Begin typing your search above and press return to search.

మాట జారటం ఎందుకు.. అన్నేసి మాటలు అనిపించుకోవటమా లోకేశ్

By:  Tupaki Desk   |   20 Jun 2021 9:25 AM GMT
మాట జారటం ఎందుకు.. అన్నేసి మాటలు అనిపించుకోవటమా లోకేశ్
X
గతానికి భిన్నమైన రాజకీయం రెండు తెలుగు రాష్ట్రాల్లో నెలకొంది. పదేళ్ల క్రితం వరకు దూకుడు రాజకీయాలే ఉండేవి. గడిచిన ఐదేళ్లలో వచ్చిన మార్పుతో అంతకు మించి అన్నట్లుగా పరిస్థితులు మారిపోయాయి. చిన్నమాటకే చెలరేగిపోతున్నారు. అవకాశం చిక్కితే చాలు చెలరేగిపోతున్నారు. ఇలాంటప్పుడు ఆచితూచి అన్నట్లు ఉండాలి. ఎందుకంటే.. చిన్న తప్పు దొర్లినా జరిగే నష్టం ఎక్కువగా ఉంటుంది. తాజాగా టీడీపీ ఎమ్మెల్సీ లోకేశ్ నోటి నుంచి వచ్చిన మాట.. అధికారపక్ష నేతలకు మండిపడేలా చేసింది. అంతే ఒక్కొక్కరిగా నోటికి పని చెప్పటం మొదలు పెట్టారు. లోకేశ్ ను తలెత్తుకోలేనంతగా తిట్ట వర్షంతో కడిగిపారేస్తున్నారు.

రాయలసీమలోని ఫ్యాక్షన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పార్టీలకు అతీతంగా వ్యక్తిగత కక్షల కారణంగా అక్కడ హత్యలు జరుగుతుంటాయి. దారుణంగా హత్య చేసినోడు సైతం.. కొంతకాలానికి తన మానాన తాను పోలీసుల వద్దకో.. కోర్టు ఎదుటో లొంగిపోతాడు. జైలుకు వెళ్లి వచ్చిన తర్వాత మళ్లీ హత్యకు గురవుతాడు. ఇదో చక్రం మాదిరి సాగుతూ ఉంటుంది. దీనికి ఫుల్ స్టాప్ పడని పరిస్థితి. తాజాగా కర్నూలు జిల్లాలో టీడీపీకి చెందిన అన్నదమ్ములు ఇద్దరు దారుణ హత్యకు గురి కావటం తెలిసిందే.
బాధిత కుటుంబాల్ని పరామర్శించటానికి వెళ్లిన లోకేశ్.. అవసరానికి మించిన ఆవేశంతో సీఎం జగన్ ను ఉద్దేశించి అమర్యాదగా వ్యాఖ్యలు చేశారు. చుట్టూ చేరిన కార్యకర్తల్ని చూసి చెలరేగిపోయిన ఆయన.. మర్యాద మెట్టు దిగేశారు. అవసరం లేని సందర్భంలో అనవసరమైన వ్యాఖ్యను చేశారు. ‘‘నువ్వు మగాడివైతే సీబీఐ ఎంక్వయిరీ వేయ్ రా’’ అంటూ ముఖ్యమంత్రిపై నోరు జారిన వైనం వైసీపీ నేతల కోపాన్ని కట్టలు తెంచేలా చేసింది. ఏపీ అధికారపక్ష నేతలు ఒక్కొక్కొరిగా లోకేశ్ మీద విరుచుకుపడ్డారు. ఆయనపై కొడాలి నాని చేసిన ఘాటు వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

తాజాగా నెల్లూరు జిల్లా కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి నోరు తెరిచారు. సీమ ఫ్యాక్షన్ గురించి అందరికి తెలుసని.. దానికి ముఖ్యమంత్రి జగన్ కు సంబంధం ఏమిటి? అని ప్రశ్నించారు. ‘నువ్వో పిల్లకుంకవి.. మర్యాద నేర్చుకో.. లేకుంటే దేనితో కొట్టాలో దానితో కొడతారు జనం. మర్యాదగా మాట్లాడకపోతే తాట తీస్తాం. నువ్వసలు ఆడా కాదు.. మగా కాదు. కొజ్జావి నువ్వు. నువ్వేంది మాట్లాడేది మా ముఖ్యమంత్రిని. నోరు అదుపులో పెట్టుకో. నువ్వు చంద్రబాబు కొడుకువి అయ్యుండొచ్చు. మా జగన్‌మోహన్ రెడ్డి వెంట్రుక కూడా పీకలేవు నువ్వు ’ అంటూ ఫైర్ అయ్యారు. ఇదంతా చూసినప్పుడు సమయం.. సందర్భం చూసుకోకుండా అవసరానికి మించిన ఆవేశంతో వ్యాఖ్యలు చేసిన లోకేశ్ ఇప్పుడు మరింత పలుచన కావటమే కాదు.. చేసిన తప్పుకు తగ్గ ఫలితం అనుభవిస్తున్నారన్న మాట వినిపిస్తోంది.