Begin typing your search above and press return to search.

ఇప్పటం గ్రామస్తులపై హైకోర్టు ఎందుకు సీరియస్ అయ్యింది?

By:  Tupaki Desk   |   14 Dec 2022 3:30 PM GMT
ఇప్పటం గ్రామస్తులపై హైకోర్టు ఎందుకు సీరియస్ అయ్యింది?
X
రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన ‘ఇప్పటం’ గ్రామ ఇష్యూ గురించి తెలిసిందే. రహదారుల విస్తరణ అంశంలో ఏపీలోని జగన్ సర్కారు సరైన నోటీసులు ఇవ్వకుండా పలువురు ఆస్తుల్ని కూల్చివేస్తున్నట్లుగా పేర్కొంటూ హైకోర్టును ఆశ్రయించటం తెలిసిందే. ఈ నేపథ్యంలో చోటు చేసుకున్న పరిణామాలు సినిమాటిక్ గా ఉన్నాయి. తాజాగా గ్రామస్తులు దాఖలు చేసిన పిటిషన్ ను డిస్మిస్ చేస్తూ ఏపీ హైకోర్టు మరోసారి వారికి షాకిచ్చింది. ఇంతకూ వారు ఏ అంశం మీద పిటిషన్ దాఖలు చేశారన్న విషయంలోకి వెళితే..

రోడ్ల విస్తరణ పేరుతో తమ ఇళ్లు.. ప్రహరీ గోడలను కూల్చివేస్తున్నారని.. అధికారుల్ని నిలువరించాలని కోరుతూ ఇప్పటం గ్రామానికి చెందిన వెంకటనారాయణతో పాటు మరో పదమూడు మంది గత నెల నాలుగున హైకోర్టులో అత్యవసర పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన జడ్జి.. తొందరపాటు చర్యలు వద్దని.. కూల్చివేతలను అడ్డుకునేలా ఏపీ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చారు.

ఇదిలాఉంటే.. ఈ మధ్యన సదరు కేసు విచారణకు వచ్చింది. అయితే.. ఈ సందర్భంగా కొత్త విషయాలు బయటకు వచ్చాయి. అందులో ముఖ్యమైనది.. గతంలో హైకోర్టును ఆశ్రయించిన పిటిషన్ దారులందరికి నోటీసులు ఇచ్చినట్లుగా ఏపీ ప్రభుత్వం తరఫున న్యాయవాది పేర్కొన్నారు.
ఎందుకలా? అన్న విషయంలోకి వెళితే.. కూల్చివేతలకు ముందు వారంతా అధికారుల నుంచి షోకాజ్ నోటీసులు అందుకున్న విసయాన్ని కోర్టుకు దాఖలు చేసిన అఫిడవిట్ లో పేర్కొనని అంశాన్ని పేర్కొన్నారు. దీంతో.. హైకోర్టుకు దాఖలు చేసిన అఫిడవిట్ లో ఆయా అంశాల్ని ఎందుకు ప్రస్తావించలేదంటూ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇప్పటం గ్రామస్తుల తరఫున కేసును నమోదు చేసిన న్యాయవాదిని ప్రశ్నించారు. ఉదయాన్నే కూల్చివేతలు మొదలు పెడితే.. హడావుడిగా లంచ్ మోషన్ రూపంలో కోర్టులో కేసు దాఖలు చేయటంతో న్యాయస్థానం రియాక్టు అయి.. ఇప్పటం గ్రామస్తుల తరఫున పిటిషన్ దాఖలు చేసిన 13 మందికి లక్ష చొప్పున ఫైన్ వేసింది.

దీంతో.. హైకోర్టు జడ్జి వేసిన ఫైన్ ను సవాల్ చేస్తూ తాజాగా మరోసారి హైకోర్టును ఆశ్రయించారు. ఈ సందర్భంగా కేసు వివరాల్ని తెలుసుకున్న న్యాయస్థానం.. ఇప్పటం గ్రామస్తుల తరఫున దాఖలైన వ్యాజ్యాన్ని డిస్మిస్ చేస్తూ మరోసారి షాకిచ్చిన పనైంది. ఈ నేపథ్యంలో ఇప్పటం గ్రామస్థులు ఎలా రియాక్టు అవుతారో చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.