Begin typing your search above and press return to search.

మాల్యానే కాదు.. వాళ్ల తాట కూడా తీయాల్సిందే

By:  Tupaki Desk   |   14 March 2016 10:52 AM GMT
మాల్యానే కాదు.. వాళ్ల తాట కూడా తీయాల్సిందే
X
లిక్క‌ర్‌ కింగ్ విజ‌య్ మాల్యా మీద దేశ వ్యాప్తంగా ఆగ్ర‌హం వ్య‌క్త‌మ‌వుతోన్న సంగ‌తి తెలిసిందే. బ్యాంకుల‌కు రూ.9వేల కోట్లు ఎగ్గొట్టి .. దేశం నుంచి గుట్టుచ‌ప్పుడు కాకుండా వెళ్లిపోయిన ఆయ‌న తీరుపై స‌ర్వ‌త్రా విమ‌ర్శ‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ప్ర‌భుత్వ తోడ్పాటు కానీ లేకుంటే.. మాల్యా లాంటి వ్య‌క్తి దేశ స‌రిహ‌ద్దులు దాట‌టం సాధ్య‌మా అన్న‌ది ఒక ప్ర‌శ్న‌. లుక్ అవుట్ నోటీసులు ఉన్న వ్య‌క్తి ద‌ర్జాగా విదేశాల‌కు వెళ్లిపోయిన తీరుపై ఇప్పుడు విమ‌ర్శ‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఇలా.. వాళ్లు.. వీళ్లు అన్న తేడా లేకుండా మాల్యా తీరుపై విమ‌ర్శ‌లు చేస్తుంటే.. మ‌రో కొత్త వాద‌న తెర‌పైకి వ‌చ్చింది.

అంద‌రి దృష్టి మాల్యా మీద‌నే ఉంది కానీ.. ఎయిర్ ఇండియాను రూ.30వేల కోట్ల న‌ష్టాల్లోకి తీసుకెళ్లిన ఘ‌నుల మీద ఎవ‌రూ మాట్లాడ‌క‌పోవ‌టంపై ప‌లువురు విమ‌ర్శ‌లు చేస్తున్నారు. ప్ర‌భుత్వ‌ విమాన‌యాన రంగాన్ని భారీగా న‌ష్టాల బాట ప‌ట్టించిన పెద్ద మ‌నుషుల లెక్కేమిట‌న్న‌ది ప్ర‌శ్న‌. ఎయిరిండియా న‌ష్ట‌పోయిన రూ.30వేల కోట్ల మొత్తం కూడా దేశ ప్ర‌జ‌లు చెల్లించిన ప‌న్ను మొత్త‌మ‌న్న విష‌యాన్ని మ‌ర్చిపోకూడ‌దు.

అప్పు తీసుకొని.. వాటిని చెల్లించ‌క‌పోవ‌టం ఎలా అయితే నేరం అవుతుందో.. నిర్ల‌క్ష్యంతో.. త‌ప్పుడు నిర్ణ‌యాల‌తో వేలాది కోట్ల రూపాయిలు న‌ష్టం మూట‌గ‌ట్టేలా నిర్ణ‌యాలు తీసుకున్న వారిపై చ‌ర్య‌లు తీసుకోవ‌టం ద్వారా.. మ‌ళ్లీ అలాంటి త‌ప్పులు దొర్ల‌కుండా ఒళ్లు ద‌గ్గ‌ర పెట్టుకొని ప‌ని చేసే ప‌రిస్థితి రావాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంది. అప్పులు తీసుకొని ఎగ్గొట్టే వారిపైన చ‌ర్య‌లు తీసుకోవ‌టానికే దిక్కు లేని ప‌రిస్థితులు ఉంటే.. నిర్ల‌క్ష్యంతో వేలాది కోట్ల రూపాయిలు న‌ష్టం వాటిల్లే వారిపై చ‌ర్య‌లు తీసుకునే అవ‌కాశం ఉందా? అన్న‌ది పెద్ద ప్ర‌శ్న‌.