Begin typing your search above and press return to search.

బెంగాల్లో బీజేపీకి దెబ్బేస్తోందెవ‌రు‌.. గెలుపుపై స‌డ‌లుతున్న ధీమా..!

By:  Tupaki Desk   |   24 March 2021 3:30 AM GMT
బెంగాల్లో బీజేపీకి దెబ్బేస్తోందెవ‌రు‌.. గెలుపుపై స‌డ‌లుతున్న ధీమా..!
X
ఒక్క మ‌న‌ద‌గ్గ‌రే కాదు.. ఎన్నిక‌లు ఎక్క‌డ జ‌రిగినా.. ఏ పార్టీకైనా.. రెబెల్స్ బెడ‌ద స‌ర్వ‌సాధార‌ణంగా మారింది. ప్ర‌స్తుతం అసెంబ్లీ ఎన్నిక‌లకు రెడీ అయిన ప‌శ్చిమ బెంగాల్లో అధికారంలోకి వ‌చ్చేందుకు బీజేపీ తీవ్రంగా కృషి చేస్తోంది. ఈ క్ర‌మంలో ప్ర‌ధాని మోడీ, హోం మంత్రి అమిత్ షాలు సైతం అక్క‌డ ప్ర‌చారం చేస్తున్నారు. ఇక‌, కీల‌క నేత‌ల‌ను, సినీ రంగాన్ని సైతం న‌మ్ముకుని ప్ర‌స్తుత అధికార పార్టీ తృణ‌మూల్ కాంగ్రెస్‌పై యుద్ధం చేస్తున్నారు. అయితే.. ఇంత చేస్తున్నా.. ఇప్పుడు బీజేపీని రెబెల్స్ ఒణికిస్తున్నారు. నిన్న మొన్న‌టి వ‌ర‌కు త‌మ‌దే గెలుపు! అని చెప్పుకొచ్చిన క‌మ‌ల‌నాథులు.. ఇప్పుడు ఒకింత ఆందోళ‌న‌లో ప‌డ్డార‌నే వాద‌న వినిపిస్తోంది.

మ‌రి దీనికి కార‌ణాలు ఏంటి? ఎందుకు ఇలా జ‌రిగింది? అంటే.. సాధార‌ణంగా ఎక్క‌డ ఎన్నిక‌లు జ‌రిగినా.. పార్టీ ఏదైనా.. అప్ప‌టి వ‌ర‌కు పార్టీని బ‌లోపేతం చేసిన నాయ‌కులు.. పార్టీని అంటిపెట్టుకుని ఉన్న నాయ‌కులు టికెట్ల‌ను ఆశిస్తారు. ఇలానే బెంగాల్‌లో బీజేపీ నాయ‌కులు కూడా టికెట్ల‌ను ఆశించారు. పైగా బీజేపీ తొలిసారి అధికారంలోకి వ‌స్తుంద‌న్న అంచ‌నాలు ఆ పార్టీ నేత‌ల్లో ఎక్కువుగా ఉండ‌డంతో అక్క‌డ బీజేపీ సీట్ల కోసం తీవ్ర‌మైన పోటీ ఉంది. కానీ, బీజేపీ నేత‌లు .. మాత్రం వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రించారు. తృణమూల్‌ నుంచి ఫిరాయించిన 22 మందికి టికెట్లు కేటాయించారు. అంతేకాదు.. ప్రజా బలం లేని అనేకమందిని రంగంలోకి దింపారు. దీంతో అప్ప‌టి వ‌ర‌కు పార్టీ జెండా మోసిన కేడర్‌ రగిలిపోయింది.

అసలు తొలి నాలుగు దశల పోలింగ్‌ జరిగే సీట్లకు అభ్యర్థులను ప్రకటించినపుడే 13 నియోజకవర్గాల్లో అసంతృప్తి భగ్గుమంది. ఇవన్నీ బీజేపీకి మంచి ప‌ట్టున్న జిల్లాలే కావ‌డం గ‌మ‌నార్హం. వాటిలో హుగ్లీ, హవ్‌డా, అలీపుర్దార్‌, ఉత్తర, దక్షిణ పరగణాలు, కూచ్‌బెహార్‌ల్లో ఉన్నాయి. 2019 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి ఆధిక్యం వచ్చిన ప్రాంతాలివి. అయితే.. ఇప్ప‌టి వ‌ర‌కు పార్టీని న‌డిపించిన వారిని ప‌క్క‌న పెట్టి కొత్త ముఖాల‌కు అవ‌కాశం క‌ల్పించారు. ఈ ప‌రిణామంతో బీజేపీలో ముస‌లం పుట్టింది. బెంగాల్‌ అంతటా అనేక చోట్ల నిరసన పెల్లుబికింది.

మాల్డా, జల్పాయ్‌గురి, ఉత్తర 24పరగణాలు, డమ్‌ డమ్‌, అస‌న్‌సో‌ల్లో తిరుగుబాట్లు లేచాయి. టైర్లు కాల్చి, ఆఫీసులను ధ్వంసం చేసి, ఫర్నిచర్‌ను తగలబెట్టి కార్యకర్తలు తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు. బీజేపీ మాజీ నేత తపన్‌ సిక్థర్‌ మేనల్లుడు, యువ మోర్చా నేత సౌరవ్‌ సర్కార్‌కు టికెట్‌ నిరాకరించడంతో ఆయన ఆగ్రహంతో అనుచరులతో కలిసి నిరసనగా ర్యాలీ చేశారు. ఆ తరువాత పార్టీకి రాజీనామా చేశారు. ఇక జగ్తాదళ్‌ నుంచి భట్టాచార్య, పాండవేశ్వర్‌ నుంచి జితేంద్ర తివారీలకు అవకాశం ఇవ్వడంపై కూడా కేడర్‌ ఆగ్రహం వ్యక్తం చేసి రోజంతా నిరసనలు, ధర్నాలు చేపట్టింది.

ఉత్తర బెంగాల్‌లో టీఎంసీ నుంచి వచ్చిన మిహిర్‌ గోస్వామికి, తూర్పు దుర్గాపూర్‌లో ఈ మధ్యే బీజేపీలో చేరిన దీప్తాంశు చౌదురికి, రాణిగంజ్‌ లో బైజాన్‌ ముఖర్జీకి, అలీపుర్దార్‌లో కేంద్ర మాజీ ఆర్థిక సలహాదారు అశోక్‌ లాహిరికి టికెట్లివ్వడంపై కార్యకర్తలు అసంతృప్తితో రగిలిపోయారు. ఎక్కడికక్కడ పార్టీ ఆఫీసులను ధ్వంసం చేశారు. దీంతో బీజేపీ త‌న ఎదుగుద‌ల‌కు తానే అడ్డుక‌ట్ట‌లు వేసుకుంటోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఇక‌, అధికార ప‌క్షం తృణ‌మూల్ ఆయా అంశాల‌ను నిశితంగా గ‌మినిస్తూ.. త‌మ‌కు అనుకూలంగా మార్చుకునేందుకు ప్ర‌య‌త్నిస్తోంది.