Begin typing your search above and press return to search.

అర్థ‌రాత్రి వేళ ప‌వ‌న్ ను సీబీఐ మాజీ జేడీ ఎందుకు క‌లిసిన‌ట్లు?

By:  Tupaki Desk   |   17 March 2019 5:45 AM GMT
అర్థ‌రాత్రి వేళ ప‌వ‌న్ ను సీబీఐ మాజీ జేడీ ఎందుకు క‌లిసిన‌ట్లు?
X
సీబీఐ అధికారిగాఎంత సంచ‌ల‌నం సృష్టించారో.. ఆయ‌న పైన అన్నే విమ‌ర్శ‌లు ఉన్నాయి. నీతిగా.. నిజాయితీగా ఉన్నార‌ని చెబుతుండే మాజీ జేడీ ల‌క్ష్మీనారాయ‌ణ ప‌క్ష‌పాతంతో వ్య‌వ‌హ‌రిస్తార‌న్న ఆరోప‌ణ ఉంది. ఉద్యోగానికి రాజీనామా చేసిన ఆయ‌న రాజ‌కీయాల్లోకి వచ్చేందుకు ఇటీవ‌ల కాలంలో ఆస‌క్తిని ప్ర‌ద‌ర్శించిన సంగ‌తి తెలిసిందే. ఆయ‌న ఆ పార్టీలో చేర‌తారు? ఈ పార్టీలో చేరతారు? అంటూ పెద్ద ఎత్తున చ‌ర్చ‌లు జ‌రిగాయి.

ఈ మ‌ధ్య‌న ఆయ‌న టీడీపీలో చేరేందుకు రంగం సిద్ధ‌మైంద‌ని.. ఆయ‌న కోసం మంత్రి గంటా ప్రాతినిధ్యం వ‌హిస్తున్న భీమిలీ సీటును ఇచ్చేందుకు సిద్ధ‌మైన‌ట్లుగా వార్త‌లు వ‌చ్చాయి. అయితే.. ఆయ‌న ఎప్పుడైతే టీడీపీలోకి వ‌స్తార‌న్న వార్త‌లు వ‌చ్చాయో.. అప్ప‌టివ‌ర‌కే ల‌క్ష్మీనారాయ‌ణ ప‌ట్ల పాజిటివ్ గా రియాక్ట్ అయ్యే వారు సైతం అనుమానం వ్య‌క్తం చేయ‌టం.. మాజీ జేడీ ఇంత త‌ప్పు నిర్ణ‌యం ఎందుకు తీసుకుంటారు? అన్న చ‌ర్చ జ‌రిగింది.

జ‌గ‌న్ కేసుల విష‌యం వెనుకున్న వాస్త‌వం అంద‌రికి తెలిసిందే. రాజ‌కీయ క‌క్ష సాధింపు చ‌ర్య‌ల్లో భాగంగానే కేసులు పెట్టి.. జైల్లో ఉండేలా చేశారే త‌ప్పించి మ‌రింకేమీ లేద‌న్న అభిప్రాయాన్ని ప‌లువురు వ్య‌క్తం చేస్తుంటారు. ఏళ్ల‌కు ఏళ్లుగా సాగుతున్న కేసుల్లో ఇప్ప‌టివ‌ర‌కూ ఏ కేసు ఒక కొలిక్కి వ‌చ్చింది లేదు. ఈ విష‌యాన్ని ప‌క్క‌న పెడితే.. ఈ కేసుల విష‌యంలో సీబీఐ మాజీ జేడీ ల‌క్ష్మీనారాయ‌ణ కొంతమేర ప‌క్ష‌పాతంతో వ్య‌వ‌హ‌రించిన‌ట్లుగా విమ‌ర్శ‌లు ఉన్నాయి.

ఇదిలా ఉంటే.. శ‌నివారం అర్థ‌రాత్రి దాటిన త‌ర్వాత జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ తో మాజీ జేడీ భేటీ అయ్యారు. మొన్న‌టి వ‌ర‌కూ టీడీపీలో చేరేందుకు ఆస‌క్తి చూపుతున్న‌ట్లుగా వార్త‌లు వ‌చ్చిన‌ప్ప‌టికి.. అందుకు భిన్నంగా తాజాగా ఆయ‌న నిర్ణ‌యాన్ని మార్చుకున్న‌ట్లుగా చెబుతున్నారు. టీడీపీలో చేరాల‌నుకున్నా.. అలా చేరితే ఇప్ప‌టికే త‌న మీద ఉన్న ఆరోప‌ణ‌ల‌కు బ‌లం చేకూర‌టంతో పాటు..రాజ‌కీయంగా కూడా స‌వాళ్లు ఎదుర్కొనే అవ‌కాశం ఉంద‌న్న మాట వినిపిస్తోంది. దీంతో.. ఆయ‌న వెన‌క్కి త‌గ్గి జ‌న‌సేన‌లో జాయిన్ అయ్యేందుకు మొగ్గు చూపిన‌ట్లుగా చెబుతున్నారు. ప‌వ‌న్ తో అర్థ‌రాత్రి భేటీ అనంత‌రం జ‌న‌సేన‌లో చేరేందుకు డిసైడ్ అయ్యారు. టీడీపీలో చేరితో త‌న ఇమేజ్ డ్యామేజ్ అవుతుంద‌న్న ఉద్దేశంతోనే జ‌న‌సేన‌లో ఆయ‌న చేరాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్లుగా స‌మాచారం.