Begin typing your search above and press return to search.

కేసీఆర్ కేబినెట్ భేటీ వాయిదా ఎందుక‌న‌గా?

By:  Tupaki Desk   |   30 Aug 2018 5:03 AM GMT
కేసీఆర్ కేబినెట్ భేటీ వాయిదా ఎందుక‌న‌గా?
X
ఊపిరి స‌ల‌ప‌లేనంత బిజీగా ఉన్నారు తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్‌. తాను కోరుకున్న‌ట్లుగా ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు వెళ్లాల‌న్న నిర్ణ‌యంపై ఆయ‌న ప‌ట్టుద‌ల‌తో ఉన్నారు. ప్ర‌భుత్వ ర‌ద్దుకు ముందు తీసుకోవాల్సిన నిర్ణ‌యాల‌పై ఆయ‌న బిజీబిజీగా ఉన్నారు. దీంతో వ‌రుస స‌మావేశాల‌తో కేసీఆర్ పెద్ద ఎత్తున స‌మావేశాలు నిర్వ‌హిస్తున్నారు.

ఇలాంటివేళ‌.. నంద‌మూరి హ‌రికృష్ణ అనూహ్యంగా మ‌ర‌ణంతో కేబినెట్ మీటింగ్ వాయిదా ప‌డింది. గురువారం హ‌రికృష్ణ అంత్య‌క్రియ‌లు నిర్వ‌హిస్తుండ‌టంతో గురువారం జ‌ర‌గాల్సిన మంత్రివ‌ర్గ స‌మావేశం జ‌రిగే అవ‌కాశం లేదు. మ‌రోవైపు తాను ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్వ‌హిస్తున్న ప్ర‌గ‌తి నివేద‌న స‌ద‌స్సు ఆదివారం కావ‌టం.. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు.. స‌మీక్ష‌లు నిర్వ‌హించి.. గ్రాండ్ స‌క్సెస్ చేయ‌టానికి అవ‌స‌ర‌మైన నిర్ణ‌యాలు తీసుకోవ‌టానికి క‌నీసం రెండు రోజులైనా వెచ్చించాల్సి ఉంటుంది. దీంతో.. శుక్ర‌.. శ‌నివారాల్లో మంత్రివ‌ర్గ స‌మావేశం జ‌రిగే వీల్లేద‌ని చెబుతున్నారు.

ఇక స‌భ నిర్వ‌హించే ఆదివారం కేబినెట్ భేటీకి వీల్లేదు. దీంతో.. స‌భ నిర్వ‌హించిన త‌ర్వాతే మంత్రివ‌ర్గ స‌మావేశం ఉంటుంద‌ని తెలుస్తోంది. ఒక‌వేళ‌.. అత్య‌వ‌స‌ర అంశాల‌పై త‌ప్ప‌నిస‌రిగా నిర్ణ‌యాలు తీసుకోవాల్సిన వాటిపై మాత్రం శుక్ర‌వారం కేబినెట్ భేటీ నిర్వ‌హించే వీలుంద‌ని చెబుతున్నారు.

ఇదిలా ఉంటే.. ముంద‌స్తు నేప‌థ్యంలో సీఎం కేసీఆర్ తీసుకోవాల్సిన నిర్ణ‌యాల్ని అత్యంత వేగంగా తీసుకుంటున్నారు. సీఎస్ తోపాటు కీల‌క అధికారుల‌తో ముఖ్య‌మంత్రి కేసీఆర్ వ‌రుస భేటీలు నిర్వ‌హిస్తూ.. ఒక ఫైలు త‌ర్వాత ఒక‌టి చొప్పున యుద్ధ ప్రాతిప‌దిక‌న క్లియ‌ర్ చేస్తున్నారు. తాజాగా తీసుకున్న నిర్ణ‌యాల్లో బీసీ కులాలకుచెందిన భ‌వ‌నాల నిర్మాణాల‌కు అవ‌స‌ర‌మైన భూముల్ని.. అందుకు అవ‌స‌ర‌మైన నిధుల‌పైనా నిర్ణ‌యం తీసుకుంటున్నారు. ఇందుకోసం ఆర్థిక శాఖ అధికారులతో వ‌రుస భేటీలు నిర్వ‌హిస్తున్నారు.