Begin typing your search above and press return to search.

అమెరికాను మంచు ఎందుకు ముంచుతోంది? కారణమేంటి? భారీగా మరణాలు

By:  Tupaki Desk   |   26 Dec 2022 5:10 AM GMT
అమెరికాను మంచు ఎందుకు ముంచుతోంది?  కారణమేంటి? భారీగా మరణాలు
X
క్రిస్మస్ పండుగ వేళ.. అమెరికాను మంచు కప్పేస్తోంది. ఎడతెరిపి లేకుండా మంచు కురుస్తుండడంతో బయటకు రాలేని పరిస్థితి దాపురించింది. రోడ్డు పక్కన ఉన్న వాహనాలు మంచులో కూరుకుపోయాయి. దీంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని అమెరికన్ వాసులు భిక్కుభిక్కుముంటూ గడుపుతున్నారు. మంచు తుఫాను కారణంగా తూర్పు అమెరికాలో ఇప్పటికే 31 మంది మరణించారు. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. మంచు తీవ్రంగా ఉండడం వల్ల చాలా మంది క్రిస్మస్ వేడుకలు జరుపుకోలేదు. చాలా చోట్ల విద్యుత్ సంక్షోభం ఏర్పడి చీకట్లోనే గడుపుతున్నారు. దాదాపు మరో రెండు రోజుల వరకు విద్యుత్ పునరుద్ధరణ జరిగే అవకాశం లేదని అంటున్నారు.

మంచు కారణంగా ప్రయాణాలు దాదాపు నిలిచిపోయాయి. ఈ ప్రభావం విమానాలపై తీవ్ర ప్రభావం చూపింది. ఆదివారం ఒక్కరోజే 2400 విమానాలు ఎక్కడికక్కడే నిలిచాయి. దీంతో ఇతర ప్రదేశాలకు వెళ్లాల్సిన వారు విమానాశ్రయాల్లోనే ఉండిపోయారు. అట్లాంటా, చికాగో, డెన్వర్, టెట్రాయిట్, న్యూయార్క్ విమానాశ్రయాల్లో ఈ పరిస్థితి మరింత దారుణంగా ఉంది. హాలీడే సీజన్ ట్రిప్ కోసం ప్లాన్ చేసుకున్నవారు నిరాశ చెందుతున్నారు. ఇంకొన్ని రోజులు ఇదే పరిస్థితి ఉంటుందన్ని అమెరికన్ వాతావరణ అధికారులు పేర్కొంటున్నారు.

గాలిలో ఉండే ఉష్ణోగ్రత ఆధారంగా మంచు ఏర్పడుతుంది. శీతాకాలంలో మేఘాల్లో ఉండే నీరు మంచు ముక్కలుగా మారుతాయి. ఇవి 0.1 మిల్లి మీటర్ కంటే ఎక్కువ వ్యాసం కలిగిన మైక్రోస్కోపిక్ స్పటికాలు. ఇవి గాలి ప్రవాహాన్ని తట్టుకోలేక కిందకు పడుతూ ఉంటాయి. ఇలా చిన్న చిన్న స్పటికాలు తుఫానుల మారి ఆయా ప్రదేశాలు కప్పబడుతాయి. యూరప్ కంట్రీల్లో ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా అమెరికా, కెనడా లాంటి దేశాల్లో ఉష్ణోగ్రతలు విపరీతంగా పడిపోతాయి. దీంతో ఇక్కడ మంచు తుఫానులు సంభవిస్తాయి.

ప్రస్తుతం అమెరికాలో యూఎస్ నేషనల్ వెదర్ సర్వీస్ రిపోర్టు ప్రకారం.. ఉష్ణోగ్రతలు మైనస్ 20 డిగ్రీల నుంచి మైనస్ 48 డిగ్రీలకు పడిపోయాయి. న్యూయార్క్ స్టేట్ లోని బఫెలో సిటీలో రికార్డు స్థాయిలో ఒక్కరోజులో 22.3 ఇంచుల మంచు కురిసింది. ఈ ధాటికి తట్టుకోలేక 15 మంది చనిపోయారు. దాదాపు 20 కోట్ల మంది ఈ మంచు ప్రభావంతో బాధపడుతున్నారు. ఇక మంచు కురవడం ఒకవైపైతే.. మరోవైపు భీకర గాలులు కొనసాగుతున్నాయి. వీటినే 'బాంబ్ సైక్లోన్' అంటారు.

ప్రస్తుతం కెనడాలోని టోరంటోకు చెందిన మెటియోరాలిజిస్ట్ కెల్సీ మెక్ ఎవెన్ ట్వీట్ చేస్తూ... బాంబో సైక్లోన్ వల్ల ఇరీలో 8 మీటర్ల మేరకు వేవ్స్ వస్తున్నాయన్నారు. ఓహియోలోని ఫైర్ పోర్ట్ హార్బర్ వద్ద గంటకు 120 కిలోమీటర్ల స్పీడుతో గాలులు వీస్తున్నాయని తెలిపారు. ఇక కెంటకీ స్టేట్ లో పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారింది. రాత్రికి రాత్రే మైనస్ 48 డిగ్రీలుగా మారిపోయింది. చాలా ప్రాంతాల్లో పైపుల్లోనీ నీరు గడ్డ కట్టుకుపోయిందని నేషనల్ వెదర్ సర్వీస్ అధికారి రిచ్ మలియావ్ కో తెలిపారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.