Begin typing your search above and press return to search.

అందుకే.. హ‌రీశ్ కు మంత్రి ప‌ద‌వి ఇవ్వ‌లేదా?

By:  Tupaki Desk   |   19 Jun 2019 1:30 AM GMT
అందుకే.. హ‌రీశ్ కు మంత్రి ప‌ద‌వి ఇవ్వ‌లేదా?
X
తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ దృష్టి మొత్తం కాళేశ్వ‌రం ప్రాజెక్టు ఓపెనింగ్ మీద‌నే ఉంది. దాన్ని గ్రాండ్ గా ఓపెన్ చేసి.. తెలంగాణ‌లో త‌న‌కు మించిన పోటుగాడు లేడ‌న్న విష‌యాన్ని చాటి చెప్పాల‌న్న అతృత‌తో ఉన్న‌ట్లుగా చెబుతున్నారు. కేసీఆర్ ఇలా ఆలోచిస్తుంటే.. తెలంగాణ ప్ర‌జ‌ల ఆలోచ‌న మాత్రం మ‌రోలా ఉన్న‌ట్లుగా క‌నిపిస్తోంది. కాళేశ్వ‌రం ప్రాజెక్టు క్రెడిట్ కేసీఆర్ కు ఎలా ఇస్తారో.. అంత‌కంటే ఎక్కువ క్రెడిట్ హ‌రీశ్ రావుకు ఇవ్వాల్సిన అవ‌స‌రం ఉంద‌న్న మాట పెద్ద ఎత్తున వినిపిస్తోంది.

కాళేశ్వ‌రం ప్రాజెక్టు ప్రారంభోత్స‌వం సంద‌ర్భంగా ప్ర‌తి ఒక్క‌రూ ఆ ప్రాజెక్టు కేసీఆర్ గొప్ప‌త‌నంగా గొప్ప‌లు చెప్పుకుంటున్నార‌ని.. కానీ ఆ క్రెడిట్ లో సింహ‌భాగం హ‌రీశ్ కు చెందుతుంద‌న్న వాద‌న వినిపిస్తోంది. ప్రాజెక్టు ప‌నుల్ని స్వ‌యంగా ప‌ర్య‌వేక్షించ‌టంతో పాటు.. ప‌నుల్ని ప‌రుగులు పెట్టించ‌టంలో హ‌రీశ్ పాత్ర‌ను ఎవ‌రూ త‌క్కువ చేసి చూప‌లేరంటున్నారు.

రెండోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన త‌ర్వాత మంత్రివ‌ర్గంలోకి త‌న కుమారుడు కేటీఆర్.. మేన‌ల్లుడు హ‌రీశ్ కు మంత్రిప‌ద‌వులు ఇవ్వ‌కుండా చేసి ఆశ్చ‌ర్యానికి గురి చేశారు. అయితే.. కొడుక్కి మాత్రం టీఆర్ ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ హోదా ఇచ్చేసిన కేసీఆర్ ప‌వ‌ర్ కు సంబంధించి ఎలాంటి లోటు లేకుండా చేశారు. ఏతావాతా న‌ష్ట‌పోయింది ఎవ‌రైనా ఉన్నారంటే అది హ‌రీశ్ రావే.

ఈ రోజున అంద‌రు ఎమ్మెల్యేల మాదిరే హ‌రీశ్ రావు ఒక‌రు. అంతేకానీ.. అంత‌కు మించిన ఎలాంటి ప్ర‌త్యేక‌త లేదు. తొలిసారి ప్ర‌భుత్వం ఏర్ప‌డిన‌ప్పుడు తానే స్వ‌యంగా ప‌ర్య‌వేక్షించిన కాళేశ్వ‌రం ప్రాజెక్టు ప్రారంభోత్స‌వం వేళ‌లో.. త‌న క‌ష్టానికి ప్ర‌తిఫ‌లంగా శిలాఫ‌ల‌కం మీద హ‌రీశ్ పేరు లేకుండా కేసీఆర్ చేశార‌న్న ఆరోప‌ణ బ‌లంగా వినిపిస్తోంది. కాళేశ్వ‌రం ప్రాజెక్టు క్రెడిట్ మొత్తం త‌న ఒక్క‌డికే చెందాల‌న్న ఉద్దేశంతోనే హ‌రీశ్ కు మంత్రి ప‌ద‌వి ఇవ్వ‌లేద‌ని చెబుతున్నారు. హ‌రీశ్ విష‌యంలో కేసీఆర్ క‌డుపులో చాలానే దాగుంద‌న్న తీవ్ర‌మైన వ్యాఖ్య‌లు ప‌లువురు చేయ‌టం క‌నిపిస్తోంది. హ‌రీశ్ ను కేసీఆర్ అడ్డంగా తొక్కేశార‌ని..అందుకు తాజా ఉదాహ‌ర‌ణ‌ కాళేశ్వ‌రం ప్రాజెక్టేన‌ని చెబుతున్నారు. సోష‌ల్ మీడియాలోనూ.. బ‌య‌టా వినిపిస్తున్న‌ట్లు.. హ‌రీశ్ ను కేసీఆర్ తొక్కేశారంటారా?