Begin typing your search above and press return to search.

కవిత ఖండన మొత్తం కేసీఆర్ చుట్టూనే.. కత్తిలాంటి అన్సర్ మిస్ అయ్యిందా?

By:  Tupaki Desk   |   22 Aug 2022 3:30 PM GMT
కవిత ఖండన మొత్తం కేసీఆర్ చుట్టూనే.. కత్తిలాంటి అన్సర్ మిస్ అయ్యిందా?
X
సంచలన ఆరోపణలతో ఒక్కసారి ఉలిక్కిపడేలా చేశారు ఢిల్లీ బీజేపీ నేతలు. బీజేపీ ఎంపీ పర్వేష్ వర్మ.. మాజీ ఎమ్మెల్యే మంజిందర్ సిర్సాలపై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కుమార్తె కమ్ ఎమ్మెల్సీ కవితపై తీవ్ర ఆరోపణలు చేయటం తెలిసిందే.

ఢిల్లీలో వెలుగు చూసిన మద్యం కుంభకోణంలో ఎమ్మెల్సీ కవిత పాత్ర గురించి వారు వివరంగా వెల్లడించటం తెలిసిందే. ఈ సందర్భంగా వారు పలు అంశాల్ని ప్రస్తావించారు. కవిత స్టే చేసే హోటల్ మొదలు.. స్కాంలో ఆమె పాత్ర ఏమిటన్న దానిపై వారు వివరంగా వివరాలు వెల్లడించారు.

దీంతో.. ఈ వ్యవహారం పెను సంచలనంగా మారింది. ఇదిలా ఉంటే.. సోమవారం ఉదయం ఎమ్మెల్సీ కవిత మీడియాతో మాట్లాడారు. ఆమె మాటలన్ని కూడా రాజకీయ కక్షలో భాగంగానే ఈ ఆరోపణలు అని చెప్టంతో పాటు.. సీఎం కేసీఆర్ కుమార్తెను బద్నాం చేయటంతో కేసీఆర్ తగ్గుతారని అనుకుంటున్నారంటూ ఆమె ఎమోషన్ తో కూడిన వ్యాఖ్యలు చాలానే చేశారు.

ఎవరెన్ని చెప్పినా.. ఎంత ఒత్తిడికి గురి చేసినా కేసీఆర్ వెనక్కి తగ్గరని.. కేంద్రాన్ని విమర్శిస్తున్నఆయన్ను మానసికంగా కుంగదీయాలనే ప్రయత్నాలు తప్పించి మరింకేమీ లేదని ఆమె పేర్కొన్నారు. కవిత చేసిన వ్యాఖ్యలు మొత్తం ఎమోషన్ తో కూడిన వ్యాఖ్యలే తప్పించి.. ఢిల్లీ బీజేపీ నేతలు సంధించిన ప్రశ్నాస్త్రాల జోలికి మాత్రం ఆమె వెళ్లలేదు. కవిత తన నిజాయితీని చాటి చెప్పాలని భావిస్తే.. ఢిల్లీ బీజేపీ నేతలు వెల్లడించిన వివరాలను ప్రస్తావిస్తూ.. అందులోని డొల్లతనాన్ని చెప్పే ప్రయత్నం చేయాలన్న మాట వినిపిస్తోంది.

అందుకు భిన్నంగా ఢిల్లీ బీజేపీ నేతలపై పరువు నష్టం దావా వేసేందుకు సిద్ధమవుతున్నట్లుగా ప్రకటించటం వల్ల పెద్ద ప్రయోజనం ఉండదన్న మాట వినిపిస్తోంది.

తనపై నిరాధార ఆరోపణలు సంధించారన్నదే కవిత మాట అయితే.. అసలు ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో తనకు ఏ విధంగా అంటగడతారన్న ప్రశ్నల్ని సంధించాల్సిన అవసరం ఉంది. అంతేకాదు ఢిల్లీకి చెందిన బీజేపీ ఎంపీ.. మాజీ ఎమ్మెల్యేలే ఎందుకు తనను టార్గెట్ చేసిన వైనానికి సంబంధించిన తెర వెనుక విషయాల్ని కూడా వెల్లడించటం ద్వారా ఆమె తన కమిట్ మెంట్ ను ప్రజలకు మరింత అర్థమయ్యేలా చెప్పగలరని చెప్పక తప్పదు.