Begin typing your search above and press return to search.

మహేష్ బాబుపై జగన్ ఫ్యాన్స్ ఆగ్రహం

By:  Tupaki Desk   |   1 July 2019 7:31 AM GMT
మహేష్ బాబుపై జగన్ ఫ్యాన్స్ ఆగ్రహం
X
సీనియర్ నటి, దర్శకురాలు విజయ నిర్మల మృతితో సినీ ఇండస్ట్రీ మొత్తం విషాదంలో మునిగిపోయింది. సూపర్ స్టార్ కృష్ణ ఆవేదన అంతా ఇంతా కాదు.. ఆయనను ఓదార్చడానికి తెలంగాణ సీఎం నుంచి ఏపీ సీఎం జగన్ వరకూ అందరూ వచ్చి వెళ్లారు. అయితే మహేష్ బాబు వైఖరి మాత్రం ఇప్పుడు విమర్శలకు తావిస్తోందని జగన్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు, ఆయన బావమరిది బాలక్రిష్ణ, లోకేష్ వచ్చినప్పుడు మహేష్ బాబు బాగా రిసీవ్ చేసుకున్నారు. నాన్న కృష్ణ వెంటే ఉండి బాబు - బాలయ్యలకు పరిస్థితిని వివరించాడు. అయితే ఏపీ సీఎం జగన్ వచ్చినప్పుడు మాత్రం మహేష్ బాబు కనిపించలేదు. కనీసం సీఎం వస్తున్నాడని కూడా హాజరు కాలేదు. ఇప్పుడు ఇదే సీఎం జగన్ ఫ్యాన్స్ లో ఆగ్రహం కట్టలు తెచ్చుకుంటోంది. సోషల్ మీడియా సాక్షిగా మహేష్ బాబును ట్రోల్స్ చేస్తున్నారు.

టీడీపీ అధినేత చంద్రబాబు పరామర్శకు వచ్చినప్పుడు హాజరై అన్నీ తానై వ్యవహరించిన మహేష్ ఫొటోలు బయటకు రాగానే జగన్ ఫ్యాన్స్ హర్టయ్యారు. జగన్ ను మహేష్ అవమానించారంటూ ఆయన అభిమానులు మండిపడుతున్నారు. జగన్ వస్తే కనీసం మాట వరుసకైనా రారా అని నిలదీస్తున్నారు. చంద్రబాబు కంటే వైఎస్ ఫ్యామిలీనే ఘట్టమనేని ఫ్యామిలీకి దగ్గర అంటూ ఉదాహరణలు ఎత్తి చూపుతున్నారు.

నాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వివాదంలో ఉన్న సూపర్ స్టార్ కృష్ణ ‘పద్మాలయ స్టూడియో’ భూములను క్రమబద్దీకరించారని.. మహేష్ ‘సైనికుడు’ సినిమా విడుదలైనప్పుడు వరంగల్ లో జరిగిన గొడవలో కూడా మహేష్ ను వైఎస్ క్షమించారని పాత విషయాలు జగన్ అభిమానులు తవ్వుతూ ఎత్తిచూపుతున్నారు.

ఇక మహేష్ బాబాయ్ ఘట్టమనేని ఆది శేషగిరిరావు కూడా మొన్నటివరకు వైసీపీలోనే ఉన్నారు. ఎన్నికల ముందే టీడీపీలో చేరారు. అంతేకాదు కృష్ణ ఫ్యామిలీ మొత్తం వైఎస్ ఆర్ సీపీ పార్టీతో అనుబంధం ఉన్నవారే. జగన్ కూడా మహేష్ కు బెస్ట్ ఫ్రెండే. ఇంత సాన్నిహిత్యం ఉన్నా కూడా ఏపీ సీఎం హోదాలో తొలిసారి వచ్చిన జగన్ ను మహేష్ రిసీవ్ చేసుకోకపోవడం.. పైగా ప్రతిపక్ష నేత చంద్రబాబు వచ్చిన సమయంలో ఉండడంతో జగన్ ఫ్యాన్స్ లో కోపం కట్టలు తెంచుకుంది. ప్రతిపక్ష నేతకు ఇచ్చిన గౌరవం అధికార పార్టీ సీఎంకు ఇవ్వరా అని మహేష్ ను నెటిజన్లు ప్రశ్నలతో కడిగేస్తున్నారు. ఇప్పుడు మహేష్ ను సోషల్ మీడియా వేదికగా ఇదే విషయంపై ట్రోల్స్ తో జగన్ ఫ్యాన్స్ ఎండగడుతున్నారు.