Begin typing your search above and press return to search.

ఆ అమ్మాయి కోరుకున్న వరుడి ప్రొఫైల్ ఎందుకంత వైరల్?

By:  Tupaki Desk   |   20 Oct 2022 4:25 AM GMT
ఆ అమ్మాయి కోరుకున్న వరుడి ప్రొఫైల్ ఎందుకంత వైరల్?
X
పెళ్లి అంటే పాప్ కార్న్ తిన్నంత ఈజీ కాదు. ఒకసారి కమిట్ అయితే జీవితాంతం వారితో కలిసి ఉండాలి. ఇప్పుడున్న కాలంలో అలాంటిదెక్కడ ఉందన్న సందేహం కొందరికి రావొచ్చు. ఒకవేళ ఆ లెక్కన చూసినా కనీసం కొన్నేళ్లు అయినా కలిసి ఉండాల్సిందే. నచ్చిన డ్రెస్సు కోసం తెగ వెతికేసే వాళ్లు.. జీవిత భాగస్వామి విషయంలో అంత త్వరగా రాజీ పడరు. అదేమీ తప్పు కాదు కూడా. అయితే.. తాజాగా ఒక అమ్మాయి తన మ్యాట్రిమోనియల్ సైట్లో తనకు కావాల్సిన వరుడు గురించిన వివరాల్ని పేర్కొన్న వైనం.. దాన్ని స్క్రీన్ షాట్ గా తీసిన పెద్ద మనిషి ఒకరు ట్విటర్ లో పోస్టు చేయటంతో అది కాస్తా వైరల్ గా మారింది.

ఆమె ప్రొఫైల్ మీద బోలెడన్ని కామెంట్లు వస్తున్నాయి. దీనికి కారణం.. ఆమె కోరుకున్న వరుడి ప్రొఫైల్ అంత భారీగా ఉండటమే. కోరుకునే వాడిలో ఉండాల్సిన లక్షణాల గురించి వధువు కోరికల్ని చూసిన మగాళ్లు చాలామంది హైరానా పడుతుంటే.. కొందరు అమ్మాయిలు స్పందిస్తూ.. సదరు వధువు అలాంటి కోరికల్ని ఎందుకు కోరి ఉంటుందో విశ్లేషిస్తున్న వైనం ఆసక్తికరంగా మారింది. మొత్తంగా సోషల్ మీడియాలో పలువురిని ఆకర్షిస్తున్న ఈ పోస్టును చూసిన పెళ్లి కాని ప్రసాదుల పరిస్థితి ఆగమాగం అన్నట్లుగా మారింది. అమ్మడి కోరికల చిట్టా చూసినోళ్లంతా నోరెళ్లబెడుతున్నారు.

ఈ అమ్మాయికి వరుడు 1992 జూన్ తర్వాతే పుట్టి ఉండాలట.. డిగ్రీ.. ఇంజనీరింగ్.. ఎంబీఏ లాంటి విద్యార్హత ఏమి ఉన్నా ఫర్లేదు కానీ.. ఆయా కోర్సులు చేసిన వారు ఏ కాలేజీలో చదివి ఉండాలన్న దానిపై నిశ్చిత అభిప్రాయం ఉంది. అందుకే.. ఇంజనీరింగ్ అయితే ఏయే కాలేజీలో.. ఎంబీఏ అయితే ఏ కళాశాలలో చదివి ఉండాలో కూడా ఆమె స్పష్టంగా పేర్కొన్నారు. ఇక.. ఆ కాలేజీల్ని చూస్తే.. దేశంలోనే అగ్ర విద్యా సంస్థలు అదేనండి ఐఐటీల్లో.. బిట్స్ పిలానీ లాంటి రేంజ్ ఉన్న కాలేజీల్లోనే చదివి ఉండాలని స్పష్టం చేసింది. వరుడు ఢిల్లీ.. చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న వారికే ప్రాధాన్యతను ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు.

జీతం ఏడాదికి రూ.30 లక్షలు తగ్గకుండా ఉండాలని.. కార్పొరేట్ సెక్టార్ లోనే పని చేస్తుండాలన్న కండీషన్ తో పాటు.. వరుడి కుటుంబం చిన్నదిగా ఉండాలని.. ఇద్దరు తోబుట్టువులకు మించి ఉండకూదన్న కండీషన్ ను పెట్టేసింది. బాగా చదువుకున్న కుటుంబానికే ప్రాధాన్యత ఇస్తామన్న ఆమె.. 5.7 నుంచి 6 అడుగులకు తగ్గని వారు మాత్రమే అర్హులని కూడా తేల్చేసింది. ఈ యువతి డిమాండ్లను చూసిన నెటిజన్లు పలువురు ఆమెను తప్పు పడితే.. మరికొందరు మాత్రం సమర్థిస్తున్నారు. ఎలాంటి వరుడు కావాలో కోరుకునే స్వేచ్ఛ లేకుంటే ఎలా? అని ప్రశ్నిస్తున్నారు.

ఈ పోస్టుకు స్పందించిన ఒక యువతి ఆసక్తికరమైన కామెంట్ చేసింది. అల్రెడీ ఆ అమ్మాయికి బాయ్ ఫ్రెండ్ ఉండి ఉంటాడని.. అతడికున్న అన్ని లక్షణాల్నే ఆమె చెప్పి ఉంటుందని.. ఆమెకు మరెవరూ సూట్ కాదని.. ఆమె కోరుకున్నట్లుగా అబ్బాయి దొరకడు కాబట్టి.. తన బాయ్ ఫ్రెండ్ ను త్వరలో పరిచయం చేసే అవకాశం ఉందని పేర్కొంది. ఈ పోస్టుకు పలువురు మద్దతు ఇచ్చారు.

మరికొందరు కాస్తంత ఘాటుగా రియాక్టు అవుతూ.. ఆమెకు కావాల్సింది అబ్బాయి కాదు బ్యాంక్ అని పేర్కొంటే.. మరికొందరు ఆమె పెళ్లి చేసుకుంటుందా? లేదా భర్తను అద్దెకు తీసుకుంటుందా? అని మండిపడ్డారు. మొత్తంగా ఆ అమ్మాయి కోరికల చిట్టా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అందరిని ఆకర్షిస్తోంది. ఆ అమ్మాయి తర్వాతి పోస్టులో అయినా.. ఆమెకు కోరుకున్న వాడు దొరికాడో లేడో కాస్తంత క్లారిటీ ఇస్తే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.