Begin typing your search above and press return to search.

పీవీపీని జగన్ ఎందుకు పట్టించుకోవడం లేదు?

By:  Tupaki Desk   |   26 Feb 2020 3:30 PM GMT
పీవీపీని జగన్ ఎందుకు పట్టించుకోవడం లేదు?
X
పదవులుంటేనే పరపతి.. అధికారం ఉంటేనే రాజకీయ నాయకుడికి గుర్తింపు.. పదవి లేని నాయకుడిని భర్త లేని విధవరాలిగా రాజకీయాల్లో పోలుస్తారు. ఆమె బయట తిరగలేదు.. రాజకీయ నేతలు అదే పరిస్థితిని ఎదుర్కొంటారు. తెలంగాణ తొలి ప్రభుత్వంలో కీలక మంత్రులుగా, కేసీఆర్ వ్యవహారాల్లో చురుకుగా వ్యవహరించి వెలుగువెలిగిన తుమ్మల, జూపల్లి ఓడిపోయి ఇప్పుడు ఉనికిలోనే లేకుండా పోయారు. పదవుల్లో లేని నేతలను ఈ సమాజం పట్టించుకోదన్నది వాస్తవం.

ఇప్పుడు ఏపీలోనూ ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొంటున్నారు పీవీపీ. ఈ బడా సినీనిర్మాత/పారిశ్రామికవేత్త ఏపీ సార్వత్రిక ఎన్నికల వేళ జగన్ చేతుల మీదుగా వైసీపీ కండువా కప్పుకొని విజయవాడ నుంచి పోటీచేశారు. రాష్ట్రమంతా వైసీపీ గెలిచినా పాపం ఈయన మాత్రం దురదృష్టం వెంటాడి వందల ఓట్ల తేడాతోనే ఓడిపోయారు. అయితే వైసీపీ మాత్రం అధికారంలోకి వచ్చింది. ఈయన అధికార పార్టీ నేతగా హల్ చల్ చేసే వీలున్నా బయటకు రావడం లేదు. ట్విట్టర్ గూట్లోనే ఏపీ పాలిటిక్స్ పై స్పందిస్తూ ప్రత్యర్థులను దుమ్మెత్తిపోస్తూ కాలం గడుపుతున్నారు.

అయితే పార్ట్ టైం పాలిటిక్స్ కు సీఎం జగన్ దూరంగా ఉంటారు. క్షేత్రస్థాయిలో ఉండి తనతోపాటు రాజకీయం చేసేవారినే అందలమెక్కిస్తారు. ఎన్నికల ముందు ఎంతోమంది వైసీపీ కండువా కప్పుకున్నా ఆది నుంచి తనతోపాటు ఉన్న ఫృథ్వీ, విజయ్ చందర్ లకే జగన్ నామినేటెడ్ పదవులు ఇచ్చారు. మోహన్ బాబు, అలీ, జీవితా రాజశేఖర్ సహా చాలామందికి ఇవ్వలేదు.

ఇప్పుడు ఎన్నికల ముందరే పార్టీలో చేరిన పీవీపీ కూడా ఓడిపోయాక విజయవాడ ముఖం చూడడం లేదు. క్షేత్రస్థాయిలో ఉండి పార్టీ కోసం కష్టపడితే వచ్చేసారైనా గెలవగలడు. కానీ ఆయన సినిమాలు, వ్యాపారాలతో హైదరాబాద్ కే పరిమితం అయ్యాడు. పీవీపీ ప్రజలకు, పార్టీకి దూరంగా ఉండడంతో సహజంగానే సీఎం జగన్ కూడా ఆయనను దూరం పెట్టారన్న చర్చ సాగుతోంది.

ఇక పీవీపీ కూడా ఎంతసేపు ట్విట్టర్ గూట్లోనే పలకడం తప్పితే ప్రజల్లోకి వచ్చి వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నది లేదు. రాజకీయనేతగా ప్రజల్లో ఉన్నప్పుడే గెలుపు సాధ్యం.. జగన్ సహా వైసీపీ నేతలు కొత్త కావడం.. ఎన్నికల ముందే పార్టీలో చేరడం.. పెద్దగా ఎవరూ పరిచయం లేక పోవడంతో పీవీపీ కూడా దూరంగా ఉంటున్నారు. అసలు విజయవాడలో పీవీపీని పాల్గొనమని పిలిచే నాథుడే వైసీపీలో లేడంటే అతిశయోక్తి కాదేమో.. ఈ క్రమంలోనే ఆయన దూరంగా ఉంటున్నారు.. వైసీసీ అధిష్టానం కూడా పట్టించుకోవడం లేదు. ఇలా పీవీపీ విషయంలో ఆయన తప్పు.. పార్టీ అధిష్టానం పట్టించుకోక పోవడంతో క్రమంగా కనుమరుగైపోతున్నారు. ఇలానే ఉంటే వచ్చేసారి పీవీపీకి టికెట్ కూడా కష్టమేనన్న చర్చ సాగుతోంది.