Begin typing your search above and press return to search.

ఎంత ఎన్నికలైతే మాత్రం.. కేరళకు అలా చేసుడా మోడీ?

By:  Tupaki Desk   |   4 April 2021 2:30 AM GMT
ఎంత ఎన్నికలైతే మాత్రం.. కేరళకు అలా చేసుడా మోడీ?
X
నీతులు చెప్పే వారితో వచ్చే సమస్య.. మాటల వరకు ఓకే కానీ.. చేతల దగ్గరకు వచ్చేసరికే ఇబ్బంది. ప్రధాని మోడీనే తీసుకోండి. ఆయన మాటలు ఎంత తియ్యగా.. మరెంత పెద్దమనిషి తరహాలో.. ఒక ప్రబోధకుడికి ఏ మాత్రం తీసిపోని రీతిలో ఉంటాయి. దీనికి తోడు నెలల తరబడి పెంచిన గడ్డంతో.. యోగిని తలపించేలా ఆయన తయారయ్యారు. ప్రశాంత చిత్తంతో.. ఎలాంటి స్వార్థమన్నది లేనట్లుగా ఆయన మాటలు ఉంటాయి. మాటల్లో ఉన్నంత మాత్రాన చేతల్లో ఉంటుందా? అన్న మాటకు మోడీ భక్తులకు కోపం తన్నుకు రావొచ్చు.

రోజు క్రితం రెండోసారి కేరళలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మోడీ వ్యవహారశైలిని చాలామంది తప్పు పడుతున్నారు. ఇటీవల కాలంలో కరోనా కేసులు పెద్ద ఎత్తున నమోదు కావటం తెలిసిందే. అంతేనా.. దేశ వ్యాప్తంగా కేసుల నమోదు పది రోజుల వ్యవధిలోనే తీవ్ర రూపం దాల్చాయి. ఇలాంటివేళలో.. వేలాది మందితో బహిరంగ సభల్ని నిర్వహించటానికి మించిన తప్పు మరొకటి ఉండదు. మరి.. నీతులు చెప్పే మోడీ మాష్టారు మాత్రం వాటిని పట్టించుకోకుండా.. వేలాది మందితో భారీ సభను ఏర్పాటు చేయటం.. అక్కడ వారందరిని మంత్రముగ్ధుల్ని చేసేలా మాట్లాడటం ఏమిటి? అన్నది ప్రశ్న.

కోవిడ్ వేళలో.. ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుకునేలా సభను నిర్వహించటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మిగిలిన పార్టీలకు భిన్నంగా.. ప్రజా ఆరోగ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత దేశ ప్రధానిగా లేదా? కేరళలో అంత భారీ ఎత్తున సభను నిర్వహించకపోతే జరిగే నష్టం ఏమిటి? అసలే కేరళలో కేసులు ఈ మధ్య వరకు భారీగా నమోదు కావటం.. ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతున్న వేళలో.. ఇలాంటి సభల్ని నిర్వహించాల్సిన అవసరం ఉందా? అన్న సందేహం కలుగక మానదు.
అంతేకాదు.. ప్రముఖ పుణ్యక్షేత్రమైన శబరిమల అయ్యప్ప ఆలయం ఉన్న నేపథ్యంలో.. సభను ప్రారంభించటానికి ముందు స్వామియే శరణమయప్పా అంటూ.. అదే పనిగా ఆయన అనటమే కాదు.. మిగిలిన వారి చేత కూడా అనిపించారు. అయ్యప్ప మీద అంత అభిమానం ఉన్నప్పుడు.. అప్పట్లో అయ్యప్ప ఆలయం మీద కేరళ సర్కారు నిర్ణయం తీసుకున్నప్పుడు మోడీ మౌనంగా ఉండటం ఏమిటి?

అంతేనా.. తమ మనోభావాలకు భిన్నంగా ప్రభుత్వ చర్యల్ని తప్పు పడుతూ.. వేలాది మంది కిలోమీటర్ల కొద్దీ మానవహారంగా నిలిచి.. నిరసన నిర్వహించినప్పుడు కూడా మోడీ సర్కారు స్పందించింది లేదు. అవసరమైనప్పుడు మోడీ నోటి నుంచి వచ్చే ఒక మాట ఎంతో మేలు చేసేది. అప్పుడు మౌనంగా ఉండి.. ఇప్పుడు మాత్రం అందుకు భిన్నంగా నినాదాలు చేయటం వల్ల ఏమైనా ప్రయోజనం ఉంటుందా?