Begin typing your search above and press return to search.

కాంగ్రెస్ మాజీ ప్రధాని ఫొటోలు టీఆర్ఎస్ ఎందుకు వాడుతోంది?

By:  Tupaki Desk   |   14 March 2021 6:30 AM GMT
కాంగ్రెస్ మాజీ ప్రధాని ఫొటోలు టీఆర్ఎస్ ఎందుకు వాడుతోంది?
X
చివరి శ్వాస వరకు కాంగ్రెస్ కోసం బతికిన మాజీ ప్రధాని పీవీ నరసింహరావు ఫొటోను టీఆర్ఎస్ ఎందుకు వాడుతోందని పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ధ్వజమెత్తారు. ఎంఎల్‌సి ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి సురభి వాణిదేవికి ఓటు వేయాలని ఓటర్లకు విజ్ఞప్తి చేస్తూ శనివారం ఉదయం టిఆర్‌ఎస్ అన్ని వార్తాపత్రికలలో ప్రకటన విడుదల చేయడాన్ని పీసీసీ చీఫ్ ఖండించారు.

ఈ ప్రకటనలో దివంగత పీవీ నరసింహారావు పెద్దచిత్రం ఉండడంపై కాంగ్రెస్ అభ్యంతరం వ్యక్తం చేసింది. తెలంగాణ ప్రజల మనోభావాలను దోచుకోవడమే లక్ష్యంగా టీఆర్ఎస్ వ్యవహరిస్తోందని ఉత్తమ్ మండిపడ్డారు. "నరసింహారావు కాంగ్రెస్ నాయకుడిగా దేశాన్ని పాలించాడు. అలాంటి ఆయనను టీఆర్ఎస్ ఓ న్ చేసుకోవడాన్ని మేము తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాం" అని పిసిసి అధ్యక్షుడు ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తాజాగా ముఖ్య ఎన్నికల అధికారి శశాంక్ గోయెల్ కు ఫిర్యాదు చేశాడు.

అనంతరం ఉత్తమ్ కుమార్ రెడ్డి విలేకరులతో మాట్లాడారు. ఎంఎల్‌సి ఎన్నికల్లో గ్రాడ్యుయేట్ల ఓట్లు కొనడానికి టిఆర్‌ఎస్ నాయకులు విపరీతంగా డబ్బు ఖర్చు చేస్తున్నారని ఉత్తమ్ ఆరోపించాడు. ఉద్యోగులకు 29% ఫిట్‌మెంట్ చెల్లించడం గురించి లీక్‌లు ఇవ్వడం ద్వారా కేసీఆర్ ప్రభుత్వం ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినట్లు కాంగ్రెస్ నాయకులు సిఇఓకు ఫిర్యాదు చేశారని ఉత్తమ్ తెలిపారు.

పోలింగ్ రోజున టీఆర్ఎస్ ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు తీసుకురావడానికి ప్రైవేట్ పాఠశాలలు, కళాశాల యాజమాన్యాలను బెదిరిస్తున్నారని కాంగ్రెస్ నాయకులు ఈసీకి ఫిర్యాదు చేశారు. "ఈసి దర్యాప్తు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. సోషల్ మీడియాలో, మీడియాలో ప్రకటనల కోసం టీఆర్ఎస్ చేస్తున్న ఖర్చు కోట్ల రూపాయలను దాటుతోంది. నకిలీ ఓటర్ల ఓటింగ్‌ను కూడా ఆపాలి ”అని పిసిసి చీఫ్ డిమాండ్ చేశారు.