Begin typing your search above and press return to search.

ఢిల్లీలో కేసీఆర్ అన్ని రోజులు ఉన్నది ఎందుకో క్లారిటీ వచ్చింది?

By:  Tupaki Desk   |   17 Nov 2021 9:30 AM GMT
ఢిల్లీలో కేసీఆర్ అన్ని రోజులు ఉన్నది ఎందుకో క్లారిటీ వచ్చింది?
X
ఎప్పుడో కానీ దేశ రాజధాని ఢిల్లీకి వెళ్లని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్.. ఒకవేళ వెళ్లినా.. వెంటనే రాష్ట్రానికి తిరిగి వస్తారు. ముఖ్యమంత్రిగా వ్యవహరించిన ఏడున్నరేళ్ల కాలంలో రెండు సందర్భాల్లో మాత్రమే ఎక్కువకాలం ఢిల్లీలోనే ఉండిపోయారు. ఒక సందర్భంలో ఆయన కంటి సమస్య కారణంగా డాక్టర్ అపాయింట్ మెంట్.. వైద్య పరీక్షల కోసం ఉంటే.. మరోసారి మాత్రం కారణం మాత్రం బయటకురాలేదు. దాదాపు ఐదారు రోజులకు పైనే ఢిల్లీలో ఉన్న కేసీఆర్.. బిజీబిజీగా గడిపారు.

ఆ సందర్భంగా పలు పుకార్లు షికార్లు చేశాయి. కానీ.. వాటికి సంబంధించిన ఎలాంటి ఆధారాలు బయటకు రాలేదు.ఇంతకూ అన్నేసి రోజులు కారణం లేకుండా కేసీఆర్ ఢిల్లీలో ఉంటారా? అన్న సందేహం మాత్రం అలానే ఉండిపోయింది. మిస్టరీగా మారిన ఈ ఢిల్లీ పర్యటనపై తాజాగా క్లారిటీ వచ్చింది. తాను ఢిల్లీకి వెళ్లిన సందర్భంగా ఎక్కువ రోజులు ఉన్న కారణాన్ని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తానే స్వయంగా వెల్లడించారు.

ఇక.. డైలీ ప్రెస్ మీట్ అంటూ ఊరించిన ఆయన.. రెండురోజుల పాటు హడావుడి చేసి ఆ తర్వాత కనిపించని ఆయన.. మళ్లీ వారానికి మీడియా భేటీని నిర్వహించారు. భేటీలో ధాన్యం కొనుగోలుపై కేంద్రం అనుసరిస్తున్న విధానాల్ని తీవ్రంగా తప్పు పడుతున్న ఆయన.. మోడీ సర్కారు మాటలు ఒకలా.. రాష్ట్రంలో బీజేపీ రాష్ట్రఅధ్యక్షుడు బండి సంజయ్ మాటలు మరోలా ఉన్నాయని మండిపడుతున్న ఆయన పలు అంశాల్ని ప్రస్తావించారు.

వరి ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం వైఖరి ఒక్కో రాష్ట్రంలో ఒక్కోలా ఉందన్నారు. తెలంగాణలో కొనేందుకు ముందుకు రాని కేంద్రం పంజాబ్ లో మాత్రం మొత్తం ధాన్యాన్ని కొంటోందన్నారు. ఇదేం పద్దతి అంటే సమాధానం లేదని.. ఎఫ్ సీఐ కొంటామని చెబుతుంటే.. కేంద్రం ఎందుకు నిరాకరిస్తుండటంతో అసలు విషయం తెలుసుకోవటానికి తాను స్వయంగా ఢిల్లీకి వెళ్లినట్లు చెప్పారు.

‘నామా నాగేశ్వరరావుతో పాటు కేంద్ర ఆహార శాఖ మంత్రిని కలిశా. ఎంఓయూ పద్దతి బాగా లేదని చెప్పా. సంవత్సరానికి రాష్ట్రం నుంచి ఎంత ధాన్యాన్ని కొంటారో చెబితే ప్లాన్ చేసుకుంటామని చెప్పా. క్లారిటీ కోసం అవసరమైతే రెండు రోజులు వెయిట్ చేస్తానని చెప్పా. ఢిల్లీలోనే ఉన్నా. ఎఫ్ సీఐ.. ఆహార మంత్రిత్వ శాఖ అధికారుల్ని పిలిపించి మాట్లాడారు.

కేంద్ర మంత్రుల టీంతో మాట్లాడి ఐదారురోజుల్లో సమాచారం ఇస్తామని చెప్పారు. 50 రోజులైనా ఇప్పటివరకు ఉలుకూ పలుకూ లేదు’’ అని చెప్పారు. ఈ కారణంతోనే తాను ఢిల్లీలో అన్ని రోజులు ఉన్నట్లు చెప్పారు. మొత్తంగా తాను ఢిల్లీలో ఉండి మరీ ధాన్యం కొనుగోలు మీద ఫాలో అప్ చేస్తే ఎలాంటి ఫలితం లేకుండా పోయిందన్నట్లుగా సీఎం కేసీఆర్ వ్యాఖ్యలు ఉన్నాయి.