Begin typing your search above and press return to search.

వైఎస్ ఆర్ కు ఉన్న దమ్ము జగన్ కు లేదా?

By:  Tupaki Desk   |   3 Sep 2020 1:30 PM GMT
వైఎస్ ఆర్ కు ఉన్న దమ్ము జగన్ కు లేదా?
X
జగన్ కు ఓట్లేసి..151 సీట్లు ఇచ్చి గెలిపించింది ప్రజలు. వింటే గింటే జగన్ వారి మాటే వినాలి. వారికోసం నిబద్ధతతో పనిచేయాలి. జగన్ కు ప్రజలే అండదండా..కానీ మోడీ, అమిత్ షాలు కాదు కదా.. ప్రజలను మించింది ఈ ప్రజాస్వామ్యంలో ఏదీ లేదు. అలాంటి ప్రజల నుంచి ముక్కుపిండి విద్యుత్ బిల్లులు వసూలు చేసే విద్యుత్ మీటర్లను పెట్టాలని మోడీషాలు సూచిస్తున్నారు. రైతులు ఇది అన్యాయం అంటున్నారు. జగన్ తన జేబులోంచే ఇస్తాను రైతుల భయపడొద్దు అంటున్నాడు. కానీ ఇలాంటి దిక్కుమాలిన మెలికలు తాను అమలు చేయనని కేసీఆర్ కేంద్రం ముఖం మీదే చెప్తున్నాడు. మరి జగన్ ఎందుకు కేంద్రానికి భయపడి రైతులను ఇబ్బంది పెట్టే ఇలాంటి పనులు చేస్తున్నాడన్నది ఇప్పుడు అందరినీ తొలుస్తున్న ప్రశ్న. మీటర్లు పెట్టాక.. మళ్లీ కేంద్రం ఏదైనా తిరకాసు పెడితే మొదటికే మోసం వస్తుందని.. ఇలాంటి ప్రయత్నాలు మానుకోవాలని రైతులు కోరుతున్నారు. కేసీఆర్ లాగా అసలు మీటర్లే పెట్టవద్దని కోరుతున్నారు.

ఏపీ ప్రస్తుత సీఎం జగన్.. ఆయన తండ్రి వైఎస్ఆర్.. ఈ ఇద్దరిలో ఎవరు గొప్ప అంటే చెప్పడం కష్టం. ఎందుకంటే ఇద్దరూ సంక్షేమ రాజ్యాన్నే నెలకొల్పుతున్నారు. కానీ వైఎస్ఆర్ ప్రవేశపెట్టిన అద్భుత పథకాలు ఇప్పటికీ తెలుగునేలపై కొనసాగుతున్నాయి. వైఎస్ఆర్ అంటేనే ‘ఉచిత విద్యుత్’.. ఉచిత విద్యుత్ అంటే వైఎస్ఆర్ గుర్తుకు వచ్చేలా ఆ అద్భుత కార్యక్రమానికి వైఎస్ఆర్ శ్రీకారం చుట్టారు.

ఆనాడు కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సోనియాగాంధీ, మన్మోహన్ వ్యతిరేకించినా ‘తాను మాట ఇచ్చానని.. రైతులకు ఇచ్చిన మాట తప్పను ’ అని వైఎస్ఆర్ నాడు ఖరాఖండీగా నిలబడ్డాడు. సోనియా, మన్మోహన్ ను ఒప్పించి మరీ రైతులకు ఉచిత కరెంట్ ను వైఎస్ఆర్ నాడు ఇచ్చాడు.

పైగా రైతులకు ఉచిత కరెంట్ ఇచ్చి అది రాష్ట్ర ఖజానా నుంచి.. రాష్ట్ర విద్యుత్ శాఖ నుంచే డబ్బులు ఇచ్చాడు. దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని ఈ మంచి కార్యక్రమాన్ని వైఎస్ఆర్ చేశాడు. పైగా మొట్టమొదటి సంతకం కూడా ఉచిత విద్యుత్ అమలు మీదే వైఎస్ఆర్ పెట్టాడు.

ఇంతకుముందు ఉన్న చంద్రబాబు.. నాడు వైఎస్ఆర్ ను ఎగతాళి చేశాడు. ఉచిత కరెంట్ ఇస్తే కరెంట్ తీగలపై బట్టలు ఆరేసుకోవాలని ఎద్దేవా చేశాడు.. వైఎస్ఆర్ సీఎం అయిన తరువాత చంద్రబాబును ఇప్పుడు కరెంట్ తీగలు ముట్టుకో బాబూ.. షాక్ కొట్టి పోతావ్ అని ఇదే వైఎస్ఆర్ సెటైర్లు వేశాడు. ఆ వీడియో వైరల్ అయ్యింది.

కేంద్రం మీద పోరాడి సాధించిన వైఎస్ఆర్ ఆశయాలు పుణిచిపుచ్చుకున్న జగన్ ఇప్పుడు వెనుకంజవేస్తున్నారు. 151 సీట్లు గెలిచిన ఆయన కుమారుడు జగన్ కేంద్రానికి తలవంచాడని అంటున్నారు. సోనియా గాంధీని సైతం ఎదురించి జైలుకు వెళ్లిన జగన్.. అంత ధైర్యం చేయడం లేదని.. ఇప్పుడు మోడీ, అమిత్ షాలను చూసి ఎందుకు భయపడుతున్నాడని.. వాళ్లు చెప్పినట్టు చేస్తున్నారని ప్రజలు అనుకుంటున్నారు. ఈరోజు కేంద్రం విద్యుత్ మీటర్లు పెట్టమంటారు.. రేపు ఉచిత కరెంట్ తీసివేయమంటారు.. అది చేస్తారా అని ప్రశ్నిస్తున్నారు.

వైఎస్ఆర్ చేసిన మంచి కార్యక్రమాన్ని కేంద్రం ఇన్ డైరెక్టుగా తూట్లు పొడుస్తోందని.. తెలియకుండా మన రాష్ట్రాన్ని బీజేపీ సర్వనాశనం చేయబోతోందని కూడా రైతులు వాపోతున్నారు. ఏది ఏమైనా కేంద్రానికి జగన్ తలొగ్గకుండా మీటర్లు పెట్టకుండా డైరెక్టుగా ఉచిత కరెంట్ ఇస్తేనే మేలు అని.. లేకపోతే జగన్ ఇబ్బందుల్లో పడుతాడు అని కూడా అంటున్నారు.

కానీ ప్రభుత్వం మాత్రం.. తాము ఉచిత విద్యుత్ ను ఎత్తివేయడం లేదు అని.. మీటర్లు పెడుతామని.. డబ్బులను మేమే రైతులకు ఇస్తామని చెప్తోంది, కొన్ని రోజులు పోయిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోదని.. అలాంటప్పుడు జగన్ ఏం చేస్తాడన్నది ప్రశ్న.

ఇప్పటికే కేసీఆర్ ఈ ప్రొపోజల్ కు ఒప్పుకోవడం లేదు. రైతులకు న్యాయం చేయాలంటే ఉచిత కరెంట్ ఉండాలని ఖరాఖండీగా చెప్తున్నారు. అలా కేంద్ర ప్రభుత్వం మీద పోరాడి సాధించాలి. కేంద్రం చెప్పినట్టు వింటూ ఉంటే ఏపీ నష్టపోతుందని కూడా మేధావులు హితవు పలుకుతున్నారు.