Begin typing your search above and press return to search.

పెట్రో బాదుడ్ని ఆప‌లేమ‌ని తేల్చిన మోడీ స‌ర్కార్

By:  Tupaki Desk   |   5 Sep 2018 5:55 AM GMT
పెట్రో బాదుడ్ని ఆప‌లేమ‌ని తేల్చిన మోడీ స‌ర్కార్
X
పెట్రోల్ బంక‌కు వెళ్లి.. వంద కొట్టు.. లేదంటే రెండు వంద‌లకు కొట్టేయ్ అని అడ‌గ‌టం.. మీట‌ర్లో కోరుకున్న మొత్తం వ‌చ్చిందా? లేదా? అని చూసుకొని వెళ్లిపోతున్న ప‌రిస్థితి అంత‌కంత‌కూ పెరుగుతోంది. భారీగా ధ‌ర‌లు పెరిగిన త‌ర్వాత కూడా ధ‌ర‌ల త‌గ్గింపు కోసం పోరాడ‌రా? అంటే.. పోరాడితే మాత్రం ప్ర‌భుత్వం అనుకున్న‌ది త‌గ్గిస్తుందా? అంటూ ఎదురు ప్ర‌శ్న‌లు వేస్తున్న ప‌రిస్తితి.

ఇదిలా ఉంటే.. రోజురోజుకీ పెరుగుతున్న పెట్రోల్‌.. డీజిల్ ధ‌ర‌ల్ని కాస్త తగ్గేలా.. ప్ర‌భుత్వ ఆదాయానికి కోత ప‌డే రీతిలో పెట్రో ధ‌ర‌ల్ని ఉంచాల‌న్న ప్ర‌తిపాద‌న‌పై మోడీ స‌ర్కారు సానుకూలంగా లేద‌న్న మాట బ‌లంగా వినిపిస్తోంది. ఇవాల్టి రోజున (హైద‌రాబాద్ లో) లీట‌రు పెట్రోల్ రూ.84.09 కాగా.. లీట‌రు డీజిల్ ధ‌ర రూ.77.60గా ఉంది. ఒక‌ర‌కంగా చూస్తే.. ఈ ధ‌ర‌లు గ‌రిష్ఠ‌మ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. అంత‌ర్జాతీయంగా బ్యారెల్ ముడిచ‌మురు ధ‌ర‌లు 80 డాల‌ర్ల కంటే త‌క్కువగా ఉన్న వేళ‌.. ధ‌ర‌లు ఇంత భారీగా పెర‌గ‌టానికి కార‌ణం ఏమిటి? పెట్రో మంట‌తో బ‌డ్జెట్ లు త‌ల‌కిందులుగా మారుతున్న ప‌రిస్థితి. దీనిపై దేశ వ్యాప్తంగా ఆగ్ర‌హం వ్య‌క్త‌మ‌వుతోంది. కానీ.. మోడీ స‌ర్కారు మాత్రం ధ‌ర‌ల్ని త‌గ్గించే విష‌యంలో వెన‌క్కి త‌గ్గ‌ని ప‌రిస్థితి నెల‌కొంది. పెట్రో ధ‌ర‌లు త‌గ్గించ‌మంటే ఆర్థిక క్ర‌మ‌శిక్ష‌ణ అవ‌స‌ర‌మ‌ని.. డాల‌ర్ల దూకుడు ఎక్కువ‌గా ఉండి.. రూపాయి విలువ ప‌డిపోతున్న క్ర‌మంలో ఇలాంటి ప‌రిస్థితి ఉంద‌ని చెబుతున్నారు.

స‌గ‌టు జీవికి పెట్రో ధ‌రాభారం నుంచి కాస్తంత ఉప‌శ‌మ‌నం ఇవ్వాల్సిన స‌ర్కారు అందుకు భిన్నంగా ఆ ప‌న్ను.. ఈ ప‌న్ను పేరుతో ఎడాపెడా వాయించేయ‌టంతో ధ‌ర‌లు భారీగా మారి ప్ర‌జ‌ల‌కు కొత్త క‌ష్టాల్ని తెస్తున్నాయి.

లీట‌రు పెట్రోల్‌ కానీ డీజిల్ కానీ కొనుగోలు చేస్తే.. ప్ర‌జ‌లు చెల్లించే మొత్తంలో దాదాపు స‌గానికంటే ఎక్కువ‌గా వివిధ ర‌కాల ప‌న్నుల్ని విధిస్తున్న వైనం క‌నిపిస్తుంది.

పెట్రో ధ‌ర‌ల్లో ప‌న్నుల లెక్క చూస్తే.. ప్ర‌జ‌ల మీద కేంద్ర రాష్ట్ర ప్ర‌భుత్వాలు ఎంత భారం మోపుతున్నాయో ఇట్టే అర్థ‌మవుతుంది.

+ పెట్రోల్ పై కేంద్రం విధించే ఎక్సైజ్ సుంకం లీట‌రుకు ఏకంగా రూ.19.48

+ డీజిల్ పై కేంద్రం విధించే ఎక్సైజ్ సుంకం లీట‌రుకు ఏకంగా రూ.15.33

+ వీటికి రాష్ట్రాలు విధించే వ్యాట్ అద‌నంగా ఉంటోంది.

+ 2014 న‌వంబ‌రు నుంచి 2016 జ‌న‌వ‌రి మ‌ధ్య‌న 9 వాయిదాల్లో ఎక్సైజ్ సుంకాన్ని కేంద్రం పెంచింది

+ ఈ భారం పెట్రోల్ మీద రూ.11.77 ఉంటే డీజిల్ మీద రూ.13.47 ఉంది.

+ పెట్రోల్ డీజిల్ మీద రాష్ట్రాలు విధించే వ్యాట్ పోటు భారీగా ఉంటోంది. ఉదాహ‌ర‌ణ‌కు మ‌హ‌రాష్ట్ర స‌ర్కారు పెట్రోల్ మీద గ‌రిష్ఠంగా 39.12 శాతం వ్యాట్ ను విధిస్తుంటే.. డీజిల్ పై ప‌న్ను పోటును గ‌రిష్ఠంగా అమ‌లు చేస్తున్న రాష్ట్రం తెలంగాణ గా చెప్పాలి. తెలంగాణ‌లో డీజిల్ మీద 26 శాతం వ్యాట్ పోటును రాష్ట్ర స‌ర్కారు విధిస్తోంది. ఇలా కేంద్ర‌.. రాష్ట్ర ప్ర‌భుత్వాలు అదే ప‌నిగా ప‌న్ను బాదుడు పుణ్య‌మా అని.. ధ‌ర‌లు అంత‌కంత‌కూ పెరిగిపోతున్న ప‌రిస్థితి.