Begin typing your search above and press return to search.

హైదరాబాద్ కే తలసాని పరిమితమా? ఢిల్లీకి తీసుకెళ్లరెందుకు?

By:  Tupaki Desk   |   27 July 2022 4:27 AM GMT
హైదరాబాద్ కే తలసాని పరిమితమా? ఢిల్లీకి తీసుకెళ్లరెందుకు?
X
ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండా.. ఎజెండా అన్నది బయటకు రాకుండా.. కేవలం గంటల ముందే తన ఢిల్లీ పర్యటన విషయాన్ని తెలంగాణ సీఎంవో మీడియాకు తెలియజేయటం ఆసక్తికరంగా మారింది. అదే సమయంలో.. తన వెంట తీసుకెళ్లిన నేతల అంశం కూడా పార్టీలో చర్చకు కారణమైందని చెప్పాలి. సీఎం కేసీఆర్ లెక్కలు అందరికి ఒక పట్టాన అర్థం కాదు. ఆయన ఎప్పుడేం చేస్తారన్న దానిపై అంచనా వేయలేరని చెబుతారు.

అందుకు తగ్గట్లే.. తాజాగా తనతో పాటు ఢిల్లీకి తీసుకెళ్లిన నేతల జాబితా చూస్తే.. రోటీన్ కు భిన్నంగా ఉందనే చెప్పాలి. నిజానికి ప్రతి కార్యక్రమానికి కొంతమంది నేతల్ని తనతో తీసుకెళ్లటం కేసీఆర్ కు అలవాటే. కాకపోతే.. ఎప్పుడు ఎవరికి అలాంటి లక్ లభిస్తుందో చెప్పలేని పరిస్థితి. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న వేళలో.. ఏపీకి వెళ్లిన సందర్భంలోనూ.. ఆ తర్వాత రాజధానిగా అమరావతి శంకుస్థాపన జరిగే వేళలో.. తన వెంట తీసుకెళ్లిన పార్టీ నేతల గురించి అందరికి తెలిసిందే.

అలాంటి కేసీఆర్ తాజాగా తన డిల్లీ పర్యటన సందర్భంగా వెంట తీసుకెళ్లిన నేతలు రోటీన్ కు భిన్నంగా ఉండటమే కాదు.. రోటీన్ కు భిన్నంగా ఉందని చెప్పాలి. అదే సమయంలో.. కొన్ని విషయాల్లోఅత్యధిక ప్రాధాన్యత ఇచ్చే నేతల్ని.. ఇలాంటి వేళల్లో అస్సలు పట్టించుకోకపోవటం కనిపిస్తుంది.

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హైదరాబాద్ వచ్చిన సందర్భంలో ఆయనకు స్వాగతం పలికేందుకు.. మంత్రి తలసానికి బాధ్యత అప్పగించటం.. నాలుగు నెలల వ్యవధిలో మూడుసార్లు హైదరాబాద్ నగరానికి వచ్చిన సందర్భంలో.. ఆ మూడుసార్లు ప్రధానికి స్వాగతం పలికే అరుదైన అవకాశాన్ని మంత్రి తలసాని చేజిక్కించుకున్నారు.

మరి.. అంతటి ప్రాధాన్యత ఇచ్చిన మంత్రి తలసానిని.. తన తాజా ఢిల్లీ పర్యటన సందర్భంగా మాత్రం తీసుకెళ్లకపోవటం విశేషం. ఎందుకిలా? అంటే.. ఎవరిని ఎప్పుడు దేనికి వాడుకోవాలో కేసీఆర్ కు బాగా తెలుసని చెప్పాలి. తాజా టూర్ లో ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిని.. కరీంనగర్ మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్ తో పాటు మరికొందరిని తీసుకెళ్లారు.

ఇంతకీ మంత్రి తలసానిని ఢిల్లీకి తీసుకెళ్లకపోవటానికి కారణం ఏమిటన్న దానికి కేసీఆర్ సన్నిహితులు చెప్పే మాటేమిటంటే.. ఢిల్లీలో తలసానికి అంత నెట్ వర్కు లేకపోవటం.. ఆయన అక్కడి కార్యకలాపాలకు 'సూట్' కారని.. ఆయనకున్న సంబంధాలు అంతంతమాత్రమేనని చెబుతారు. ఈ కారణంతోనే ఢిల్లీకి తలసాని వెంట వెళ్లే వీలు ఉండదని చెబుతారు. ఏమైనా.. ఎవరిని ఎప్పుడు ఎలా వాడాలో తెలియటమే అన్నింటికంటే కీలక అంశం. ఆ విషయంలో సీఎం కేసీఆర్ ను వేలెత్తి చూపించలేమని చెప్పాలి.