Begin typing your search above and press return to search.

దేవినేని ఉమాను కేసీఆర్ అందుకే ఆ మాట అన్నారట

By:  Tupaki Desk   |   21 Nov 2019 8:25 AM GMT
దేవినేని ఉమాను కేసీఆర్ అందుకే ఆ మాట అన్నారట
X
వైసీపీ ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్ చెప్పిన ఓ విషయం ఇప్పుడు కృష్ణా జిల్లా రాజకీయాల్లో చర్చనీయంగా మారింది. మాజీ మంత్రి దేవినేని ఉమా ఆడా కాదు మగా కాదు అని కేసీఆర్ అన్నారంటూ తెలంగాణ సీఎం ఒకప్పుడు చేసిన వ్యాఖ్యలను ఆయన మరోసారి గుర్తు చేశారు. నారా లోకేశ్, దేవినేని ఉమాలు ఎవరెవరి దగ్గర ఎంతెంత కమీషన్లు తీసుకున్నారో ఆ వివరాలన్నీ త్వరలో బయటపెడతానని ఆయన చెప్పారు.

దేవినేని ఉమా విమర్శలు చూస్తుంటే అసహ్యం వేస్తోందని.. మైలవరంలో ప్రజలు బుద్ది చెప్పిన ఉమాలో ఎలాంటి మార్పు రాలేదంటూ ధ్వజమెత్తారు. దేవినేని ఉమా ఇసుక మాఫియా కింగ్ అని తెలుసుకాబట్టే చంద్రబాబు ఇసుక దీక్ష వేదిక వద్దకు రానివ్వలేదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. పోలవరం ప్రాజెక్టు అనేది రాజశేఖర్ రెడ్డి కలల పంట అని ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ స్పష్టం చేశారు. 2018 కల్లా పోలవరం పూర్తి చేస్తామని ఉమా అసెంబ్లీ రాసుకోమన్నారని తీరా చూస్తే అక్కడ పనులు కూడా చేపట్టలేని పరిస్థితి నెలకొందన్నారు. ఉమా చేసిన అవినీతి నచ్చకనే రివర్స్ టెండరింగ్ కు వెళ్లినట్లు చెప్పుకొచ్చారు. రివర్స్ టెండరింగ్ వల్ల వందలకోట్లు ప్రభుత్వానికి ఆదా అయ్యిందని గుర్తు చేశారు.

దేవినేని ఉమామహేశ్వరరావు వెకిలి చేష్టలు చూసి తెలంగాణ ముఖ్యమంత్రి సైతం తీవ్ర వ్యాఖ్యలు చేశారని.. దేవినేని ఉమా ఆడోమగో తెలియదంటూ సీఎం కేసీఆర్ అన్న వ్యాఖ్యలు నిజమేననిపిస్తోందన్నారు. కేసీఆర్ విమర్శలే నిజమయ్యేలా దేవినేని ఉమా ప్రవర్తిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవినేని ఉమామహేశ్వరరావుకి పిచ్చెక్కినట్లు ఉందని అందుకే ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారంటూ విరుచుకుపడ్డారు. సీఎం జగన్ తలుపులు తెరిస్తే టీడీపీ పూర్తిగా ఖాళీ అయిపోవడం ఖాయమన్నారు. రాష్ట్రమంత్రులపై దేవినేని వ్యాఖ్యలు సరికాదన్నారు. మంత్రులను పట్టుకుని సన్నాసి అని మాట్లాడటం రాజకీయాల్లో సరికాదంటూ విరుచుకుపడ్డారు. సీఎం జగన్ కు సంస్కారం ఉంది కాబట్టే టీడీపీ నేతలు పట్ల గౌరవంగా మాట్లాడుతున్నారని చెప్పుకొచ్చారు. ఇకనైనా దేవినేని ఉమ నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు. మాజీమంత్రులు లోకేష్, ఉమా ఎక్కడెక్కడ కమిషన్లు తీసుకున్నారో ఇచ్చిన వారెవరతో త్వరలోనే మీడియా సమావేశం పెట్టబోతున్నట్లు చెప్పుకొచ్చారు. మైలవరం నియోజకవర్గం పనుల్లో లోకేష్ కు 5 శాతం దేవినేని ఉమాకు 3 శాతం చొప్పున కమిషన్లు వసూళ్లు చేశారని ఆరోపించారు