Begin typing your search above and press return to search.

ఆలె నరేంద్ర - విజయశాంతి.. ఓ ఈటల.?

By:  Tupaki Desk   |   30 Aug 2019 5:37 AM GMT
ఆలె నరేంద్ర - విజయశాంతి.. ఓ ఈటల.?
X
కలుగులో దూరిన ఎలుకను బయటకు ఎలా పంపిస్తాం.. అంటే పొగబెట్టి.. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితిలో మంత్రి ఈటలను అలాగే పార్టీ నుంచి సాగనంపే కుట్ర ఏదో జరుగుతోందని ఆయన అనుయాయులు మథన పడుతున్నారట.. అందుకే నిన్న తన సొంత నియోజకవర్గంలో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో ఈటల బరెస్ట్ అయ్యాడు. తన ఆవేదనంతా వెళ్లగక్కాడు.

ఈటల రాజేందర్.. తెలంగాణ రాష్ట్ర సమితిలో 2014కు ముందు కేసీఆర్ తర్వాత రెండో స్థానానికి చేరిన వ్యక్తి. వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈటల టీఆర్ ఎస్ శాసనసభాపక్ష నేతగా ఉండేవారు. ఎంపీగా కేసీఆర్ ఢిల్లీలో చక్రం తిప్పితే.. రాష్ట్రంలో పార్టీకి పెద్దదిక్కుగా కీలక నిర్ణయాల్లో నంబర్ 2గా వ్యవహరించేవారు. అప్పటికీ హరీష్- కేటీఆర్ లు రాజకీయాల్లో కొత్త కావడంతో ఈటలనే పార్టీ భారం అంతా మోసేవాడు.

అయితే తాజాగా ఈటల రాజేందర్ ను పొగబెట్టి సాగనంపే చర్యలు మొదలయ్యాయని చెప్పక తప్పదు. కేసీఆర్ సొంత పత్రికతోపాటు సామీప్యంగా ఉండే మరో పత్రికలో ఈటల రాజేందర్ ను మంత్రి వర్గంలోంచి తొలగించబోతున్నారని పెద్ద ఎత్తున వార్తలు ప్రచురిస్తున్నాయి. కేబినెట్ మీటింగ్ సమావేశాలను రెవెన్యూ ఉద్యోగులకు ఈటల లీక్ చేశారని.. ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా ఉద్యోగులకు మద్దతుగా నిలుస్తున్నాడన్నది ఆయనపై అభియోగాలు..

తెలంగాణ తొలి ప్రభుత్వంలో కేసీఆర్ తర్వాత నంబర్ 2 హోదాలో ఆర్థిక, పౌరసరఫరాల శాఖ మంత్రిగా ఈటల రాజేందర్ కీలకంగా వ్యవహరించారు. ఇప్పుడు రెండో దఫాలో ఆయనకు మంత్రి పదవి కూడా దక్కదని ప్రచారం జరిగింది. తెల్లవారితే మంత్రి పదవి ప్రమాణ స్వీకారం ఉండగా.. ఆయనకు అర్ధరాత్రి 12 తర్వాత ప్రమాణ స్వీకారానికి రెడీగా ఉండాలని సీఎంవో ఆఫీసునుంచి ఫోన్ వచ్చిందట.. తనను నిర్లక్ష్యం చేశారని అప్పుడే ఆయన సన్నిహితుల వద్ద వ్యాఖ్యానించారట..

ఇక టీఆర్ ఎస్ లో కేసీఆర్ తర్వాత నంబర్ 2 పొజిషన్ లో ఉన్నవాళ్లందరూ పార్టీకి దూరమైన సెంటిమెంట్ ఉంది. టీఆర్ ఎస్ పార్టీ పెట్టినప్పుడు కేసీఆర్ తోపాటు నడిచిన ఆలె నరేంద్ర, ఆ తర్వాత విజయశాంతి కూడా కేసీఆర్ తీరు నచ్చక ఇతర పార్టీల్లో చేరిపోయారు. ఇప్పుడు నంబర్ 2 ఈటల రాజేందర్ పరిస్థితి కూడా అంతేనా అన్న చర్చ గులాబీ పార్టీలో సాగుతోంది. మరి కేసీఆర్ మంత్రివర్గ విస్తరణ జరిగే వరకూ ఈటల భవిష్యత్ ఏంటనేది చెప్పడం కష్టమే..