Begin typing your search above and press return to search.

గ్రామాల విలీనంపై షర్మిల ఎందుకు మాట్లాడడం లేదు?

By:  Tupaki Desk   |   20 July 2022 2:30 PM GMT
గ్రామాల విలీనంపై షర్మిల ఎందుకు మాట్లాడడం లేదు?
X
తెలంగాణలో రాజకీయం మొదలుపెట్టిన వైఎస్ షర్మిల దూకుడుగా ముందుకెళుతున్నారు. అధికార టీఆర్ఎస్ ను టార్గెట్ చేసి రాజకీయం చేస్తున్నారు. ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీలను వదలడం లేదు. ముఖ్యంగా నిరుద్యోగుల సమస్యలు, ఉద్యోగాల కల్పనపై దీక్షలు, ఆందోళనలు చేస్తూ అధికార పార్టీ కంట్లో నలుసులా మారాయి.

ఆంధ్రా ఆడకూతురు.. తెలంగాణ మెట్టినింటి కోడలు మారి రాజకీయం చేసినా ఆమె ఆంధ్రా వాసనలు మాత్రం పోవడం లేదు. షర్మిల ఆంధ్రా నేపథ్యాన్నే తెలంగాణ పార్టీలు ఆయుధంగా మలుచుకుంటున్నాయి. అప్పట్లో మంత్రి కేటీఆర్, సీఎం కేసీఆర్ వ్యూహాత్మకంగా ఏపీ, తెలంగాణ మధ్య కృష్ణ జలాలను తెరపైకి తీసుకొచ్చారు. ఆంధ్రా ఆడకూతురు అయిన షర్మిల ఈ విషయంలో ఇరుకునపడిపోయారు. స్పందించాల్సిన పరిస్థితి రావడంతో తెలంగాణకే జై కొట్టారు.ఇక్కడి కోడలుగా.. 'ఏపీకి ఒక్క చుక్క నీటిని' వదులుకోం అని స్పష్టం చేశారు. మనసులో ఎంత ఆంధ్రా అభిమానం ఉన్నా కూడా ఇప్పుడు తెలంగాణలో రాజకీయం కోసం షర్మిల కూడా ఇటువైపు మొగ్గాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి.

ఇప్పుడు ఏపీ, తెలంగాణ మధ్య మరో పంచాయితీ వచ్చింది. ఈ సున్నితమైన ఇష్యూ.. పైగా ఖమ్మంలోని పాలేరులో పోటీకి దిగుతున్న షర్మిలను ఇరుకునపడేలా చేసింది. ఆంధ్రా, తెలంగాణ మధ్యన ఉండే ఇష్యూ ఇప్పుడు షర్మిలను చాలా కలవరపెడుతోందట.. ఖమ్మం జిల్లా దగ్గర ఉండే గ్రామాల విలీనం పై షర్మిల ఎందుకు మాట్లాడడం లేదని ప్రత్యర్థులు విమర్శిస్తున్నారు. 5 గ్రామాలపై ఎందుకు షర్మిల మాట్లాడడం లేదు అని తెలంగాణ ప్రజల తరుఫున ఖమ్మం జిల్లా వాళ్లు అడుగుతున్నారు..

దొర దొర అని కేసీఆర్ ని.. కేటీఆర్ ను టార్గెట్ చేస్తున్న షర్మిల.. ఎందుకు మాట్లాడడం లేదు అని చర్చ జరుగుతోంది.. తెలంగాణ రాష్ట్రానికి చెందిన పార్టీలు, నేతలు అంతా తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలకే పాటుపడుతుంటే.. ఆంధ్రా నుంచి వచ్చిన షర్మిలకు ఇప్పుడు అదేపెద్ద అడ్డంకిగా మారింది.

తెలంగాణ ప్రజల ఆత్మాభిమానం ఆత్మీయంగా ఉంటుంది. నచ్చితే నెత్తిన పెట్టుకుంటారు. నచ్చకపోతే పాతరేస్తారు. వారికి ఏదైనా ఎక్కువే అంటారు. ఇక్కడి నీళ్లు, నిధులు, నియామకాల కోసం దశాబ్ధాలుగా ఆంధ్రా నేతలతో పోరాడి చివరకు రాష్ట్రాన్ని సాధించుకున్నారు. ఈ క్రమంలోనే అభివృద్ధి , ఉద్యోగాల్లో చాలా వివక్షకు గురయ్యారు. అందుకే ఆంధ్రా నేతల వాసననే ఇక్కడి ప్రజలు గిట్టడం లేదు. సహించడం లేదని పోయిన ఎన్నికల్లో రుజువైంది.గత అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబుతో జట్టు కట్టిన పాపానికి ప్రతిపక్ష కాంగ్రెస్ ను సైతం ఓడించారు. అంటే తెలంగాణ ప్రజలు ఇక్కడి పార్టీలకే పట్టం కడుతారని తేటతెల్లమైంది. అయినా ఆంధ్రుల ఆశ చావడం లేదు.

తెలంగాణ ఇంటి కోడలుగా మారిన ఏపీ సీఎం జగన్ చెల్లెలు షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టేశారు. 'రాజన్న రాజ్యం' తెస్తానంటూ ఆంధ్రా నేత పాలన వైభవాన్ని కొనియాడారు. సీఎం కేసీఆర్ ను టార్గెట్ చేశారు, ఉద్యోగాలు ఇవ్వని సర్కార్ పై పోరాడుతున్నారు. కానీ తెలంగాణ ఈ వర్షాలతో మునిగిపోతున్నా.. ఏపీ ప్రాజెక్ట్ వల్ల భద్రాద్రి మునిగినా.. గ్రామాలన్నీ నీటితో నిండిపోయినా షర్మిల స్పందించకపోవడం వివాదాస్పదమైంది.

షర్మిల ఆంధ్రా ప్రయోజనాల కోసం పాటుపడుతున్నారని.. ఆంధ్రా ప్రాజెక్ట్ వల్ల తెలంగాణ గ్రామాలు మునిగినా పట్టించుకోవడం లేదని విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికైనా ఏపీలోకి గ్రామాల విలీనంపై షర్మిల ఎందుకు మాట్లాడడం లేదు అని ప్రశ్నిస్తున్నారు. తెలంగాణ ప్రయోజనాల కోసమే మాట్లాడాలని హితవు పలుకుతున్నారు.