి ముందు అప్పటికే కొన్ని రాష్ట్రాల్లో లాక్ డౌన్ అమలు చేస్తున్నాయి. అలాంటి వారికి.. ఆ పరిస్థితి ఎలా ఉంటుందో పరిచయమే. మిగిలిన వారికి మాత్రం కొత్త అనుభవం. అయితే.. చాలా రాష్ట్రాల్లో మార్చి 31 వరకు మాత్రమే లాక్ డౌన్ అనటంతో పది రోజులే కదా? గడిపేద్దామని అనుకున్నారు. కానీ.. అలాంటివేమీ లేకుండా ఏకా ఏకిన 21 రోజుల పాటు లాక్ డౌన్ అన్నంతనే.. అది కాస్తా కొత్త అనుభవంగా మారింది. ఆందోళనలు మొదలయ్యాయి.
అరచేతి దరిద్రం (సెల్ ఫోన్) చేతికి వచ్చేసి.. అందులో డేటా అన్న మహమ్మారికి బానిసగా మారిపోయిన తర్వాత.. ఎవరి ప్రపంచం వారిదైంది. సమూహంలో ఒంటరిగా.. ఇంట్లో వారంతా ఎవరికి వారు తెలీని అపరిచతులుగా మారిపోతున్న వేళ.. కరోనా ఇప్పుడు కొత్త ఈక్వేషన్లు తీసుకొచ్చింది. బాగా దగ్గరి వాళ్లు కూడా.. కరోనా తర్వాత కలుద్దామని చెప్పటం.. ఇంట్లో వారు తప్పించి.. మిగిలిన వారెవరూ కలిసే అవకాశం లేకుండాపోవటంతో.. ఇల్లు కాస్తా జైలుగా మారిపోయింది. అందుకేనేమో ఇంట్లో ఉండిపోతున్న కొందరు లాక్ డౌన్ ను.. బ్రేక్ డౌన్ గా ఫీల్ అవుతున్నారు.